30
1 “ధూపం వేయడానికి తుమ్మకర్రతో ఒక వేదికను చెయ్యాలి. 2 దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉండాలి. దాని ఎత్తు రెండు మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. 3 దాని పైభాగానికీ దాని నాలుగు ప్రక్కలా దాని కొమ్ములకూ మేలిమి బంగారు తొడుగు చెయ్యాలి. దాని అంచుకు చుట్టూ బంగారు అలంకారం చెయ్యాలి. 4 ఆ అలంకారానికి క్రింద వేదికకు రెండు బంగారు ఉంగరాలు చెయ్యాలి. దాని ప్రక్కలకు ఇరువైపుల వాటిని ఉంచాలి. అవి ఆ వేదికను మోసే కర్రల కోసం. 5 ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి. 6  వేదికను శాసనాల పెట్టెకు ముందున్న తెర వెలుపల, ఆ శాసనాలపై ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూత ఎదుట ఉంచాలి. ఆ మూతదగ్గర నేను నిన్ను కలుసుకొంటాను. 7 ఆ వేదికమీద అహరోను పరిమళ ధూపద్రవ్యాలను కాల్చాలి. ప్రతి రోజూ ఉదయకాలంలో అతడు దీపాలను చక్కపరిచేటప్పుడు అలా కాల్చాలి. 8 సాయంకాలం కూడా అహరోను దీపాలు వెలిగించేటప్పుడు అలా కాల్చాలి. యెహోవా సన్నిధానంలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి. 9 ఆ వేదికమీద నిషేధమైన ధూపాన్ని వెయ్యకూడదు, హోమాన్ని గానీ నైవేద్యాన్ని గానీ అర్పించకూడదు; దానిమీద పానార్పణనూ అర్పించకూడదు. 10 ఆ వేదిక కొమ్ములమీద సంవత్సరానికి ఒకసారి అహరోను ప్రాయశ్చిత్తం చెయ్యాలి; ప్రాయశ్చిత్తానికి అర్పించిన పాపాలకోసమైన బలిరక్తంతో ఆ వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి ఇలా జరగాలి. ఆ వేదిక యెహోవాకు అతి పవిత్రంగా ఉంటుంది.”
11 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 12 “నీవు ఇస్రాయేల్‌ప్రజలను జాబితాలో చేర్చడానికి వారిని లెక్కపెట్టినప్పుడు, ఆ సమయంలో ప్రతి ఒకడూ తన ప్రాణం కోసం యెహోవాకు విడుదల వెల చెల్లించాలి. వారిని లెక్క పెట్టినప్పుడు వారిమీదికి విపత్తు రాకుండేలా వారు అలా చెయ్యాలి. 13 జాబితాలో చేరిన ప్రతివాడూ అర తులం వెండి ఇవ్వాలి; పవిత్రస్థానం తులం తూనిక ప్రకారం పూర్తి బరువు ఇవ్వాలి. ఆ అర తులం యెహోవాకు కానుకగా ఇవ్వాలి. 14 ఆ జాబితాలో చేరిన ప్రతివాడూ అంటే ఇరవై ఏళ్ళవారూ అంతకంటే ఎక్కువ వయస్సువారు అందరూ యెహోవాకు ఆ కానుక ఇవ్వాలి. 15 ధనవంతుడు అర తులంకంటే ఎక్కువ ఇవ్వకూడదు; బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. మీ ప్రాణాలకోసం ప్రాయశ్చిత్తం చెయ్యడానికి యెహోవాకు కానుక ఇచ్చేటప్పుడు అర తులమే ఇవ్వాలి. 16 ప్రాయశ్చిత్తంకోసం ఇస్రాయేల్‌ప్రజలు ఇచ్చిన ఆ వెండి నీవు తీసుకొని సన్నిధిగుడారం సేవకు ఉపయోగించాలి. అది మీ ప్రాణాల ప్రాయశ్చిత్తం కోసం, యెహోవా సన్నిధానంలో ఇస్రాయేల్ ప్రజలను గురించి స్మృతి చిహ్నంగా ఉంటుంది.”
