25
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నాకు కానుక తీసుకురావాలని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు. మనసారా ఇచ్చే ప్రతి ఒక్కరి కానుక తీసుకో. 3 వారిదగ్గర తీసుకోవలసినవి బంగారం, వెండి, కంచు, 4 నీల, ఊదా, ఎర్ర రంగులు గల దారం, శ్రేష్ఠమైన సన్న నారబట్ట, మేకవెండ్రుకలు, 5 ఎర్రరంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, గండుచేప తోళ్ళు, తుమ్మకర్రలు, 6 దీపంకోసం నూనె, అభిషేక తైలంకోసమూ పరిమళ ధూపంకోసమూ సుగంధద్రవ్యాలు, 7 ఏఫోదు కోసమూ వక్షపతకం కోసమూ మిశ్రిత వర్ణ రత్నాలు, వివిధమైన చెక్కినరత్నాలు. 8 నేను వారిమధ్య నివసించేలా వారు నాకు పవిత్ర నివాసం నిర్మించాలి. 9 ఆ నివాసం, దాని సామానంతా ఎలా ఉండాలో నేను నీకు చూపిస్తాను. ఆ నమూనా ప్రకారమే అంతా నిర్మించాలి.
10 “వారు తుమ్మకర్రతో ఒక పెట్టెను చెయ్యాలి. దాని పొడుగు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర ఉండాలి. 11 దానికి మేలిమి బంగారు తొడుగు చెయ్యాలి. లోపలా వెలుపలా తొడుగు చెయ్యాలి. దాని అంచుకు చుట్టు బంగారు అలంకారం చెయ్యాలి. 12 ఆ పెట్టెకు నాలుగు బంగారు ఉంగరాలను పోతపోసి దాని నాలుగు కాళ్ళకు వాటిని అంటించాలి – రెండు ఒక పక్కకు, రెండు ఎదుటి పక్కకు. 13 తుమ్మకర్రతో కర్రలు చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి. 14 వాటితో ఆ పెట్టెను మోయడానికి దాని ప్రక్కలకు ఉన్న ఉంగరాలలో ఆ కర్రలను ఉంచాలి. 15 ఆ కర్రలు ఆ పెట్టె ఉంగరాలలోనే ఉండాలి. వాటిని ఎన్నడూ తీయకూడదు. 16 నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.
17 “ఆ మందసం కోసం మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్తస్థానంగా మూత చెయ్యాలి. దాని పొడుగు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర ఉండాలి. 18 రెండు కెరూబు రూపాలను బంగారంతో చెయ్యాలి. రేకుగా సాగగొట్టిన బంగారంతో చేయాలి. అవి ఆ మూత రెండు కొనలకు ఉండాలి. 19 ఈ కొనకోసం ఒక కెరూబును, ఆ కొనకోసం ఒక కెరూబును చెయ్యాలి. ఆ రెండు కొనలకు ఉండే కెరూబులు ఆ మూతతో ఏకాండంగా చెయ్యాలి. 20 ఆ కెరూబులు రెక్కలు పైకి విప్పి ఉండాలి. అవి ఆ మూతను మరుగు చెయ్యాలి. ఆ కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. అవి ఆ మూతవైపు ఉండాలి. 21 నీవు ఆ మూత ఆ పెట్టెమీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను పెట్టెలో ఉంచాలి. 22 అక్కడ నేను నిన్ను కలుసుకొంటాను; ఆ మూతమీదనుంచీ శాసనాల పెట్టెమీద ఉండు రెండు కెరూబుల మధ్యనుంచీ నీతో మాట్లాడుతూ, ఇస్రాయేల్ ప్రజ కోసం నా ఆజ్ఞలన్నీ నీకిస్తాను.
23  “నీవు తుమ్మకర్రతో ఒక బల్లను కూడా చెయ్యాలి. దాని పొడుగు రెండు మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని ఎత్తు మూరెడున్నర. 24 దానిని మేలిమి బంగారు తొడుగు చెయ్యాలి. 25 దానికి చుట్టు బెత్తెడు ఓరను చేసి ఆ ఓరకు చుట్టూ బంగారు అలంకారం చెయ్యాలి. 26 ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలను చేసి దాని నాలుగు కాళ్ళకు ఉండే నాలుగు మూలల్లో ఆ ఉంగరాలను తగిలించాలి. 27 బల్ల మోయడానికి కర్రల కోసం ఆ ఉంగరాలు ఓరదగ్గరే ఉండాలి. 28 ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చెయ్యాలి. వాటితో ఆ బల్లను మోయాలి. 29 దాని పళ్ళేలనూ ధూపార్తులనూ గిన్నెలనూ పానీయార్పణకు పాత్రలనూ మేలిమి బంగారంతో చెయ్యాలి. 30 నా సన్నిధిలో ఉండవలసిన రొట్టెలు ఈ బల్లమీద నా ఎదుట ఎల్లప్పుడూ ఉండాలి.
31  “నీవు మేలిమి బంగారంతో సప్తదీపస్తంభం ఒకదానిని చేయాలి. దాని నిలువుభాగాన్నీ అడుగుభాగాన్నీ రేకుగా సాగగొట్టిన బంగారంతో చెయ్యాలి. దాని కలశాలూ పుష్పకోశాలూ పుష్పదళాలూ దానితో ఏకాండంగా ఉండాలి. 32 ఆ దీపస్తంభం పక్కలనుంచి ఆరు కొమ్మలు నిగుడాలి – ఆ పక్కనుంచి మూడు, ఈ పక్కనుంచి మూడు. 33 ఒక కొమ్మమీద మూడు కలశాలు, రెండో కొమ్మమీద మూడు కలశాలు ఉండాలి. ఈ విధంగా సప్తదీపస్తంభం నుంచి నిగిడే ఆరు కొమ్మలమీద అవి ఉండాలి. ఆ కలశాలకు పుష్ప కోశాలూ పుష్పదళాలూ గల బాదం పువ్వుల రూపం ఉండాలి. 34 దీపస్తంభానికి బాదం పువ్వుల్లాంటి నాలుగు కలశాలు, దాని పుష్పకోశాలతో పుష్ప దళాలతో ఉండాలి. 35 దీపస్తంభం నిలువుభాగంనుంచి నిగిడే ఆరు కొమ్మలకు రెండేసి కొమ్మలక్రింద ఒక్కొక్క పుష్పకోశం ఉండాలి. అవి ఆ కొమ్మలతో ఏకాండంగా ఉండాలి. 36 ఆ పుష్ప కోశాలూ ఆ కొమ్మలూ దీపస్తంభంతో ఏకాండంగా ఉండాలి. అదంతా రేకుగా కొట్టిన మేలిమి బంగారంతో చేసిన ఏకాండమైన పనిగా ఉండాలి. 37 దానికి ఏడు దీపాలను చెయ్యాలి. దానికి ముందు వెలిగివ్వడానికి దాని దీపాలను వెలిగించాలి. 38 దాని కత్తెరను కత్తెర చిప్పనూ మేలిమి బంగారంతో చెయ్యాలి. 39 దీపస్తంభాన్నీ దాని సామానంతా చెయ్యడంలో ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల మేలిమి బంగారం ఉపయోగించాలి. 40 ఈ పర్వతంమీద నీవు చూచినవాటి నమూనా ప్రకారమే వాటిని చెయ్యాలి సుమా.