31
1 ✝యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 2 ✝“ఇదిగో విను, నేను ఊరీ కొడుకు బసెలేల్‌ను ప్రత్యేకించుకొన్నాను. అతడు యూదా గోత్రికుడు, హూరు మనుమడు. 3 నేను అతణ్ణి దైవాత్మతో నింపాను; అతనికి జ్ఞానం, తెలివి, వివేకం ప్రసాదించాను. 4 నేర్పుతో పనులను కల్పించడానికీ✽, బంగారం, వెండి, కంచుతో పని చెయ్యడానికీ, 5 పొదగడంకోసం రత్నాలను సానపెట్టడానికీ, మ్రానులను చెక్కడానికీ, అన్ని విధాల పనులను చెయ్యడానికీ అతణ్ణి ప్రవీణుణ్ణి చేశానన్నమాట. 6 అతనికి సహాయం చేయడానికి అహీసామాక్ కొడుకూ దానుగోత్రికుడూ అయిన అహోలీయాబును నియమించాను. నిపుణతగల పనివారందరికీ కూడా ఆంతర్యంలో నేర్పును ప్రసాదించాను. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ వారు చేస్తారు. 7 అంటే, సన్నిధిగుడారం, శాసనాలపెట్టె, దానిమీద ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూత, గుడారం కోసం అన్ని పాత్రలు, 8 బల్ల, దాని సామాను, మేలిమి బంగారు సప్తదీపస్తంభం, దాని సామానంతా, ధూపవేదిక, 9 హోమ బలిపీఠం, దాని సామానంతా, గంగాళం, దాని పీఠం, 10 నేసిన వస్త్రాలు, యాజులుగా సేవ చెయ్యడానికి అహరోనుయాజికోసం పవిత్ర వస్త్రాలూ అతని కొడుకులకోసం వస్త్రాలూ, 11 అభిషేకతైలం, పవిత్ర స్థలంకోసం పరిమళ ధూపద్రవ్యం – ఇవన్నీ నేను నీకాజ్ఞాపించిన ప్రకారం వారు చేస్తారు.”12 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 13 ✽ “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను నియమించిన విశ్రాంతి దినాలు మీరు ఆచరించితీరాలి. మిమ్ములను ప్రత్యేకించే యెహోవాను నేనే అని మీ తరతరాలవారు తెలుసుకొనేలా విశ్రాంతిదినం నాకూ మీకూ గురుతుగా ఉంటుంది. 14 కనుక మీరు విశ్రాంతి దినం ఆచరించాలి. అది మీకు పవిత్ర దినంగా ఉంటుంది. దాన్ని అపవిత్రం చేసేవాణ్ణి చంపాలి✽. ఆ రోజున ఏ పని అయినా చేసేవాణ్ణి తన ప్రజలలో లేకుండా చేయాలి.
15 ఆరు రోజులు పని చెయ్యవచ్చు గానీ ఏడో రోజు పూర్తిగా విశ్రమించవలసిన విశ్రాంతి దినం, యెహోవాకు పవిత్ర దినం. విశ్రాంతి దినాన ఏ పని అయినా చేసేవాణ్ణి తప్పక చంపాలి. 16 “ఇస్రాయేల్‌ప్రజలు విశ్రాంతి దినం ఆచరించాలి. తరతరాలకూ అది పాటించాలి. అది నిత్యమైన ఒడంబడిక. 17 ✝అది నాకూ ఇస్రాయేల్‌ప్రజలకూ నిత్యమైన గురుతుగా ఉంటుంది. ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్నీ భూమినీ చేసి ఏడో రోజున పని మాని విశ్రమించుకొన్నాడు.”
18 ✝యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం ముగించాక ఆయన అతనికి తన శాసనాలున్న రెండు పలకలను ఇచ్చాడు. దేవుని వ్రేలితో వ్రాసిన రాతి పలకలు అవి.