22
1 “ఒక వ్యక్తి ఎద్దును గానీ గొర్రెను గానీ దొంగిలించి అమ్మినా, వధించినా ఎద్దుకు అయిదు ఎద్దులనూ గొర్రెకు నాలుగు గొర్రెలనూ చెల్లు వేయాలి. 2 దొంగ కన్నం వేస్తూ ఉన్నప్పుడు వాణ్ణి ఎవరైనా చావుదెబ్బ కొడితే అది నరహత్యగా లెక్కలోకి రాదు. 3 కానీ ప్రొద్దు పొడిచాక వాణ్ణి చావుదెబ్బ కొట్టడం హత్యే అని భావించాలి. ప్రతిక్రియ తప్పక చెయ్యాలి. బ్రతికి ఉన్న దొంగకు ఏమీ లేకపోతే వాడు దొంగతనం చేసినందుచేత వాణ్ణి అమ్మివేయాలి. 4 వాడు దొంగిలించినది – అది ఎద్దు కానీ గాడిద కానీ గొర్రె కానీ – ప్రాణంతో వాడిదగ్గర దొరికితే వాడు రెండంతలు చెల్లించాలి.
5 “ఒక వ్యక్తి పొలంలో గానీ ద్రాక్ష తోటలో గానీ తన పశువును మేపనిస్తే అది ఇంకో వ్యక్తి పొలంలో మేస్తుందనుకోండి. అలాంటప్పుడు అతడు తన పొలంలోనుంచి గానీ ద్రాక్షతోటలో నుంచి గానీ మంచిదాన్ని ఆ నష్టానికి ఇవ్వాలి.
6 “అగ్ని రగిలి ముళ్ళ కంపలు అంటుకోవడంవల్ల మరో వ్యక్తి పంట కుప్ప గానీ పొలంలో ఉన్న పైరు గానీ ఆ పొలం గానీ కాలిపోతే నిప్పు అంటించినవాడు ఆ నష్టాన్ని ఇవ్వాలి.
7 “ఒక వ్యక్తి డబ్బు గానీ ఏదైనా వస్తువు గానీ జాగ్రత్త పెట్టడానికి తన పొరుగువాడికి అప్పగిస్తాడనుకోండి. దాన్ని ఆ మనిషి ఇంటినుంచి దొంగిలించడం జరిగితే, ఆ దొంగ దొరికాడా, వాడు దానికి రెండంతలు చెల్లించాలి. 8 దొంగ దొరకని పక్షంలో ఆ ఇంటి యజమానే తన పొరుగువాడి దాన్ని చేజిక్కించుకొన్నాడో లేదో నిర్ణయించేందుకు అతడు దేవుని ప్రతినిధుల దగ్గరికి రావాలి. 9 ప్రతి విధమైన విశ్వాసభంగం విషయంలో – అది ఎద్దు గురించి గానీ గాడిద గురించి గానీ గొర్రె గురించి గానీ బట్ట గురించి గానీ – పోయినదాన్ని చూచి ఎవడో ఒకడు ‘ఇది నాది’ అని చెపితే, దాని గురించి వ్యాజ్యమాడేవారు ఇద్దరూ న్యాయాధిపతుల దగ్గరకు రావాలి. వారు ఎవడిని దోషి అని తీర్పు తీరుస్తారో వాడు రెండోవాడికి రెండంతలు చెల్లించాలి.
10 “ఒక వ్యక్తి గాడిదను గానీ ఎద్దును గానీ గొర్రెను గానీ మరి ఏ జంతువునైనా జాగ్రత్త పెట్టడానికి తన పొరుగువాడికి అప్పగిస్తాడనుకోండి. అది చచ్చినా, దెబ్బతిన్నా, వారు చూడకుండా ఎవరైనా దాన్ని తోలుకుపోయినా, 11 తన పొరుగువాడు ఆ ఆస్తిని దుర్వినియోగం చేయలేదని యెహోవా పేరట శపథం చేస్తే చాలు. ఆ ఆస్తిదారుడు ఆ శపథం అంగీకరించాలి. ఆ నష్టాన్ని ఇవ్వడం అనవసరం. 12 ఒకవేళ అతడి దగ్గరనుంచి దాన్ని ఎవరైనా దొంగిలిస్తే అతడు ఆ ఆస్తిదారుడికి నష్టం భర్తీ చెయ్యాలి. 13 ఒకవేళ మృగాలు దాన్ని చీలిస్తే అతడు రుజువుకోసం దాన్ని తీసుకురావాలి. అలా చీలిపోయినదాని నష్టం పూర్తి చేయనక్కరలేదు.
