32
1 ✽ఈలోగా పర్వతం మీదనుంచి మోషే రాకడ ఆలస్యం కావడం ప్రజలు చూచి, అహరోను దగ్గరికి గుమికూడి అతనితో ఇలా అన్నారు: “లే! మా ముందర వెళ్ళడానికి ఒక దేవుణ్ణి మా కోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్‌దేశంనుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు.”2 అందుకు అహరోను “మీ భార్యలకూ కొడుకులకూ కూతుళ్ళకూ చెవులకున్న బంగారు పోగులు ఊడదీసి నాదగ్గరికి తీసుకురండి” అన్నాడు.
3 ప్రజలంతా తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోనుదగ్గరికి తీసుకువచ్చారు. 4 అతడు వారి దగ్గర వాటిని తీసుకొని పోత పోసి చెక్కి దూడ రూపం చేశాడు. దాన్ని చూచి ప్రజలు “ఓ ఇస్రాయేల్‌వారలారా, ఇదే మీ దేవుడు! ఈజిప్ట్✽దేశం నుంచి మనల్ని రప్పించినది ఈ దేవుడే!” అన్నారు.
5 ఇదంతా చూచి అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టాడు; “రేపు యెహోవాకు పండుగ✽ జరుగుతుంది” అంటూ ప్రకటన చేశాడు. 6 మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి హోమాలు సమర్పించారు; శాంతి బలులు తెచ్చారు. తరువాత ప్రజలు తింటూ త్రాగుతూ కూర్చున్నారు, లేచి ఆడారు.
7 ✽అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు దిగివెళ్ళు! ఈజిప్ట్‌దేశంనుంచి నీవు రప్పించిన నీ ప్రజలు తమ్మును పాడు చేసుకొన్నారు, 8 నేను వారికి నియమించిన మార్గంనుంచి త్వరలోనే✽ తొలగిపొయ్యారు. తమ కోసం పోత పోసిన దూడను చేసుకొని దానికి మొక్కి, బలులు సమర్పించి ‘ఓ ఇస్రాయేల్ వారలారా, ఇదే మీ దేవుడు! ఈజిప్ట్‌దేశం నుంచి మనల్ని రప్పించినది ఈ దేవుడే!’ అని చెప్పుకొన్నారు.”
9 ✝యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, “ఈ ప్రజలు తలబిరుసువాళ్ళు. నేను చూశాను. 10 గనుక వారిమీద నా కోపాగ్ని✽ రగులుకోనియ్యి✽, వారిని దహించివెయ్యనియ్యి. అప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”
11 కానీ, మోషే తన దేవుడైన యెహోవాను ప్రాధేయపడుతూ ఇలా అన్నాడు: “యెహోవా, నీ ప్రజలమీద నీ కోపాగ్ని రగులుకోవడమెందుకు? ఈజిప్ట్‌దేశంనుంచి నీవు గొప్ప బలంచేతా బలిష్ఠమైన హస్తంచేతా వారిని తీసుకువచ్చావు. 12 ‘వారిని పర్వత ప్రదేశంలో సంహరించి భూతలం మీద లేకుండా నిర్మూలించే దురుద్దేశంతో ఆయన వారిని బయటికి తీసుకుపోయాడు’ అని ఈజిప్ట్‌వాళ్ళు అంటారు గదా. అదెందుకు? నీ కోపాగ్నినుంచి మళ్ళుకొని పరితపించి నీ ప్రజలకు ఈ కీడు చెయ్యకు. 13 నీ సేవకులైన అబ్రాహామునూ ఇస్సాకునూ ఇస్రాయేల్‌నూ తలచుకో. నీవు నీతోడని వారితో శపథం చేస్తూ ‘మీ సంతానాన్ని వృద్ధి చేసి లెక్కలో ఆకాశ నక్షత్రాలలాగా చేస్తాను; నేను చెప్పిన ఈ దేశాన్నంతా మీ సంతతివారికిస్తాను; అది వారికి నిత్యమైన✽ వారసత్వంగా ఉంటుంది’ అన్నావు.” 14 ✽అందుచేత యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చెయ్యలేదు.
15 ✝శాసనాలున్న రెండు పలకలను చేతపట్టుకొని మోషే పర్వతం దిగివచ్చాడు. ఆ పలకలు ఇరు ప్రక్కల వ్రాసినవి. ఈ ప్రక్క ఆ ప్రక్క లిఖించినవి. 16 ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకలమీద చెక్కిన వ్రాత దేవుని చేవ్రాత.
17 ఇస్రాయేల్‌ప్రజలు కేకలు వేస్తూవున్నారు. ఆ చప్పుడు విని యెహోషువ మోషేతో “శిబిరంలో యుద్ధధ్వని” అన్నాడు.
