18
1 దేవుడు మోషే కోసమూ తన ఇస్రాయేల్‌ప్రజలకోసమూ చేసినదంతా – యెహోవా ఇస్రాయేల్‌ప్రజలను ఈజిప్ట్‌నుంచి రప్పించిన సంగతి – మోషే మామ యిత్రోకు వినవచ్చింది. 2 అంతకుముందు మోషే తన భార్య సిప్పోరాను తన మామ యిత్రోదగ్గరికి పంపాడు (యిత్రో మిద్యానుదేశ యాజి). అతడు ఆమెనూ ఆమె ఇద్దరు కొడుకులనూ స్వీకరించాడు.
3 మోషే “నేను అన్యదేశంలో పరాయివాణ్ణి” అంటూ ఒక కొడుక్కు గెర్షోం అనే పేరు పెట్టాడు, 4 “నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై ఫరో ఖడ్గంనుంచి నన్ను తప్పించాడు” అంటూ రెండోవాడికి ఎలియాజరు అనే పేరు పెట్టాడు.
5 యిత్రో మోషే భార్యనూ అతని కొడుకులనూ వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఎడారిలో, దేవుని పర్వతం దగ్గర మోషే మకాం చేసిన స్థలానికి చేరుకొన్నాడు.
6 యిత్రో “నేను నీ మామ యిత్రోను. నీ భార్య, ఇద్దరు కొడుకులతోకూడా నీ దగ్గరికి వస్తున్నాను” అని మోషేకు కబురు పంపాడు. 7 మోషే తన మామను కలుసుకోవడానికి వెళ్ళి అభివందనం చేసి అతణ్ణి ముద్దుపెట్టుకొన్నాడు. ఒకరినొకరు కుశలప్రశ్నలడిగి గుడారంలోకి వెళ్ళారు. 8 యెహోవా ఇస్రాయేల్ ప్రజల కోసం ఈజిప్ట్‌వాళ్ళకూ ఫరోకూ చేసినదంతా మోషే తన మామకు తెలియజేశాడు. ప్రయాణంలో సంభవించిన కష్టాలన్నీ యెహోవా వాటిలోనుంచి వారిని విడిపించిన సంగతి కూడా తెలిపాడు. 9 యెహోవా ఇస్రాయేల్ ప్రజను ఈజిప్ట్‌వాళ్ళ చేతిలోనుంచి విడిపించడంలో వారికి చేసిన మేలు అంతటికీ యిత్రో సంతోషించాడు.
10 “ఈజిప్ట్‌వాళ్ళ చేతిలోనుంచీ ఫరో చేతిలోనుంచీ మిమ్ములను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక! గర్వంతో ఈ ప్రజలపట్ల వ్యవహరించిన ఈజిప్ట్‌వాళ్ళ వశంలోనుంచి వీరిని విడిపించాడు. 11 దేవుళ్ళందరికంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు తెలుసు” అని యిత్రో అన్నాడు.
12 అప్పుడు మోషే మామ యిత్రో హోమ బలి, ఇతర బలులు దేవునికి సమర్పించాడు. అనంతరం అహరోను, ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా మోషే మామతో దేవుని సన్నిధానంలో భోజనం చేయడానికి వచ్చారు.
13 మరుసటి రోజు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. ఉదయంనుంచి సాయంకాలంవరకు ప్రజలు మోషే చుట్టూరా నిలుచున్నారు.
14 మోషే ప్రజలకు చేసినదంతా అతని మామ చూచి “నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయంనుంచి సాయంకాలంవరకు నువ్వొక్కడివే కూచుంటే ప్రజలంతా నీ చుట్టూరా నిలబడడం ఎందుకని?” అని అడిగాడు.
15 అందుకు మోషే “దేవుని నిర్ణయమేదో విచారించి తెలుసుకోవడానికి ప్రజలు నాదగ్గరికి వస్తారు. 16 వారికి కలహం ఏదైనా ఉంటే నాదగ్గరికి వస్తారన్నమాట. నేను వారి విషయం తీర్పు తీర్చి దేవుని శాసనాలూ చట్టాలూ వారికి తెలియజేస్తాను” అన్నాడు.
17 మోషే మామ అతనికిలా బదులు చెప్పాడు: “నువ్వు అనుసరించిన ఈ పద్ధతి బాగా లేదు. 18 ఈ పని నీకు ఎక్కువ కష్టంగా ఉంది. ఇది నువ్వొక్కడివే చేయలేవు. నువ్వూ నీదగ్గర ఉన్న ఈ ప్రజలూ తప్పక నలిగి నీరసించిపోతారు. 19 నీకు సలహా చెపుతాను. నా మాట శ్రద్ధతో విను. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా ఉండి వారి వ్యవహారాలు దేవునిదగ్గరికి తేవాలి. 20 నువ్వు వారికి దేవుని శాసనాలూ చట్టాలూ బోధించాలి. వారు ఏం చెయ్యాలో, ఏ మార్గంలో నడవాలో వారికి తెలపాలి. 21  అయితే దేవుడంటే భయభక్తులున్న సమర్థులను ప్రజలందరిలోనుంచి నువ్వు ఎన్నుకోవాలి. వారు యథార్థవంతులు, లంచాలను అసహ్యించుకొనేవారై ఉండాలి. అలాంటివారిని ప్రజలమీద నాయకులుగా నియమించాలి. వేయిమందికి ఒకడు, నూరుమందికి ఒకడు, యాభైమందికి ఒకడు, పదిమందికి ఒకడు ఉండాలి. 22 వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయాధిపతులుగా ఉంటారు. వారు ముఖ్య వ్యాజ్యాలు నీదగ్గరికి తేవాలి, గానీ మామూలైన వాటిని వారే పరిష్కరించాలి. ఇలా వారు నీతోపాటు ఈ భారం వహిస్తారు; దానివల్ల నీభారం కొంచెం తేలిక అవుతుంది. 23 ఈ విధంగా దేవుడు నీకు ఆదేశిస్తే, నువ్వు చేస్తే, నువ్వు క్రుంగిపోవు, ఈ ప్రజలంతా తమ నివాసాలకు క్షేమంగా వెళ్ళవచ్చు.”
24 మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టెల్లా చేశాడు. 25 ఇస్రాయేల్‌ప్రజలందరిలోనూ సమర్థులను ఎంచుకొని, వేయిమందికి ఒకణ్ణి, నూరుమందికి ఒకణ్ణి, యాభైమందికి ఒకణ్ణి, పదిమందికి ఒకణ్ణి నాయకులుగా నియమించి, వారికి ప్రజలమీద అధికారమిచ్చాడు. 26 వారు ఎప్పుడూ ప్రజలకు న్యాయాధిపతులుగా ఉన్నారు. ముఖ్య వ్యాజ్యాలు వారు మోషేదగ్గరికి తెచ్చేవారు, గానీ మామూలైనవాటిని వారే పరిష్కరించేవారు.
27 తరువాత మోషే తన మామను సాగనంపాడు. అతడు స్వదేశానికి వెళ్ళిపోయాడు.