14 “ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర ఏదైనా బదులు తీసుకొంటే, దాని యజమాని దానిదగ్గర లేనప్పుడు దానికి హాని కలిగినా, అది చచ్చినా ఆ వ్యక్తి దాని నష్టం తప్పకుండా పూర్తి చెయ్యాలి. 15 దాని యజమాని దానితో ఉంటే దాని నష్టం భర్తీ చెయ్యనక్కరలేదు. అది అద్దెదైతే ఆ అద్దె దాని యజమానికి రావాలి.
16  “పెళ్ళికి వాగ్దత్తం చేయని కన్యను ఒక వ్యక్తి మరులుకొలిపి ఆమెతో పోతే ఆమెకోసం కట్నం ఇచ్చి ఆమెను పెళ్ళి చేసుకోవాలి. 17 ఆమె తండ్రి ఆమెను అతడికివ్వడానికి ఏమాత్రం ఒప్పుకోకపోతే అతడు కన్యల కట్నం ప్రకారం డబ్బివ్వాలి.
18  “మంత్రకత్తెను బ్రతకనివ్వకూడదు.
19 “జంతువులతో సంపర్కం చేసే ప్రతి ఒక్కరికీ మరణశిక్ష పడవలసిందే.
20  “యెహోవాకు గాక వేరే దేవుడికి బల్యర్పణ చేసేవాడు నాశనానికి గురి అవుతాడు.
21 “పరాయివారిని పీడించకూడదు, హింసించకూడదు. ఈజిప్ట్‌దేశంలో మీరు పరాయివారుగా ఉన్నారు గదా.
22  “విధవరాలిని గానీ తండ్రిలేని పిల్లను గానీ బాధపెట్టకూడదు. 23 వారు మీచేత ఏ విధంగానైనా బాధపడి నాకు ఆక్రందన చేస్తే వారి మొర నేను తప్పక వింటాను. 24 నా కోపాగ్ని రగులుకొంటుంది. మిమ్ములను ఖడ్గంచేత చంపిస్తాను; మీ భార్యలు విధవరాళ్ళవుతారు, మీ పిల్లలు తండ్రి లేనివారవుతారు.
25 “నా ప్రజల్లో మీదగ్గర ఉండే బీదవారిలో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు అతడిపట్ల సాహుకారిలాగా వ్యవహరించకూడదు, అతడిదగ్గర వడ్డీ తీసుకోకూడదు. 26 ఒకవేళ మీరెప్పుడైనా మీ పొరుగువాడి బట్టను తాకట్టుగా తీసుకుంటే, ప్రొద్దు క్రుంకేముందే దాన్ని అతడికి మళ్ళీ అప్పగించాలి. 27 అతడు కప్పుకొనేది అదే. అదే అతడి శరీరానికి వస్త్రం. అతడు మరి ఏమి కప్పుకొని పడుకొంటాడు? అతడు నాకు మొర పెడితే నేను వింటాను. నేను దయగలవాణ్ణి.
28 “దేవుణ్ణి దూషించకూడదు, మీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించకూడదు.
29 “మీ మొదటి కోతలోను ద్రాక్షరసంలోను నైవేద్యాలు అర్పించడానికి ఆలస్యం చెయ్యకూడదు. మీ కొడుకులలో మొదటివాణ్ణి నాకు ప్రతిష్ఠించాలి. 30 అలాగే మీ ఎడ్లనూ మీ గొర్రెలనూ అర్పించాలి. మీరు ప్రతిష్ఠించిన జంతువు ఏడు రోజులు దాని తల్లిదగ్గర ఉండాలి. ఎనిమిదో రోజున దాన్ని నాకివ్వాలి.
31 “మీరు నాకు పవిత్రమైనవారై ఉండాలి. గనుక పొలంలో మృగాలు చీల్చిన జంతువు మాంసం తినకుండా దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.