33
1 ✝యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, “నేను, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ‘నీ సంతతివారికి ఆ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళు. నీవు ఈజిప్ట్‌దేశంనుంచి వెంటబెట్టుకువచ్చిన ప్రజలతో పాలుతేనెలు నదులైపారుతున్న ఆ దేశానికి తరలివెళ్ళు. 2 నీకు ముందుగా దేవదూత✽ను పంపుతాను. కనాను, అమోరీ, హిత్తి, పెరిజ్జి, హివ్వి, యోబూసి✽ జాతులవారిని వెళ్ళగొట్టివేస్తాను. 3 ✝మీరు మొండి ప్రజలు, గనుక మిమ్ములను నాశనం చెయ్యకుండేలా నేను మీతోపాటు రాను.”4 ✽ ఆ దుర్వార్త విని ప్రజలు విచారపడ్డారు. ఎవ్వరూ ఆభరణాలు ధరించుకోలేదు. 5 అంతకుముందు యెహోవా మోషేతో, “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఇలా అను: మీరు తలబిరుసుగా ఉన్న ప్రజలు. ఒక క్షణమాత్రం నేను మీ మధ్యలోకి వస్తే మిమ్ములను సమూల నాశనం చేస్తాను. మీ ఆభరణాలు తీసివేయాలి. అప్పుడు మిమ్ములను ఏం చెయ్యాలో చూస్తాను” అన్నాడు. 6 అందుచేత ఇస్రాయేల్ ప్రజలు హోరేబు పర్వతం దగ్గర తమ ఆభరణాలు తీసివేశారు.
7 ✽మోషే శిబిరం వెలుపలికి గుడారాన్ని తీసుకువెళ్ళి శిబిరానికి దూరంగా వేసేవాడు. దాన్ని “సన్నిధిగుడారం” అన్నాడు. యెహోవాను వెదకుదామన్న ప్రతి ఒక్కరూ శిబిరానికి బయట ఉన్న ఆ సన్నిధిగుడారానికి వెళ్తూ వచ్చారు. 8 మోషే ఆ గుడారానికి వెళ్తూ ఉన్నప్పుడెల్లా ప్రజలంతా లేచేవారు, తమ తమ డేరా ద్వారాలలో నిలబడి మోషే ఆ గుడారంలో ప్రవేశించేవరకూ అతనివైపు చూస్తూ ఉండేవారు. 9 ✝మోషే ఆ గుడారంలో ప్రవేశించగానే స్తంభంలాంటి మేఘం దిగివచ్చి ఆ గుడారం ద్వారాన నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవాడు. 10 గుడారం ద్వారాన మేఘస్తంభం నిలవడం చూచినప్పుడెల్లా ప్రజలంతా లేచి తమ తమ డేరా ద్వారాలలో నమస్కారం చేసేవారు. 11 ✽ ఒక వ్యక్తి తన మిత్రుడితో మాట్లాడే విధంగానే యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడే వాడు. తరువాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు. అయితే అతని అనుచరుడు యెహోషువ గుడారంలోనుంచి బయటికి వచ్చేవాడు కాదు. యెహోషువ నూన్ కొడుకూ, యువకుడూ.
12 ✽ మోషే యెహోవాతో ఈ విధంగా అన్నాడు: “ఈ ప్రజను వెంటబెట్టుకొని వెళ్ళమంటూ నీవు నాతో చెపుతున్నావు గానీ నాతో ఎవరిని పంపిస్తావో అది నాకు తెలియజేయలేదు. అంతేగాక, నీవు నాతో అన్నావు గదా – ‘నేను నిన్నూ నీ పేరునూ ఎరుగుదును; నిన్ను దయతో చూస్తున్నాను.’ 13 ✽అందుచేత, నీవు నన్ను దయ చూస్తూ ఉంటే నేను నిన్ను తెలుసుకొనేలా నీ విధానాలు నాకు తెలియజెయ్యి. అప్పుడు నీవు నన్ను ఇంకా దయతో చూస్తావు. చూడు, ఈ జనం నీ ప్రజలే గదా.”
14 ✽అందుకు యెహోవా “నా సన్నిధానం నీతో వస్తుంది, నేను నీకు విశ్రాంతి ప్రసాదిస్తాను” అన్నాడు.
15 ✝మోషే ఆయనతో అన్నాడు, “నీ సన్నిధానం నాతో రాదంటే, ఇక్కడనుంచి మమ్ములను వెళ్ళేట్టు చెయ్యకు. 16 నీవు నన్నూ, నీ ప్రజనూ దయతో చూస్తున్నావని దేనివల్ల తెలుస్తుంది? నీవు మాతో రావడంవల్లే గదా. ఇలాగే గదా నేను, నీ ప్రజలు భూలోకంలో ఉన్న జనాలన్నిటికంటే ప్రత్యేకమైనవారుగా ఉంటాం.”
17 యెహోవా మోషేతో “నీవు చెప్పిన ఈ మాట ప్రకారం చేస్తాను. ఎందుకంటే నేను నిన్ను దయతో చూస్తున్నాను; నిన్నూ నీ పేరునూ ఎరుగుదును” అన్నాడు.
18 ✽మోషే “నీ మహిమను నాకు కనుపరచు!” అన్నాడు.
19 అందుకు ఆయన “నా సుగుణ✽మంతా నీ ముందు దాటేలా చేస్తాను. యెహోవా అనే పేరు✽ నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో✽ వారిమీద చూపుతాను; ఎవరిని కనికరించాలని ఉందో వారిని కనికరిస్తాను.”
20 ✝ఆయన ఇంకా అన్నాడు, “నీవు నా ముఖాన్ని చూడలేవు; ఎవ్వరూ నన్ను చూచి బ్రతకరు.”
21 యెహోవా ఇంకా అన్నాడు, “ఇదిగో నాకు దగ్గరగా ఒక స్థలం ఉంది. నీవు ఆ బండ✽మీద నిలబడాలి. 22 నా మహిమాప్రకాశం నీ దగ్గరనుంచి దాటి పోతూవున్నప్పుడు నేను నిన్ను ఆ బండ సందులో ఉంచి, నేను నీ దగ్గరనుంచి దాటి వెళ్ళేవరకూ నా చేతితో నిన్ను కప్పుతాను. 23 అప్పుడు నా చెయ్యి తీసివేస్తాను; నీవు నా వీపును చూస్తావు గానీ నా ముఖం కనిపించదు.”