21
1 ✽“నీవు ఈ న్యాయనిర్ణయాలు వారి ఎదుట పెట్టాలి. 2 ✽ మీరు హీబ్రూవాడైన దాసుణ్ణి కొంటే అతడు ఆరేళ్ళు మాత్రమే మీ కోసం పని చెయ్యాలి. ఏడో ఏట అతడు ఏమీ ఇవ్వకుండా మిమ్ములను విడిచి స్వతంత్రుడవుతాడు. 3 అతడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్తాడు; భార్యతో వస్తే భార్యతో వెళ్తాడు. 4 ఒకవేళ అతడి యజమాని అతడికి భార్యగా ఒక పిల్లనిస్తే ఆమెవల్ల అతడికి కొడుకులు గానీ కూతుళ్ళు గానీ జన్మిస్తే ఆ భార్యా ఆమె పిల్లలూ ఆమె యజమాని సొత్తుగా ఉంటారు. ఆ దాసుడు ఒంటరిగానే వెళ్ళిపోవాలి. 5 ✝కాని ఆ దాసుడు ‘నా యజమాని అంటే, నా భార్యబిడ్డలంటే నాకు ప్రేమ. వాళ్ళను విడిచి స్వతంత్రంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు’ అని తేటగా అంటాడనుకోండి. 6 ✽అలాంటప్పుడు అతడి యజమాని అతణ్ణి న్యాయాధిపతుల దగ్గరకు తీసుకువెళ్ళాలి. తరువాత అతణ్ణి గుమ్మం దగ్గరకు గానీ ద్వారబంధం దగ్గరకు గానీ తీసుకువెళ్ళి అతడి చెవిని కదురుతో గుచ్చాలి. అప్పటినుంచి అతడు ఎప్పుడూ అతడి యాజమాని దాసుడుగా ఉంటాడు.7 ✝“ఒక వ్యక్తి తన కూతురును దాసిగా అమ్మివేస్తే, దాసులైన పురుషులు స్వతంత్రంగా వెళ్ళిపొయ్యే విధంగా ఆమె వెళ్ళిపోకూడదు. 8 ఆమెను భార్యగా ఉంచుకోదలిచే యజమానికి ఆమె నచ్చకపోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకు అవకాశం ఇవ్వాలి. అతడు ఆమెపట్ల అన్యాయంగా వ్యవహరించాడు, గనుక విదేశీయులకు ఆమెను అమ్మడానికి అతడికి హక్కు ఉండదు. 9 అతడు తన కొడుకుకు ఆమెను ఇస్తే కూతుళ్ళపట్ల వ్యవహరించినట్లే ఆమెపట్ల వ్యవహరించాలి. 10 ఆ కొడుకు వేరొక ఆమెను పెండ్లి చేసుకొన్నా, మొదటి ఆమెకు ఆహారాన్నీ బట్టనూ వివాహ ధర్మాన్నీ ఏమీ తగ్గించకూడదు. 11 అతడు ఈ మూడు విషయాల్లో ఆమెపట్ల తనకున్న బాధ్యతలు నెరవేర్చకపోతే ఆమె ఏమీ ఇవ్వకుండా స్వతంత్రురాలై వెళ్ళవచ్చు.
12 ✝“ఒక వ్యక్తిని చావుదెబ్బ కొట్టినవాడికి మరణశిక్ష తప్పక విధించాలి. 13 ✝అయితే అతణ్ణి చంపడానికి అతడు పొంచి ఉండకపోతే, ఆ హత్య అతడిచేత దైవవశాత్తుగా జరిగితే అతడు పారిపోగల స్థలాన్ని మీకు నిర్ణయిస్తాను. 14 ✝కానీ ఒక వ్యక్తి తన పొరుగువానిమీద కోపంతో మండిపడి అతణ్ణి కపటంగా చంపితే వాడు నా బలిపీఠాన్ని ఆశ్రయించినా అక్కడనుంచి వాణ్ణి లాగివేసి చంపాలి.
15 ✝“తన తండ్రిని గానీ తల్లిని గానీ కొట్టేవాడు తప్పక మరణశిక్ష పొందాలి.
16 ✝“ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మివేసినా, తనదగ్గర ఉంచుకొన్నా వాడికి తప్పక మరణశిక్ష పడవలసిందే.
17 ✝“తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడికి తప్పక మరణశిక్ష పడవలసిందే.