17 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 18 “కడుగు కోవడానికి నీవు కంచు గంగాళం చెయ్యాలి. దానికి కంచు పీఠం కూడా చెయ్యాలి. నీవు దాన్ని సన్నిధిగుడారానికీ బలిపీఠానికీ మధ్య ఉంచాలి. దానిలో నీళ్ళు పోయాలి. 19 అహరోనూ అతని కొడుకులూ తమ చేతులూ కాళ్ళూ ఆ నీళ్ళతో కడుగుకోవాలి. 20 వారు సన్నిధిగుడారంలోకి వచ్చేటప్పుడు చావకుండేలా నీళ్ళతో కడుగుకోవాలి. సేవ చెయ్యడానికి వారు బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించేముందు, 21 చావకుండేలా చేతులూ కాళ్ళూ కడుగుకోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకూ అతని సంతానానికీ, తరతరాలకూ ఎప్పటికి నిలిచి ఉండే చట్టం.”
22 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 23 “నీవు అన్నిట్లో శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలను తీసుకొని పవిత్ర అభిషేక తైలం చెయ్యాలి. అయిదు వందల తులాల పలుచని బోళం, సుగంధంగల దాల్చిన చెక్క సగం అంటే, రెండు వందల యాభై తులాలు, 24 రెండు వందల యాభై తులాల నిమ్మగడ్డి, అయిదు వందల తులాల లవంగిపట్ట ఉపయోగించాలి. ఆ తులాలు పవిత్ర స్థానం తులం తూనిక ప్రకారం ఉండాలి. అయిదు లీటర్ల ఆలీవ్ నూనె కూడా ఉపయోగించాలి. 25 పరిమళ ద్రవ్యాన్ని చేసేవాడి నేర్పు ప్రకారం ఆ పరిమళ ద్రవ్యాన్ని చెయ్యాలి. అది పవిత్ర అభిషేక తైలంగా ఉంటుంది. 26 ఆ నూనెతో నీవు సన్నిధిగుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు శాసనాల పెట్టెనూ 27 బల్లనూ దాని సామానంతా సప్తదీపస్తంభాన్నీ దాని సామానంతా ధూపవేదికనూ 28 హోమ బలిపీఠాన్నీ దాని సామాన్నంతా, గంగాళాన్నీ దాని పీఠాన్నీ కూడా అభిషేకించాలి. 29 అవన్నీ అతి పవిత్రంగా ఉండేలా నీవు వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతిదీ పవిత్రమవుతుంది. 30  అహరోనూ అతని కొడుకులూ నాకు యాజులుగా సేవ చేసేలా నీవు వారిని కూడా అభిషేకించి ప్రతిష్ఠించాలి. 31 నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఇలా చెప్పాలి: “మీ తరతరాలకు ఇది నాకు పవిత్ర అభిషేక తైలం. 32 యాజులు కాని వారి శరీరంమీద దాన్ని పోయకూడదు; దాని పాళ్ళ ప్రకారం అలాంటిదాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది; దాన్ని పవిత్రమైనదిగా మీరు భావించాలి. 33 దానివంటి దాన్ని కలిపేవాణ్ణి గానీ దాన్ని యాజి కానివాడిమీద పోసేవాణ్ణి గాని తన ప్రజలలో లేకుండా చేయాలి.”
34 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: “నీవు పరిమళ ద్రవ్యాలను తీసుకొని ధూపద్రవ్యం చెయ్యాలి, జటామాంసినీ, గోపిచందనాన్నీ, గంధపుచెక్కనూ – ఈ పరిమళ ద్రవ్యాలనూ స్వచ్ఛమైన సాంబ్రాణినీ సమభాగాలుగా ఉపయోగించాలి. 35 పరిమళ ద్రవ్యాన్ని చేసేవాడి నేర్పు ప్రకారం వాటితో ధూపద్రవ్యాన్ని చెయ్యాలి. దానిలో ఉప్పు కూడా వెయ్యాలి. ఆ ధూప సంబారం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది. 36 దానిలో కొంత పొడి చేసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధిగుడారంలో శాసనాల పెట్టె ఎదుట ఉంచాలి. దాన్ని అతి పవిత్రమైనదిగా మీరు భావించాలి. 37 నీవు చెయ్యవలసిన ఆ ధూపంలాంటి దాన్ని, దాని పాళ్ళ ప్రకారం, మీకోసం చేసుకోకూడదు. దాన్ని యెహోవాకు పవిత్రమైనదిగా భావించాలి. 38 దాని వాసన చూద్దామని దానివంటిది చేసేవాణ్ణి ప్రజలలో లేకుండా చేయాలి.”