29
1 ✝“వారు నాకు యాజులుగా సేవ చేసేలా వారిని పవిత్రపరచడానికి నీవు ఇలా చెయ్యాలి: 2 ✝ఒక కోడె దూడనూ లోపం లేని రెండు పొట్టేళ్ళనూ తీసుకో. పొంగని రొట్టెనూ పొంగజేసేది లేక నూనెతో కలిపిన భక్ష్యాలనూ పొంగజేసేది లేక నూనె పూసిన పలచని అప్పడాలనూ కూడా తీసుకో. గోధుమపిండితో చేసినవే కావాలి. 3 వాటిని గంపలో పెట్టి ఆ గంపనూ ఆ దూడనూ ఆ రెండు గొర్రెపోతులనూ తీసుకురావాలి. 4 ✽ అహరోన్నూ అతని కొడుకులనూ సన్నిధిగుడారం ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నీళ్ళతో వారికి స్నానం చేయించాలి. 5 ✝ఆ వస్త్రాలను – చొక్కానూ ఏఫోదుకు చెందిన నిలువుటంగీనీ ఏఫోదునూ వక్షపతకాన్నీ తీసుకొని అహరోనుకు తొడిగించి ఏఫోదు కట్టును అతనికి కట్టాలి. 6 ✝అతని తలమీద పాగాను పెట్టి పాగాకు కిరీటంలాంటి ఆ పవిత్రమైన రేకు తగిలించు. 7 ✽ అప్పుడు అభిషేక తైలం అతని తలమీద పోసి అతణ్ణి అభిషేకించాలి. 8 ✝అతని కొడుకులను కూడా దగ్గరకు పిలిచి వారికి చొక్కాలను తొడిగించాలి. 9 ✝అహరోను కొడుకులకూ నడికట్లు కట్టి వారికి కుళ్ళాయిలను వేయించాలి. నీవు ఈ విధంగా అహరోన్నూ అతని కొడుకులనూ ప్రతిష్ఠించాలి. యాజి పదవి వారికే చెందుతుంది. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం.10 ✽ “అప్పుడా దూడను సన్నిధిగుడారం దగ్గరికి తెప్పించాలి. అహరోనూ అతని కొడుకులూ దూడ తలమీద చేతులుంచాలి. 11 ✝ఆ తరువాత నీవు ఆ దూడను యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారం ద్వారం దగ్గర వధించాలి. 12 దూడ రక్తంలో కొంత తీసుకొని నీ వ్రేలితో బలిపీఠం కొమ్ములమీద పూయాలి. మిగతా రక్తమంతా బలిపీఠం అడుగున పోయాలి. 13 ✝దాని పేగులను కప్పి ఉన్న క్రొవ్వంతా, కారిజం అంటి ఉన్న క్రొవ్వును, రెండు మూత్రపిండాలూ వాటిమీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠంమీద కాల్చివేయాలి. 14 ✽కాని, ఆ దూడ మాంసం, దాని చర్మం, దాని పేడ శిబిరం వెలుపల కాల్చివేయాలి. అది పాపాలకోసం బలి.
15 ✝“ఆ తరువాత ఆ పొట్టేళ్ళలో ఒకదానిని తీసుకోవాలి. అహరోనూ అతని కొడుకులూ దాని తలమీద చేతులుంచాలి. 16 అప్పుడు నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తం బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 17 పొట్టేలును ముక్కలుగా కోసి దాని పేగులూ కాళ్ళూ కడిగి ఆ ముక్కలతోను, తలతోను చేర్చి 18 ✽ పొట్టేలునంతా బలిపీఠంమీద కాల్చివేయాలి. అది యెహోవాకు హోమం, మంటల్లో బల్యర్పణ. అది యెహోవాకు పరిమళం✽గా ఉంటుంది.
