28
1 ✽“నాకు యాజులుగా నీ అన్న అహరోనూ అతని కొడుకులూ సేవ చెయ్యాలి. వారిని, అంటే అహరోన్నూ అతని కొడుకులైన నాదాబునూ అబీహునూ ఎలియాజరునూ ఈతామారునూ, ఇస్రాయేల్ ప్రజలలోనుంచి నీదగ్గరకు పిలిపించు. 2 ✝నీ అన్న అహరోనుకు పవిత్ర వస్త్రాలను కుట్టించాలి. అవి వైభవంకోసం, ఘనతకోసం ఉంటాయి. 3 ✝అహరోను నాకు యాజిగా సేవ చేసేలా అతడి ప్రతిష్ఠకోసం అతని వస్త్రాలను కుట్టాలని నావల్ల జ్ఞానం పొందిన నేర్పుగలవారందరికీ ఆజ్ఞ జారీ చెయ్యి. 4 వారు కుట్టవలసిన వస్త్రాలేవంటే, ఒక వక్షపతకం, ఒక ఏఫోదు, నిలువుటంగీ, వివిధమైన రంగులుగల చొక్కాయి, పాగా, నడికట్టు. నీ అన్న అహరోను నాకు యాజిగా సేవ చేసేలా వారు అతనికోసం, అతని కొడుకులకోసం ఈ పవిత్ర వస్త్రాలను కుట్టాలి. 5 వారు బంగారాన్నీ నీలి ఊదా ఎర్ర రంగుల దారాలనూ సన్న నార బట్టనూ ఉపయోగించాలి.6 “వారు ఏఫోదు✽ను బంగారంతోను నీలి ఊదా ఎర్రరంగుల దారాలతోను పేనిన సన్ననార బట్టతోను కుట్టాలి. ఇది నేర్పుగల దర్జీవాడి పని. 7 దాని ముందు భాగం, వెనక భాగం కూర్చి ఉండేలా రెండు భుజఖండాలు దానికి ఉండాలి. 8 దానిమీది నేసిన కుట్టు దానిలాగే బంగారంతోను నీలి ఊదా ఎర్రరంగుల దారాలతోను పేనిన సన్ననార బట్టతోను ఏఫోదుతో ఏకాండంగా కుట్టాలి. 9 నీవు మిశ్రితవర్ణ రత్నాలు రెండు తీసుకొని వాటిమీద ఇస్రాయేల్ కొడుకుల పేర్లు వారి జన్మక్రమం ప్రకారం చెక్కించాలి. 10 ఒక రత్నంమీద ఆరు పేర్లు, రెండో రత్నంమీద మిగతా ఆరు పేర్లు చెక్కించాలి. 11 అది ముద్రమీద చెక్కిన దానిలాగా ఉంటుంది. చెక్కడం పనివాడిచేత ఆ రెండు రత్నాలమీద ఇస్రాయేల్ కొడుకుల పేర్లు చెక్కించాలి. వాటిని బంగారు జవలలో పొదగాలి. 12 ఈ రెండు రత్నాలూ ఇస్రాయేల్‌ప్రజలను గురించిన స్మృతిచిహ్నాలు. ఈ రత్నాలు ఏఫోదు భుజఖండాలమీద ఉంచాలి. అలా జ్ఞాపకార్థంగా అహరోను తన రెండు భుజాలమీద యెహోవా సన్నిధానంలో✽ వారి పేర్లు భరిస్తాడు. 13 బంగారు జవలనూ మేలిమి బంగారంతో రెండు గొలుసులనూ చెయ్యాలి. 14 దారాలను అల్లిన విధంగా ఆ గొలుసులను అల్లి వాటిని ఆ జవలకు తగిలించాలి.
15 “న్యాయ నిర్ణయాలు తెలిపే వక్షపతకం✽ కూడా నేర్పుగలవాడిచేత చేయించాలి. ఏఫోదు పనిలాగే దాన్ని చెయ్యాలి. బంగారంతోను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన సన్ననారబట్టతోను దాన్ని చెయ్యాలి. 16 దాన్ని మడత పెట్టాక అది చదరంగా ఉండాలి – దాని పొడుగు ఒక జేన, దాని వెడల్పు ఒక జేన. 17 రత్నాలు జవలలో పొదిగి ఆ పతకంలో నాలుగు పంక్తులుగా ఆ రత్నాలు పెట్టాలి. మొదటి పంక్తిలో మాణిక్యం, గోమేధికం, పచ్చ ఉండాలి. 18 రెండో పంక్తిలో పద్మరాగం, నీలం, వజ్రం ఉండాలి. 19 మూడో పంక్తిలో పుష్యరాగం, కెంపు, ఊదామణి ఉండాలి. 20 నాలుగో పంక్తిలో ఫిరోజా, మిశ్రితవర్ణరత్నం, సూర్యకాంతం ఉండాలి. వీటిని బంగారు జవలలో పొదగాలి. 21 ఇస్రాయేల్ కొడుకుల పన్నెండు పేర్లప్రకారం పన్నెండు రత్నాలుండాలి. ముద్రమీద చెక్కిన విధంగా వాటిమీద పన్నెండు గోత్రాల పేర్లు – ఒక్కొక్క రత్నంమీద ఒక్కొక్క పేరు – చెక్కాలి. 22 ఆ వక్షపతకంకోసం దారాలను అల్లిన విధంగా మేలిమి బంగారంతో గొలుసులను అల్లాలి. 23 వక్షపతకానికి రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని దాని రెండు కొనలకు తగిలించాలి. 24 అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను ఆ రెండు కొనలకున్న ఆ రెండు ఉంగరాలలో తగిలించాలి. 25 మిగిలిన రెండు కొనలను ఆ రెండు జవలకు తగిలించాలి. ఏఫోదు భుజఖండాల ముందు భాగాలమీద కట్టాలి. 26 బంగారంతో ఇంకా రెండు ఉంగరాలను చేసి ఏఫోదు ఎదుట, వక్షపతకం లోపలి అంచున దాని రెండు క్రింద కొనలకు తగిలించాలి. 27 ఇంకా రెండు బంగారు ఉంగరాలను చేసి ఏఫోదు కట్టు పైగా, దాని కూర్పు దగ్గరే, దాని భుజఖండాల ముందు భాగాలక్రింద తగిలించాలి. 28 వక్షపతకం ఏఫోదు కట్టుమీద ఉండాలి, ఏఫోదునుంచి వదలకుండా ఉండాలి, గనుక దాన్ని దాని ఉంగరాలతో ఏఫోదు ఉంగరాలకు నీలి దారంతో కట్టాలి.
