19
1 ✽ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌దేశం విడిచివచ్చిన మూడో నెల మొదటి రోజున వారు సీనాయి ఎడారి చేరుకున్నారు. 2 రెఫిదీంనుంచి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి ఆ ఎడారిలో మకాం చేశారు. ఇస్రాయేల్ ప్రజలు సీనాయి పర్వతం ఎదుటే మకాం చేశారు.3 ✽మోషే దేవునిదగ్గరకు ఆ పర్వతమెక్కాడు. యెహోవా ఆ పర్వతంనుంచి అతణ్ణి పిలిచి ఇలా అన్నాడు: “యాకోబు వంశీయులతో మాట్లాడుతూ ఇస్రాయేల్‌ప్రజకు చెప్పవలసిన దేమిటంటే, 4 ✝‘ఈజిప్ట్‌వాళ్ళకు నేనేమి చేశానో, గరుడపక్షి రెక్కలమీద మిమ్ములను మోస్తూ నాదగ్గరకు మిమ్ములను ఎలా చేర్చుకొన్నానో అదంతా మీరు చూశారు. 5 ✽ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా ఒడంబడికను ఆచరిస్తే మీరు అన్ని జనాలలో నాకు విశేషమైన సొత్తుగా ఉంటారు (భూలోకమంతా నాదే గదా). 6 మీరు నాకు రాజ్యంగానూ యాజుల సమూహంగానూ పవిత్ర జాతిగానూ ఉంటారు.’ నీవు ఇస్రాయేల్ ప్రజలకు చెప్పవలసిన మాటలివే.”
7 మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి తనకు యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నీ వారికి తెలియజేశాడు.
8 ✽ అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినట్టెల్లా చేస్తాం” అంటూ ఏకీభావంతో జవాబిచ్చారు.
మోషే ప్రజల జవాబు యెహోవాదగ్గరికి తీసుకుపొయ్యాడు. 9 ✝యెహోవా అతనితో “ఇదిగో నేను కారుమబ్బులో నీదగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు విని ఎప్పటికీ నిన్ను నమ్మాలని నా ఉద్దేశం” అన్నాడు.
మోషే ప్రజల మాటలు యెహోవాకు చెప్పినప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: 10 ✽“నీవు ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ రోజూ రేపూ వారిని పవిత్రపరచు. వారు తమ బట్టలు ఉతుక్కొని మూడో రోజుకు సిద్ధంగా ఉండాలి. 11 మూడో రోజున ప్రజలందరి కళ్ళెదుటే యెహోవా అనే నేనే సీనాయి పర్వతంమీదికి దిగివస్తాను. 12 ప్రజలు దాటిరాకూడని మేరలు పర్వతం చుట్టూరా ఏర్పరచి వారితో ఈ విధంగా చెప్పాలి – ‘మీరు ఈ పర్వతం ఎక్కకూడదు, దీని సరిహద్దు కూడా తాకకూడదు, జాగ్రత్త సుమా. ఈ పర్వతం ఎవరైనా తాకితే వారికి మరణశిక్ష తప్పదు. 13 అలాంటివారిని ఎవ్వరూ తాకకూడదు గాని రాళ్ళతో కొట్టాలి. లేకపోతే బాణం వేసి చంపాలి. అలాంటి మనిషి గానీ జంతువు గానీ బ్రతకకూడదు’. అయితే బూరధ్వని దీర్ఘంగా వినిపించినప్పుడు ప్రజలు పర్వతం దగ్గరకు రావాలి.”
14 మోషే పర్వతం దిగి ప్రజల దగ్గరికి వచ్చి వారిని పవిత్రపరచాడు. వారు తమ బట్టలను ఉతుక్కొన్నారు.
15 అతడు వారితో “మూడో రోజుకు సిద్ధంగా ఉండండి. పురుషులు స్త్రీలను ముట్టకూడదు” అన్నాడు.
16 ✝మూడో రోజున ఉదయమయినప్పుడే ఆ పర్వతంమీద ఉరుములూ మెరుపులూ దట్టమైన మబ్బూ వచ్చాయి. పొట్టేలు కొమ్ము బూర చాలా బిగ్గరగా ధ్వనించింది. శిబిరంలో ఉన్న ప్రజలంతా భయంతో కంపించారు.
17 అప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే ప్రజలను శిబిరంనుంచి బయటికి తీసుకువచ్చాడు. వారు పర్వతం దిగువ నిలబడ్డారు. 18 యెహోవా మంటలతో✽ సీనాయి పర్వతంమీదికి దిగివచ్చినందుచేత దానినంతా పొగ కమ్మింది. ఆ పొగ కొలిమి పొగలాగే లేస్తూ ఉంది. పర్వతమంతా తీవ్రంగా కంపిస్తూ ఉంది. 19 ✝పొట్టేలు కొమ్ము ఇంకా చాలా బిగ్గరగా వినిపిస్తూ ఉంటే మోషే మాట్లాడాడు, దేవుడు ఉరుములాంటి కంఠస్వరంతో అతనికి జవాబిచ్చాడు. 20 ✝యెహోవా సీనాయి పర్వతశిఖరం మీదికి దిగివచ్చి ఆ శిఖరంమీదికి రమ్మని మోషేను పిలిచాడు. మోషే దానిని ఎక్కిపొయ్యాడు.
21 ✽అప్పుడు యెహోవా మోషేతో “ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దుమీరి నాదగ్గరకు వచ్చి వారిలో చాలామంది నశించిపోకుండేలా నీవు దిగివెళ్ళి వారిని హెచ్చరించు. 22 అంతే కాక యెహోవా తన సన్నిధికి ప్రవేశం గల యాజులపై పడకుండేలా వారు తమ్మును పవిత్రపరచుకోవాలి” అన్నాడు.
23 అందుకు మోషే “పర్వతానికి మేరలను ఏర్పరచి దాన్ని పవిత్రపరచాలని నీవు మాకు ఆజ్ఞాపించావు గదా. గనుక ఈ ప్రజలు ఈ సీనాయి పర్వతం ఎక్కిరాలేరు” అన్నాడు.
24 అతనితో యెహోవా అన్నాడు, “పర్వతం దిగివెళ్ళు. అహరోన్ను వెంటబెట్టుకొని తిరిగి రా. అయితే యెహోవా వారిపై పడకుండేలా యాజులూ ప్రజలూ హద్దుమీరి ఆయనదగ్గరకు ఎక్కి రాకూడదు.” 25 మోషే ప్రజలదగ్గరికి వెళ్ళి ఆ మాట వారికి చెప్పాడు.