19 ✝“ఆ రెండో పొట్టేలును కూడా తీసుకోవాలి. అహరోనూ అతని కొడుకులూ దాని తలమీద చేతులుంచాలి. 20 ✽అప్పుడు ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంత తీసుకొని అహరోను కుడిచెవి కొనమీద, అతని కొడుకుల కుడిచెవి కొనమీద పెట్టాలి. వారందరి కుడిచేతి బొటనవ్రేళ్ళమీదా, వారి కుడికాలి బొటనవ్రేళ్ళ మీద కూడా పెట్టాలి. మిగతా రక్తం బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 21 ✝అప్పుడు నీవు బలిపీఠంమీద ఉన్న రక్తంలో కొంత, అభిషేకతైలంలో కొంత అహరోనుమీదా అతని వస్త్రాల మీదా అతనితో ఉన్న అతని కొడుకులమీదా వారి వస్త్రాల మీదా చిలకరించాలి. అప్పుడు అతడూ అతనితోపాటు అతని కొడుకులూ పవిత్రంగా ఉంటారు, వారి వస్త్రాలు పవిత్రంగా ఉంటాయి. 22 ఆ పొట్టేలు సేవాప్రతిష్ఠ కోసం ఉంది, గనుక దాని క్రొవ్వూ క్రొవ్విన తోకా పేగులను కప్పి ఉన్న క్రొవ్వూ కారిజం అంటి ఉన్న క్రొవ్వూ రెండు మూత్రపిండాలూ వాటిమీది క్రొవ్వూ కుడి తొడా తీయాలి. 23 ✝వాటితోపాటు, యెహోవా ఎదుట ఉన్న గంపలోనుంచి పొంగని ఒక రొట్టె, నూనెతో వండిన ఒక భక్ష్యం, ఒక అప్పడం తీసుకొని 24 అవన్నీ అహరోను చేతుల్లో, అతని కొడుకుల చేతుల్లో ఉంచాలి. వాటిని కదలిక నైవేద్యంగా యెహోవా సమక్షంలో అటూ ఇటూ కదల్చాలి. 25 ఆ తరువాత వారి చేతుల్లో నుంచి వాటిని తీసి యెహోవా సమక్షంలో పరిమళ వాసన కలిగేలా ముందు అర్పించిన హోమం మీద బలిపీఠంపైన వాటిని కాల్చివేయాలి. అది యెహోవాకు హోమం.
26 ✝“అహరోను సేవా ప్రతిష్ఠకోసం ఉన్న ఆ పొట్టేలు బోరను నీవు చేతపట్టుకొని యెహోవా సన్నిధానంలో కదలిక అర్పణగా అటూ ఇటూ కదల్చాలి. అది నీ భాగమవుతుంది. 27 అహరోనుకూ అతని కొడుకులకూ సేవాప్రతిష్ఠ కోసం ఉన్న ఆ పొట్టేలు బోరను, ప్రత్యేకించబడ్డదాని తొడను నాకు ప్రతిష్ఠించాలి. 28 ✝ఆ భాగం అహరోనుది, అతని సంతతివారిది. అది వారికి ఇస్రాయేల్ ప్రజలు ఇచ్చిన కానుక. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం. అది ఇస్రాయేల్‌ప్రజలు సమర్పించే శాంతి బలులలోనుంచి ఇచ్చిన కానుక, యెహోవాకు అర్పించిన కానుక.
29 ✝“అహరోను పవిత్ర వస్త్రాలు అతని తరువాత అతని సంతతివారివి అవుతాయి. వారి అభిషేకం, సేవాప్రతిష్ఠ జరిగే కాలంలో వారు ఆ వస్త్రాలు ధరించుకోవాలి. 30 అహరోను సంతానంలో ఎవడైతే అతనికి ప్రతిగా యాజి అయి పవిత్ర స్థలంలో సేవ చెయ్యడానికి సన్నిధిగుడారంలోకి ప్రవేశిస్తాడో అతడు ఆ వస్త్రాలు ఏడు రోజులు ధరించుకోవాలి.