29 “ఆ విధంగా అహరోను పవిత్రస్థలంలోకి వెళ్ళేటప్పుడెల్లా అతడు తన రొమ్ముమీద న్యాయ నిర్ణయాలు తెలిపే వక్షపతకంలో ఉన్న ఇస్రాయేల్ గోత్రాల పేర్లను యెహోవా సన్నిధానంలో నిత్య స్మృతి చిహ్నంగా భరిస్తాడు. 30 న్యాయనిర్ణయాలు తెలిపే వక్షపతకంలో ‘ఊరీం’ ‘తుమ్మీం✽’ ఉండాలి. అహరోను యెహోవా సన్నిధానంలోకి వెళ్ళేటప్పుడెల్లా అవి అతని రొమ్ముమీద ఉంటాయి. ఈ విధంగా అహరోను యెహోవా సమక్షంలో తన రొమ్ముమీద ప్రజలకోసం న్యాయ నిర్ణయాలు తెలిపే విధానం నిత్యం భరిస్తాడు.
31 “ఏఫోదుకు చెందిన నిలువుటంగీ✽ని కూడా పూర్తిగా నీలి దారంతో కుట్టాలి. 32 తలకోసం దాని నడుమ రంధ్రం ఉండాలి. ఆ రంధ్రంచుట్టూ అంగీ చినగకుండేలా కంఠ కవచ రంధ్రంలాగా దాని చుట్టూ వేసిన గోటు ఉండాలి. 33 ఆ అంగీ క్రింది అంచున చుట్టూ నీలి ఊదా ఎర్ర రంగు దారాలతో దానిమ్మ పళ్ళను చేసి తగిలించాలి; వాటి మధ్య బంగారు గంటలను దానిచుట్టూ తగిలించాలి. 34 బంగారు గంట, దానిమ్మ పండు; బంగారు గంట, దానిమ్మ పండు – ఇలా ఆ నిలువుటంగీ క్రింది అంచున చుట్టూ ఉండాలి. 35 సేవ చేసేటప్పుడెల్లా అహరోను దాన్ని ధరించుకోవాలి. అలా అతడు పవిత్రస్థలంలోకి యెహోవా సన్నిధానానికి ప్రవేశించేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు దాని గంటల ధ్వని వినిపిస్తుంది. అతడు చావకుండేలా అలా చేయాలి.
36 “నీవు మేలిమి బంగారు రేకు✽ ఒకదాన్ని చేసి ముద్ర చెక్కే విధంగా దానిమీద ఈ మాటలు చెక్కాలి; ‘యెహోవాకు పవిత్రం’. 37 అది పాగా ముందువైపున ఉండాలి. పాగాకు నీలి దారంతో దాన్ని కట్టాలి. 38 అది అహరోను నొసట ఉండాలి. ఇస్రాయేల్ ప్రజలు సమర్పించే పవిత్రమైన వాటిలో వారు తెచ్చి ఇచ్చినది ఏదైనా కానియ్యి దానిలో ఇమిడివున్న దోషం అహరోను భరిస్తాడు. ఈ కారణంచేత ఆ రేకు నిత్యం అహరోను నొసట ఉండాలి. అప్పుడు యెహోవా వారిని అంగీకరిస్తాడు. 39 సన్ననార బట్టతో చొక్కాను వివిధమైన రంగులుగలదిగా చెయ్యాలి. సన్ననారతో పాగాను కూడా చెయ్యాలి. నడికట్టును బుట్టాపనివాడు చెయ్యాలి.
40 ✽“అహరోను కొడుకులకు కూడా చొక్కాలనూ నడికట్లనూ కుళ్ళాయిలనూ చెయ్యాలి. అవి వైభవంకోసం, ఘనతకోసం ఉంటాయి. 41 ✝నీవు నీ అన్న అహరోనుకూ అతని కొడుకులకూ వాటిని తొడిగించాలి. వీరు నాకు యాజులుగా సేవ చేసేలా వారిని అభిషేకించి ప్రతిష్ఠించి పవిత్రం చేయాలి. 42 ✝వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి వారికోసం నార షరాయిలను చెయ్యాలి. అవి మొలనుంచి తొడలవరకు ఉండాలి. 43 ✽అహరోను, అతని కొడుకులు సన్నిధిగుడారంలోకి వెళ్ళినప్పుడు గానీ పవిత్రస్థానంలో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు గానీ అవి వారిమీద ఉండాలి. వారు దోషులు కాకుండా, చావకుండా వాటిని వేసుకోవాలి. ఇది అతనికీ అతని తరువాత అతని సంతానానికీ ఎప్పటికీ నిలిచివుండే చట్టం.