18 మోషే, “అది జయధ్వని కాదు, అపజయధ్వనీ కాదు. సంగీత నాదం నాకు వినిపిస్తూ ఉంది” అన్నాడు.
19 ✽ అతడు శిబిరాన్ని సమీపించినప్పుడు ప్రజలు నాట్యమాడడం, ఆ దూడ కనిపించాయి. మోషేకు తీవ్ర కోపం రగులుకొంది. తన చేతులలోనుంచి ఆ పలకలను పర్వతం దిగువ పడవేసి వాటిని పగలకొట్టాడు. 20 ✝వారు చేసిన ఆ దూడను తీసుకొని కాల్చాడు. దాన్ని పొడి చేశాడు. దానిని నీళ్ళమీద చల్లి దానిని ఇస్రాయేల్ ప్రజ త్రాగేలా బలవంతం చేశాడు.
21 ✝మోషే అహరోనును “నీవు ఈ ప్రజమీదికి ఈ గొప్ప అపరాధం తెచ్చిపెట్టేలా వారు నిన్ను ఏం చేసినట్టు?” అని అడిగాడు.
22 ✽అందుకు అహరోను ఇలా అన్నాడు: “స్వామీ, నీ కోపాగ్ని రగులుకోనియ్యకు. ఈ ప్రజలు దుర్బుద్ధి గలవారని నీకు తెలుసు. 23 వారు అన్నారు గదా, ‘మా ముందర వెళ్ళడానికి మాకోసం ఒక దేవుణ్ణి చెయ్యి. మమ్ముల్ని ఈజిప్ట్‌దేశంనుంచి రప్పించిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు.’ 24 ✽వాళ్ళతో నేనన్నాను, ‘ఎవరిదగ్గర బంగారం ఉందో వాళ్ళు దాన్ని ఊడదీసి తీసుకురండి.’ వాళ్ళు నాకు బంగారం ఇచ్చినప్పుడు నేను దాన్ని అగ్నిలో వేశాను. ఆ దూడ బయటికి వచ్చేసింది!”
25 ✽ ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు – వారు అలా చేయడానికి అహరోను వారిని విడిచిపెట్టాడు. అది వారి శత్రువులకు హాస్యాస్పదంగా ఉంది. 26 ఇది చూచి మోషే శిబిర ద్వారం దగ్గర నిలబడి, “యెహోవా పక్షం ఉన్నవారందరూ నాదగ్గరికి రండి” అన్నాడు. లేవీ గోత్రంవారంతా అతనిదగ్గరికి గుమికూడారు.
27 అతడు వారితో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, మీలో ప్రతి ఒక్కరూ తన ఖడ్గం ధరించి శిబిరం అంతటా ద్వారంనుంచి ద్వారానికి వెళ్తూ ప్రతి ఒక్కరూ తన సోదరుణ్ణీ తన స్నేహితుణ్ణీ తన పొరుగువాణ్ణీ చంపాలి.”
28 మోషే మాట ప్రకారం లేవీవారు చేశారు. ఆ రోజున ప్రజలలో దాదాపు మూడు వేలమంది కూలారు.
29 ✽మోషే లేవీవారితో “ఈ రోజు యెహోవాకు మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకోండి. మీలో ప్రతి ఒక్కరూ తన కొడుకుకూ సోదరుడికీ విరోధంగా వ్యవహరించి ఒక దీవెన సంపాదించు కున్నారు” అన్నాడు.
30 మరుసటి రోజు మోషే ప్రజలతో చెప్పాడు, “మీరు చేసినది ఘోర పాపం. నేను యెహోవాదగ్గరికి పర్వతమెక్కిపోతాను. ఒకవేళ మీ పాపంకోసం ప్రాయశ్చిత్తం చేయగలనేమో”.
31 మోషే యెహోవాదగ్గరికి తిరిగి చేరి, “అయ్యో! ఈ ప్రజ చేసినది ఘోర పాపమే! తమకోసం బంగారు దేవుణ్ణి చేసుకొన్నారు. 32 ✽ వారి పాపం క్షమించమని ప్రాధేయపడుతున్నాను. క్షమించకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథంలోనుంచి నా పేరు తుడిచివెయ్యి!” అన్నాడు.
33 ✝అందుకు యెహోవా “నాకు విరోధంగా పాపం చేసిన వారినే నా గ్రంథంలోనుంచి తుడిచివేస్తాను. 34 నీవు వెళ్ళి, నేను నీతో చెప్పిన దేశానికి ప్రజలను నడిపించు. నా దూత✽ నీకు ముందుగా వెళ్తాడు. అయితే శిక్షించే✽ రోజున వారి పాపం విషయం వారిని శిక్షిస్తాను” అన్నాడు.
35 ✽అహరోను చేసిన దూడను ప్రజలు చేయించినందుచేత యెహోవా వారిని బాధించాడు.