18 “కలహం జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి ఎదుటివాణ్ణి రాతితో కొట్టడంవల్ల గానీ గుద్దడంవల్ల గానీ అతడు మంచం పట్టవలసి వస్తుందనుకోండి. 19 అతడు చావక, తరువాత లేచి చేతికర్రతో బయట నడవగలిగితే అతణ్ణి కొట్టినవానికి శిక్ష విధించకూడదు గాని దెబ్బతిన్నవాడు పని చేయలేని కాలానికి సరిపోయినంత డబ్బు ఇచ్చి అతణ్ణి ఆ వ్యక్తి పూర్తిగా బాగు చేయించాలి.
20 “ఒక వ్యక్తి తన దాసుణ్ణి గానీ దాసిని గానీ బెత్తంతో కొడతాడనుకోండి. ఆ దాసుడు లేక ఆ దాసి అప్పుడే చనిపోతే ఆ వ్యక్తికి శిక్ష విధించాలి. 21 ✽ కానీ ఆ బానిస ఒకటి రెండు రోజులు బ్రతికితే శిక్ష విధించకూడదు. ఆ బానిస అతడి ఆస్తి గదా.
22 ✝“కొంతమంది పోరాడుతూ ఉన్నప్పుడు, వారిలో ఒకడివల్ల గర్భిణీస్త్రీకి గర్భస్రావం కలిగించే దెబ్బ తగులుతుందనుకోండి. గర్భస్రావం గాక, వేరే హాని ఏమీ రాకపోతే ఆమెకు ఎవడివల్ల దెబ్బ తగిలిందో అతడు ఆమె భర్త మోపిన నష్టాన్ని కట్టి ఇవ్వాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం ప్రకారం ఉండాలి. 23 ✽ఇంకా హాని కలిగితే మీరు విధించవలసినదేమిటంటే, ప్రాణానికి ప్రాణం, 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, 25 వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ.
26 “ఒకవేళ ఒక వ్యక్తి తన దాసుడి కన్ను గానీ దాసి కన్ను గానీ కొట్టి, దాన్ని పోగొడితే కంటి నష్టం కారణంచేత ఆ బానిసను విడుదల చెయ్యాలి. 27 అతడు తన దాసుడి పన్ను గానీ దాసి పన్ను గానీ రాలగొడితే ఆ పంటి నష్టం కారణంచేత ఆ బానిసను విడుదల చెయ్యాలి.
28 “ఎద్దు పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ పొడిచి చంపితే ఆ ఎద్దును తప్పక రాళ్ళతో కొట్టి చంపాలి. అంతేగాక దాని మాంసం ఎవ్వరూ తినకూడదు. అయినా ఆ యజమాని జవాబుదారిగా ఉండడు. 29 కానీ అంతకుముందు ఆ ఎద్దు పొడిచేది అని దాని యజమానికి హెచ్చరిక వచ్చినా, అతడు దాన్ని భద్రం చేయకపోతే అది పురుషుణ్ణి గానీ స్త్రీని గానీ చంపితే ఆ ఎద్దును రాళ్ళతో చావగొట్టాలి. దాని యజమానీ మరణశిక్ష పొందాలి. 30 మరణశిక్షకు బదులుగా జుల్మానా విధించబడితే తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి విధించినదంతా అతడు చెల్లించాలి. 31 ఆ ఎద్దు పిల్లవాణ్ణి గానీ పిల్లను గానీ పొడిస్తే ఈ నియమం వర్తిస్తుంది. 32 ✽ఆ ఎద్దు దాసుణ్ణి గానీ దాసిని గానీ పొడిస్తే అతడు ఆ బానిస యజమానికి ముప్ఫయి తులాల వెండి ఇవ్వాలి. ఆ ఎద్దును రాళ్ళతో కొట్టి చంపాలి.
33 “ఒక వ్యక్తి గోతిమీది మూత తీయడంవల్ల గానీ గొయ్యి త్రవ్వి దానిమీద మూత ఉంచకపోవడంవల్ల గానీ దానిలో ఎద్దు లేక గాడిద పడుతుంది అనుకోండి. 34 ఆ గొయ్యి ఎవరిదో అతడు ఆ నష్టానికి చెల్లు ఇవ్వాలి. ఆ జంతువు సొంతదారునికి డబ్బు ఇవ్వాలన్నమాట. చచ్చిన జంతువు తనది అవుతుంది.
35 “ఒకడి ఎద్దు మరొకడి ఎద్దును పొడిచి, అది చస్తే, వారు బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని వెల పంచుకోవాలి; చచ్చిన ఎద్దును కూడా పంచుకోవాలి. 36 ✽కానీ అంతకుముందు ఆ ఎద్దు పొడిచేది అని తెలిసి కూడా దాని యజమాని దాన్ని భద్రం చేసినవాడు కాకపోతే అతడు ఎద్దుకు ఎద్దును ఇచ్చితీరాలి. చచ్చిన ఎద్దు తనదవుతుంది.