26
1 “నీవు పది తెరలతో ఆ నివాసాన్ని✽ చెయ్యాలి. ఆ తెరలు పేనిన సన్నమైన నార బట్టలతో చెయ్యాలి. నీల, ఊదా, ఎర్ర రంగుల దారాలు కూడా ఉపయోగించాలి. వాటికి నేర్పుగలవానిచేత కెరూబు రూపాలను బుట్టాలు వేయించాలి. 2 ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు. ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత. 3 అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. మిగతా అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. 4 ఒక తెర వరుసలో చివరి తెర అంచున నీలి దారంతో ఉంగరాలు చెయ్యాలి. రెండో తెరల వరుసలో చివరి తెర అంచున కూడా అలా చెయ్యాలి. 5 ఒక తెరకు యాభై అల్లిక ఉంగరాలు చెయ్యాలి; ఆ రెండో వరుసలోని తెర అంచున యాభై ఉంగరాలు చెయ్యాలి. ఆ ఉంగరాలు ఈ ఉంగరాలకు ఎదురుగా ఉండాలి. 6 యాభై కొలుకులను కూడా చెయ్యాలి. దైవనివాసం ఒకటే అయ్యేలా ఆ తెరలను ఈ తెరలకు ఆ కొలుకులతో తగిలించాలి.7 “ఆ నివాసంమీద పైకప్పుగా✽ మేక వెండ్రుకలతో తెరలను చెయ్యాలి. మొత్తం పదకొండు తెరలను చెయ్యాలి. 8 ప్రతి తెర పొడుగు ముప్ఫయి మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. పదకొండు తెరల కొలత ఒకటే. 9 అయిదు తెరలను ఒకటిగానూ, ఆరు తెరలను ఒకటిగానూ ఒకదానికొకటి కూర్చాలి. ఆరో తెరను గుడారం ఎదుటి భాగాన మడవాలి. 10 ఒక తెరల వరుసలో చివరి తెర అంచున యాభై అల్లిక ఉంగరాలు చెయ్యాలి; రెండో తెరల వరుసలో చివరి తెర అంచున యాభై ఉంగరాలు చెయ్యాలి; 11 యాభై కంచు కొలుకులను కూడా చేసి గుడారం ఒకటే అయ్యేలా ఆ కొలుకులను ఆ ఉంగరాలకు తగిలించి దాన్ని కూర్చాలి. 12 ఆ గుడారం తెరలో మిగిలిన వ్రేలాడేభాగం – మిగిలిన సగం తెర – దైవనివాసస్థలం వెనుకమీదనుంచి వ్రేలాడాలి. 13 గుడారం తెరల పొడుగులో మిగిలినది – ఈ పక్క ఒక మూర – ఆ పక్క ఒక మూర నివాసస్థలం కప్పడానికి దాని ఇరువైపుల పక్కలమీద వ్రేలాడాలి. 14 ఎర్రరంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళతో పైకప్పును చెయ్యాలి. దానిమీద ఉండడానికి గండుచేప తోళ్ళతో పైకప్పును చెయ్యాలి.
