23
1 “లేని మాటలు పలకకూడదు✽, దుర్మార్గుడితో చేయి కలిపి క్రోధంతో అన్యాయమైన సాక్ష్యం✽ చెప్పకూడదు. 2 ✝జనసమూహానికి లొంగిపోయి చెడుగు చెయ్యకూడదు. సమూహంతో చేరి వ్యాజ్యంలో న్యాయాన్ని తారుమారు చేసే సాక్ష్యం పలకకూడదు. 3 ✝వ్యాజ్యెమాడేవాడు బీదవాడైనా అతడిపట్ల పక్షపాతం చూపకూడదు.4 ✝“మీ విరోధి ఎద్దు గానీ గాడిద గానీ తప్పిపోతుందనుకోండి. అది మీకు కనిపిస్తే దాన్ని తప్పకుండా అతడి దగ్గరకు తేవాలి. 5 మీ పగవాడి గాడిద బరువుకింద పడి ఉండడం మీరు చూస్తే పక్కగా దాటిపోకుండా అతడితో కలిసి దాన్ని విడిపించితీరాలి.
6 ✝“బీదవాడి వ్యాజ్యెంలో న్యాయాన్ని తారుమారు చెయ్యకూడదు. 7 అబద్ధాలకు దూరంగా ఉండాలి✽. నిర్దోషిని గానీ న్యాయవంతుణ్ణి గానీ చంపకూడదు. అలాంటి చెడుగు చేసేవాణ్ణి నిర్దోషి అని నేను ఎంచను✽. 8 ✝లంచం తీసుకోకూడదు. చూపుగలవాణ్ణి లంచం గుడ్డివాడుగా చేస్తుంది, న్యాయవంతుల మాటలను తారుమారు చేస్తుంది.
9 ✝“పరాయివాళ్ళను బాధించకూడదు. మీరు ఈజిప్ట్‌దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు. గనుక పరాయివాళ్ళ మనస్సు మీకు తెలుసు గదా.
10 ✝“ఆరు సంవత్సరాలు మీ భూమిని విత్తి దాని పంట కూర్చుకోవచ్చు, 11 గానీ ఏడో ఏట మీ ప్రజల్లో ఉన్న బీదవారికి దానిలో ఆహారం దొరికేలా దాన్ని బీడుగా విడిచిపెట్టాలి. వారి తరువాత మిగిలినదాన్ని అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోట విషయం, ఆలీవ్‌తోట విషయంలో కూడా అలాగే చెయ్యాలి.
12 ✝“ఆరు రోజులు మీ పనులు చేసి ఏడో రోజున విశ్రమించాలి. మీ ఎద్దులూ మీ గాడిదలూ మీ దాసి కొడుకులూ విదేశీయులూ సేదదీర్చుకొనేలా ఈ విధంగా చెయ్యాలి.
13 “నేను మీతో చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా✽ వినాలి. వేరే దేవుడి పేరు ఉచ్చరించకూడదు, అది మీ నోటనుంచి రానివ్వకూడదు.
14 ✝“సంవత్సరానికి మూడు సార్లు నాకు మహోత్సవం ఆచరించాలి. 15 ✝పొంగని రొట్టెల పండుగ ఆచరించాలి. ఆబీబ్ నెలలో ఈజిప్ట్‌నుంచి వచ్చారు, గనుక ఆ నెలలో నియామక కాలంలో నేను మీకు ఆజ్ఞ ఇచ్చినట్టే ఏడు రోజులు పొంగని రొట్టెలను తినాలి. నా సమక్షంలో ఎవ్వరూ వట్టి చేతులతో కనబడకూడదు. 16 కోత పండుగ✽ కూడా, పొలంలో విత్తిన మీ వ్యవసాయాల తొలిపంట✽ సమయంలో, ఆచరించాలి. సంవత్సరాంతంలో పొలంలోనుంచి మీ వ్యవసాయ ఫలాలు కూడబెట్టినప్పుడు ఫలసేకరణోత్సవం కూడా ఆచరించాలి. 17 ✽ సంవత్సరానికి మూడు సార్లు పురుషులంతా ప్రభువైన యెహోవా సన్నిధానంలో కనబడాలి.