31 ✝“సేవాప్రతిష్ఠకోసం ఉన్న ఆ పొట్టేలును నీవు తీసుకొని ఏదైనా పవిత్రమైన చోట దాని మాంసం ఉడకబెట్టాలి. 32 అహరోనూ అతని కొడుకులూ సన్నిధిగుడారం ద్వారందగ్గర ఆ పొట్టేలు మాంసం, గంపలో ఉన్న ఆ రొట్టె తినాలి. 33 వారిని పవిత్రపరచడానికి, వారికి సేవాప్రతిష్ఠ కలిగించడానికి వేటివల్ల ప్రాయశ్చిత్తం✽ చేయబడిందో వాటిని వారు తినాలి. అవి పవిత్రమైనవి, గనుక యాజులు కాని వారెవరూ వాటిని తినకూడదు. 34 ✝సేవాప్రతిష్ఠ సంస్కార సంబంధమైన మాంసంలో గానీ ఆ రొట్టెలో గానీ కొంచెమైన ఉదయంవరకు మిగిలితే, మిగిలినది కాల్చివేయాలి. అది పవిత్రమైనది, దాన్ని తినకూడదు.
35 ✽“నేను నీకు ఆజ్ఞాపించినట్లెల్లా నీవు అహరోనుకూ అతని కొడుకులకూ చెయ్యాలి. ఏడు రోజులు వారి సేవాప్రతిష్ఠ సంస్కారం జరిగించాలి. 36 ✝వారి పాపాలను కప్పివేయడానికి ప్రతి రోజూ పాపాలకోసం ఒక దూడను సమర్పించాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడంతో దానిమీద పాపాలకోసం బలి అర్పించాలి. దానికి అభిషేకం చేసి, దాన్ని ప్రతిష్ఠించాలి. 37 ✝ఏడు రోజులు నీవు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని పవిత్రం చేయాలి. ఆ విధంగా అది అతి పవిత్రంగా ఉంటుంది. ఆ బలిపీఠానికి తగిలేదంతా పవిత్రంగా ఉంటుంది.
38 “నీవు బలిపీఠంమీద అర్పించవలసినవి ఏవంటే, ప్రతి రోజూ నిత్యమూ ఏడాదివి రెండు గొర్రెపిల్లలు. 39 ఒక గొర్రెపిల్లను ఉదయం, రెండోదాన్ని సాయంకాలం అర్పించాలి. 40 ఆ మొదటి గొర్రెపిల్లతోపాటు దంచి తీసిన ఆలీవ్ నూనెతో కలిపిన ఒక కిలోగ్రాం గోధుమ పిండినీ పానార్పణంగా✽ ఒక లీటర్ ద్రాక్షరసాన్నీ అర్పించాలి. 41 సాయంకాలం ఆ రెండో గొర్రెపిల్లను అర్పించాలి. ఉదయం అర్పించినట్టే దానితో కూడా ఆ అర్పణనూ పానార్పణనూ అర్పించాలి. అది యెహోవాకు హోమం. అది ఆయనకు పరిమళంగా ఉంటుంది. 42 ✝ఇది యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారం ద్వారం దగ్గర మీరు తరతరాలకూ నిత్యంగా అర్పించవలసిన హోమం. నీతో మాట్లాడడానికి నేను అక్కడికి వచ్చి మిమ్ములను కలుసుకొంటాను. 43 అక్కడే ఇస్రాయేల్‌ప్రజలను కూడా కలుసుకొంటాను. ఆ స్థలం నా మహిమాప్రకాశంవల్ల పవిత్రమవుతుంది.
44 “నేను సన్నిధిగుడారాన్నీ బలిపీఠాన్నీ ప్రతిష్ఠించుకొంటాను. అహరోనూ అతని సంతతివారూ నాకు యాజులుగా సేవ చేసేలా వారినీ ప్రతిష్ఠించుకొంటాను. 45 ✝నేను ఇస్రాయేల్‌ప్రజల మధ్య నివసిస్తాను, వారికి దేవుడుగా ఉంటాను. 46 ✝వారి మధ్య నివసించడానికే వారిని ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చిన యెహోవాను నేను, వారి దేవుణ్ణి. ఇది వారు తెలుసుకొంటారు. వారి దేవుడైన యెహోవాను నేనే.