15 “ఆ దైవనివాసం కోసం తుమ్మకర్రతో నిలువు పలకలను✽ చెయ్యాలి. 16 పలక పొడుగు పది మూరలు, పలక వెడల్పు మూరెడున్నర ఉండాలి. 17 ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన రెండు కుసులు ఉండాలి. ఆ నివాసం పలకలన్నిటికీ అలా చెయ్యాలి. 18 నివాసం కుడిప్రక్కకోసం అంటే దక్షిణ దిక్కుకోసం, నా గుడారానికి ఇరవై పలకలను చెయ్యాలి. 19 ఒక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు వెండి గూళ్ళు, ఆ ఇరవై పలకలక్రింద నలభై గూళ్ళు చెయ్యాలి. 20 అలాగే ఆ నివాసం రెండో పక్కకోసం అంటే ఉత్తర దిక్కుకోసం ఇరవై పలకలనూ 21 వాటి నలభై వెండి గూళ్ళనూ చెయ్యాలి. ఒక్కొక్క పలకక్రింద రెండు గూళ్ళు ఉండాలి. 22 నివాసం వెనుకభాగం కోసం, అంటే పశ్చిమ దిక్కున ఉన్న భాగంకోసం ఆరు పలకలను చెయ్యాలి. 23 వెనుకభాగం కోసం నివాసం మూలలకు రెండు పలకలను చెయ్యాలి. 24 అవి అడుగున కూర్చి ఉండాలి; పై భాగాన మొదటి ఉంగరంవరకు ఒకదానితో ఒకటి అతికి ఉండాలి. రెండు మూలలకు ఉండవలసిన ఆ రెంటికీ అలా ఉండాలి. 25 పలకలు ఎనిమిది; వాటి వెండి గూళ్ళు పదహారు. ఒక్కొక్క పలకక్రింద రెండు గూళ్ళు ఉండాలి.
26 “తుమ్మకర్రతో అడ్డకర్రలను చెయ్యాలి. 27 నివాసానికి ఒకపక్క పలకలకోసం అయిదు అడ్డకర్రలనూ రెండో పక్క పలకలకోసం అయిదు అడ్డకర్రలనూ పశ్చిమ దిక్కున గుడారం వెనుక భాగంకోసం అయిదు అడ్డకర్రలనూ చెయ్యాలి. 28 ఆ పలకలమధ్య ఉండే నడిమి అడ్డకర్ర ఈ కొననుంచి ఆ కొనవరకు ఉండాలి. 29 పలకలకు బంగారు తొడుగు చెయ్యాలి. వాటి అడ్డకర్రలను పట్టే ఉంగరాలను బంగారంతో చెయ్యాలి. అడ్డకర్రలకు బంగారు తొడుగు చెయ్యాలి. 30 పర్వతంమీద నీకు కనపరచినట్లే దైవనివాసాన్ని నిలబెట్టాలి.
31 “పేనిన సన్నని నారబట్టతోనూ, నీల ఊదా ఎర్రరంగుల దారాలతోనూ వేరొక తెరను✽ చెయ్యాలి. దానికి నేర్పుగలవానిచేత కెరూబు రూపాలను బుట్టాలను వేయించాలి. 32 తుమ్మకర్రతో నాలుగు స్తంభాలను చేసి వాటికి బంగారు తొడుగు చేసి ఆ తెరను వాటిమీద వ్రేలాడదీయాలి. వాటి గూళ్ళు వెండివీ, వాటి కొక్కేలు బంగారువి కావాలి. 33 ఆ తెరను ఆ కొలుకులక్రింద వ్రేలాడదీయాలి. తెర చాటున లోపలికి శాసనాల పెట్టెను తేవాలి. ఆ తెర పవిత్ర స్థలాన్నీ అతి పవిత్ర స్థలాన్నీ వేరు చేస్తుంది. 34 శాసనాల పెట్టెమీద ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూత అతి పవిత్రస్థలంలో ఉంచాలి. 35 తెర వెలుపల ఆ బల్లను ఉంచాలి. నివాసం దక్షిణ దిక్కున, ఆ బల్ల ఎదుట, సప్తదీపస్తంభాన్ని ఉంచాలి. బల్ల ఉత్తరదిక్కుగా ఉంటుంది.
36 “గుడారం ద్వారానికి✽ మరో తెరను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోనూ పేనిన సన్నని నార బట్టతోనూ నేతపని చేసేవానిచేత చేయించాలి. 37 ఆ తెరకోసం తుమ్మకర్రతో అయిదు స్తంభాలను చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి. వాటి కొక్కేలు బంగారువి కావాలి. వాటికి అయిదు కంచు గూళ్ళను పోతపోయాలి.