18 ✝“నా బలుల రక్తాన్ని పొంగజేసే పదార్థంతో చేసినదానితో సమర్పించకూడదు. నా పండుగల్లో సమర్పించిన క్రొవ్వు రాత్రంతా తెల్లవారేవరకూ ఉండకూడదు. 19 ✝మీ పొలం ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైనవి మీ దేవుడైన యెహోవా ఆలయానికి తేవాలి. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు.
20 ✝“ఇదిగో వినండి. త్రోవలో మిమ్ములను కాపాడుతూ, నేను సిద్ధం చేసిన స్థలానికి తీసుకుపోవడానికి ఒక దూత✽ను మీకు ముందుగా పంపుతున్నాను. 21 ఆయన సముఖంలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. తిరగబడకూడదు✽ సుమా. మీ ఎదిరింపులు ఆయన క్షమించడు; ఎందుకంటే నా పేరు✽ ఆయనకు ఉంది. 22 ✝అయితే ఆయన మాట జాగ్రత్తగా విని, నేను చెప్పినట్లెల్లా మీరు చేస్తే, మీ శత్రువులకు నేను శత్రువుగాను, మీ విరోధులకు విరోధిగాను ఉంటాను. 23 ✝✽ఎలాగంటే, నా దూత మీకు ముందుగా సాగిపోతూ, అమోరీ, హిత్తి, పెరిజ్జి, కనాను, హివ్వి, యోబూసి జాతులవారు ఉన్న స్థలానికి మిమ్ములను తీసుకువస్తాడు, నేను వాళ్ళను నాశనం చేస్తాను. 24 మీరు వాళ్ళ దేవుళ్ళకు సాగిలపడకూడదు✽, మొక్కనూ కూడదు. వాళ్ళు చేసే పనులు చేయకూడదు. వాళ్ళ విగ్రహాలను తప్పక పడద్రోయాలి, వాళ్ళ పుణ్యశిలలను పగలగొట్టాలి✽. 25 మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు ఆయన ఆశీస్సులు✽ ఆహారంమీద నీళ్ళమీద ఉంటాయి. అప్పుడు మీ మధ్యనుంచి రోగం✽ తొలగిస్తాను. 26 మీ దేశంలో గర్భస్రావం, గొడ్డుతనం ఏమీ ఉండవు. మీ రోజుల లెక్క పూర్తి చేస్తాను.
27 “మీ ఎదుట ఇతరులకు నన్ను గురించిన భయాన్ని కలిగిస్తాను. మీరు వెళ్ళే దేశాల ప్రజలందరినీ చిందరవందర చేసి మీ శత్రువులనందరినీ మీ ఎదుటనుంచి పరుగెత్తిస్తాను. 28 మీకు ముందుగా కందిరీగలను పంపిస్తాను. అవి మీ ఎదుటనుంచి హివ్వి, కనాను, హిత్తి జాతులవారిని వెళ్ళగొట్టివేస్తాయి. 29 అయితే వాళ్ళను ఒకే సంవత్సరంలో మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టను. అలా చేస్తే ఆ దేశం నిర్జనమై పాడైపోయి, మీకు హానికరమైన అడవి మృగాలు ఎక్కువ అవుతాయి. 30 మీరు అభివృద్ధి పొంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేవరకు మీ ఎదుటనుంచి వాళ్ళను కొంచెం కొంచెంగా వెళ్ళగొట్టివేస్తాను. 31 మీ సరిహద్దులను ఎర్ర సముద్రంనుంచి ఫిలిష్తీయవాళ్ళ సముద్రం✽వరకూ, ఎడారినుంచి యూఫ్రటీస్ నదివరకూ ఏర్పరుస్తాను. ఆ దేశవాసులను మీ చేతికప్పగిస్తాను. మీరు మీ ఎదుటనుంచి వాళ్ళను వెళ్ళగొట్టివేస్తారు. 32 వాళ్ళతో గానీ వాళ్ళ దేవుళ్ళతో గానీ ఏ ఒడంబడికా✽ చెయ్యకూడదు. 33 వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా ఉంటుంది గనుక వాళ్ళు మీచేత నాకు విరోధంగా పాపాలు చేయించకుండేలా వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు.”