27
1 “తుమ్మకర్రతో ఒక బలిపీఠాన్నీ✽ కూడా నీవు చెయ్యాలి. దాని పొడుగు అయిదు మూరలు, దాని వెడల్పు అయిదు మూరలు. ఆ బలిపీఠం చదరంగా ఉండాలి; దాని ఎత్తు మూడు మూరలు. 2 దాని నాలుగు మూలలకు కొమ్ములను చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి కంచు తొడుగు చెయ్యాలి. 3 దాని బూడిద ఎత్తడానికి బిందెలనూ, దాని పారలనూ పళ్ళేలనూ ముళ్ళనూ నిప్పు తెచ్చే పాత్రలనూ కూడా చెయ్యాలి. ఈ సామానంతా కంచుతో చెయ్యాలి. 4 ఈ బలిపీఠానికి పెద్ద కంచు జల్లెడ చెయ్యాలి. దానిమీద దాని నాలుగు మూలలకు నాలుగు కంచు ఉంగరాలను చెయ్యాలి. 5 దాన్ని బలిపీఠం అంచుక్రింద, బలిపీఠం నడిమికి చుట్టు ఉంచాలి. 6 బలిపీఠం కోసం కర్రలను కూడా చెయ్యాలి. వాటిని తుమ్మకర్రతో చేసి వాటికి కంచుతొడుగు చెయ్యాలి. 7 బలిపీఠాన్ని మోయడానికి దాని రెండు పక్కల ఉండే ఉంగరాలలో ఈ కర్రలను ఉంచాలి. 8 బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చెయ్యాలి. పర్వతంమీద నీకు కనుపరచిన విధంగానే వారు దాన్ని చెయ్యాలి.9 “దైవనివాసం ఆవరణాన్ని ఏర్పరచాలి. అంటే, దక్షిణ దిక్కున ఉన్న వైపున ఆవరణంకోసం పేనిన సన్ననార తెరలుండాలి✽. వాటికి ఒక పక్కన నూరు మూరలు ఉండాలి. 10 వాటికి ఇరవై స్తంభాలూ, స్తంభాలకు ఇరవై కంచు గూళ్ళూ ఉండాలి. ఆ స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి. 11 అలాగే ఉత్తర దిక్కున ఈ కొననుంచి ఆ కొనకు నూరు మూరల పొడుగు గల తెరలుండాలి. వాటికి ఇరవై స్తంభాలూ, స్తంభాలకు ఇరవై కంచు గూళ్ళూ ఉండాలి. ఆ స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి. 12 పశ్చిమ దిక్కున ఆవరణం వెడల్పుకోసం యాభై మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు పది. వాటి గూళ్ళు పది. 13 తూర్పువైపున, ఉదయ దిక్కున, ఆవరణం వెడల్పు యాభై మూరలు. 14 ద్వారానికి ఒక పక్కన పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి గూళ్ళు మూడు. 15 రెండో పక్కన కూడా పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి గూళ్ళు మూడు. 16 ఆవరణ ద్వారానికి ఇరవై మూరల తెర ఒకటి ఉండాలి. నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన సన్ననార బట్టతోను నేతపని చేసేవాడు దాన్ని చెయ్యాలి. దాని స్తంభాలు నాలుగు, దాని గూళ్ళు నాలుగు. 17 ఆ ఆవరణం చుట్టున్న అన్ని స్తంభాలనూ వెండి పెండెబద్దలతో అతికించాలి. వాటి కొక్కేలు వెండివి, వాటి గూళ్ళు కంచువి. 18 ఆవరణానికి పొడుగు నూరు మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు అయిదు మూరలు, తెరలు పేనిన సన్న నారవి, వాటి గూళ్ళు కంచువి. 19 ఆ నివాసంలో జరిగే సేవకోసం ఉపయోగించే మిగతా సామానంతా మేకులన్నీ ఆవరణం మేకులన్నీ కంచువి.
20 “దీపాలు నిత్యం వెలిగించేలా వాటికోసం ఇస్రాయేల్ ప్రజలు దంచి తీసిన స్వచ్ఛమైన ఆలీవ్ నూనె✽ తేవాలని వారికి ఆజ్ఞ జారీ చెయ్యి. 21 ఆ దీపాలు సన్నిధిగుడారం✽లో శాసనాల పెట్టె ఎదుట ఉన్న తెరకు వెలుపల ఉండాలి. సాయంకాలంనుంచి ఉదయంవరకు యెహోవా సన్నిధానానికి ముందు ఆ దీపాలు ప్రజ్వలించేలా అహరోనూ అతని కొడుకులూ దాన్ని సవరిస్తూ ఉండాలి. ఇది ఇస్రాయేల్‌ప్రజలకు వారి తరతరాలకు ఎప్పటికి నిలిచి ఉండే చట్టం.