20
1 దేవుడు ఈ మాటలన్నీ పలికాడు: 2 “నేను యెహోవాను. ఈజిప్ట్‌దేశం నుంచి – ఆ దాస్య గృహంలోనుంచి – మిమ్ములను తీసుకువచ్చిన మీ దేవుణ్ణి.
3 “నేను గాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
4 “మీ కోసం ఏ విగ్రహమూ చేసుకోకూడదు; పైన ఆకాశంలో గానీ క్రింద భూమిమీద గానీ భూమిక్రింద నీళ్ళలో గానీ ఉన్న దేని రూపమూ చేసుకోకూడదు. అలాంటివాటికి సాగిలపడ కూడదు, వాటిని పూజించకూడదు. 5 ఎందుకంటే, మీ దేవుడైన యెహోవానైన నేను రోషంగల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల నేరాలు కొడుకులమీదికి రప్పిస్తాను. 6 నన్ను ప్రేమిస్తూ నా ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవారిమీద వెయ్యి తరాలవరకు అనుగ్రహం చూపుతాను.
7  “మీ దేవుడైన యెహోవా పేరు వ్యర్థంగా పలకకూడదు. యెహోవా తన పేరు వ్యర్థంగా పలికేవారిని శిక్షించకుండా ఉండడు.
8  “విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఆచరించడానికి జ్ఞాపకముంచుకోవాలి. 9 ఆరు రోజులు పాటుపడి మీ పని అంతా చెయ్యాలి. 10 అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో మీరు ఎలాంటి పనీ చెయ్యకూడదు. ఆ రోజున మీరు, మీ కొడుకులు, మీ కూతుళ్ళు, మీ దాసులు, మీ దాసీలు, మీ పశువులు, మీదగ్గర నివసించే పరదేశులు ఎలాంటి పనీ చెయ్యకూడదు. 11 ఆరు రోజులలో యెహోవా ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించి ఏడో రోజున ఆ పని మానుకొన్నాడు. అందుచేత యెహోవా ఆ విశ్రాంతి దినాన్ని దీవించి ప్రత్యేక దినంగా ప్రతిష్ఠించాడు.
12 “మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతికేలా తండ్రినీ తల్లినీ సన్మానించాలి.
13 “నరహత్య చెయ్యకూడదు.
14 “వ్యభిచారం చెయ్యకూడదు.
15 “దొంగతనం చెయ్యకూడదు.
16  “మీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యం పలుకకూడదు.
17  “మీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గానీ దాసుణ్ణి గానీ దాసిని గానీ ఎద్దును గానీ గాడిదను గానీ మీ పొరుగువానికి ఉన్న దేనినీ గానీ ఆశించకూడదు.”
18  ప్రజలంతా ఆ ఉరుములు, ఆ పొట్టేలు కొమ్ము ధ్వని విని, ఆ మెరుపులు, పర్వతంనుంచి లేస్తూవున్న పొగ చూచి భయకంపితులై దూరంగా నిలిచారు.
19 మోషేతో వారు “నీవే మాతో మాట్లాడు. మేము వింటాం. కానీ దేవుడు మాట్లాడితే చచ్చిపోతాం” అన్నారు.
20  అందుకు మోషే “భయపడకండి. మిమ్ములను పరీక్షించడానికే దేవుడు వచ్చాడు. మీరు ఆయనమీద భయభక్తులు ఉంచి పాపాలు చెయ్యకుండా ఉండాలని ఆయన ఉద్దేశం” అన్నాడు. 21 ప్రజలు దూరంగా నిలబడుతూ ఉంటే, దేవుడున్న కారుమబ్బులను మోషే సమీపించాడు.
22 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ మాటలు చెప్పు: ‘నేను ఆకాశంనుంచి మీతో మాట్లాడాను, మీరే సాక్షులు.’ 23 నన్నువలె ఆరాధించడానికి మీకోసం వెండి దేవుళ్ళను గానీ బంగారు దేవుళ్ళను గానీ చేసుకోకూడదు. 24 మట్టి బలిపీఠం నాకోసం చేసి దానిమీద మీ హోమబలులనూ శాంతిబలులనూ మీ మేకలనూ గొర్రెలనూ ఎద్దులనూ సమర్పించాలి. నా పేరు స్మరణకు వచ్చేలా నేను దాన్ని ఉంచిన ప్రతి స్థలంలో మీదగ్గరికి వస్తాను, మిమ్ములను దీవిస్తాను. 25 ఒకవేళ మీరు నాకు రాళ్ళతో బలిపీఠం చేస్తే చెక్కిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు. పనిముట్టు తగిలితే బలిపీఠం అపవిత్రం అవుతుంది. 26 అంతే గాక, నా బలిపీఠంమీద నగ్నత కనిపించకూడదు గనుక మెట్లమీదుగా దాన్ని ఎక్కకూడదు.”