24
1 అప్పుడు యెహోవా మోషేతో “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇస్రాయేల్‌ప్రజల పెద్దలు డెబ్భైమంది యెహోవాదగ్గరికి పర్వతం ఎక్కివచ్చి దూరంగా ఆరాధించాలి. 2 మోషే ఒక్కడే యెహోవాను సమీపించాలి. వారు సమీపించకూడదు. అతనితోపాటు ప్రజలు ఎక్కిరాకూడదు” అన్నాడు.
3 మోషే ప్రజలదగ్గరికి వచ్చి యెహోవా చెప్పిన మాటలన్నీ న్యాయ నిర్ణయాలన్నీ వారికి తెలియజేశాడు. అందుకు ప్రజలంతా ఏకగ్రీవంగా జవాబిస్తూ, “యెహోవా చెప్పిన అన్ని మాటల ప్రకారం చేస్తాం” అన్నారు.
4  యెహోవా మాటలన్నీ మోషే వ్రాశాడు. ఉదయం కాగానే లేచి ఆ పర్వతం దిగువ ఒక బలిపీఠం కట్టాడు. ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలను నిలిపాడు. 5 అప్పుడు, ఇస్రాయేల్ ప్రజల్లో కొందరు యువకులను పంపగా వారు హోమ బలులు సమర్పించి యెహోవాకు శాంతిబలులుగా కోడెలను వధించారు. 6 వాటి రక్తంలో సగం మోషే తీసుకొని పళ్ళెంలో పోశాడు. సగం బలిపీఠంమీద కుమ్మరించాడు. 7 అప్పుడతడు ఒడంబడిక వ్రాతప్రతిని చేతపట్టుకొని ప్రజలకు చదివి వినిపించాడు.
వారు “యెహోవా చెప్పినట్లెల్లా చేస్తాం. విధేయత చూపుతాం” అన్నారు.
8 మోషే ఆ రక్తం తీసుకొని ప్రజలమీద చిలకరించి “ఇదిగో ఇది ఒడంబడిక రక్తం. ఈ మాటలన్నిటి ప్రకారం యెహోవా మీతో ఈ ఒడంబడిక చేశాడు” అన్నాడు.
9 ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇస్రాయేల్ ప్రజల పెద్దలు డెబ్భైమంది కొంతదూరం పర్వతమెక్కి వెళ్ళారు. 10 అక్కడ వారికి ఇస్రాయేల్ ప్రజల దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన పాదాలక్రింద ఆకాశమంత స్వచ్ఛమైన నీలాలతో అలికినట్టుగా ఉంది. 11 ఇస్రాయేల్‌ప్రజల ప్రముఖుల మీదికి ఆయన తన చెయ్యి ఎత్తలేదు. వారు దేవుని దర్శనం చూశారు. భోజనపానాలు పుచ్చుకొన్నారు.
12 అప్పుడు యెహోవా మోషేతో “పర్వతం మీదికెక్కి నాదగ్గరకు వచ్చి ఇక్కడ ఉండు. వారి ఉపదేశంకోసం నేను ఆజ్ఞలనూ ధర్మశాస్త్రాన్నీ వ్రాశాను. వాటిని రాతి పలకలతోపాటు నీకిస్తాను” అన్నాడు.
13 మోషే, అతని అనుచరుడు యెహోషువ లేచారు. మోషే ఆ పెద్దలతో, 14 “మేము మీదగ్గరకు తిరిగి వచ్చేవరకు ఇక్కడే ఉండండి. ఇరుగో అహరోను, హూరు మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యెముంటే వారిదగ్గరకు రావచ్చు” అని చెప్పి దేవుని పర్వతం మీదికెక్కాడు. 15 అతడు ఎక్కినప్పుడు దేవుని మేఘం పర్వతాన్ని కమ్మింది. 16 యెహోవా మహిమాప్రకాశం సీనాయి పర్వతంమీద నిలిచింది. ఆ మేఘం ఆరు రోజులు పర్వతాన్ని కమ్మింది. ఏడో రోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేను పిలిచాడు. 17 యెహోవా మహిమాప్రకాశం ఆ పర్వత శిఖరంమీద దహించే మంటల్లాగా ఇస్రాయేల్‌ప్రజల కళ్ళకు కనిపించింది. 18 మోషే ఆ మేఘంలో ప్రవేశించి పర్వతం మీదికెక్కాడు. మోషే ఆ పర్వతంమీద నలభై పగళ్ళూ నలభై రాత్రులూ ఉండిపొయ్యాడు.