17
1  ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా యెహోవా మాట ప్రకారం, తమ ప్రయాణాల్లో సీన్ ఎడారినుంచి పయనిస్తూ రెఫిదీంలో మకాం చేశారు. అక్కడ తమకు తాగే నీళ్ళు లేకపోవడంవల్ల ప్రజలే మోషేతో జగడమాడుతూ, 2 “తాగే నీళ్ళు మాకియ్యి” అన్నారు.
అందుకు మోషే “మీరు నాతో జగడమాడి, ఎందుకు యెహోవాను పరీక్షిస్తున్నారు?” అని అడిగాడు.
3 కాని అక్కడ చాలా దాహం వేసి ప్రజలు మోషేమీద సణుగుతూ “ఏమయ్యా, మమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకురావడం దేనికీ అంట? మమ్మల్నీ మా పిల్లల్నీ మా పశువుల్నీ దప్పికచేత చంపడానికా?” అన్నారు.
4 మోషే యెహోవాకు ఆక్రందన చేసి “ఈ ప్రజలకు నేనేం చెయ్యాలి? కాసేపటికి నన్ను రాళ్ళు రువ్వి చంపేలా ఉన్నారు” అన్నాడు.
5 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఇస్రాయేల్ పెద్దల్లో కొంతమందిని వెంటబెట్టుకొని, నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని ప్రజలకు ముందుగా వెళ్ళు. 6 ఇదిగో అక్కడ హోరేబు పర్వతం దగ్గర ఉన్న ఆ బండమీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. నీవు ఆ బండను కొట్టాలి. అప్పుడు ప్రజలు త్రాగడానికి దానిలోనుంచి నీళ్ళు పారుతాయి.”
ఇస్రాయేల్ పెద్దలు చూస్తుండగానే మోషే అలా చేశాడు. 7 ఇస్రాయేల్‌ప్రజలు పెట్టుకొన్న జగడాన్ని బట్టీ, వారు “యెహోవా మనమధ్య ఉన్నాడా, లేడా?” అంటూ యెహోవాను పరీక్షించినందువల్లా, మోషే ఆ స్థలానికి “మస్సా” “మెరీబా” అనే పేర్లు పెట్టాడు.
8 అనంతరం అమాలేకు జాతివాళ్ళు వచ్చి రెఫిదీంలో ఇస్రాయేల్‌ప్రజతో యుద్ధం జరిగించారు.
9 గనుక మోషే యెహోషువతో “మనకోసం మనుషులను ఎన్నుకొని వారిని తీసుకువెళ్ళి అమాలేకువాళ్ళతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరంపై నిలబడతాను” అన్నాడు.
10 మోషే తనకు చెప్పినట్టే యెహోషువ చేసి అమాలేకువాళ్ళతో యుద్ధం జరిగించాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరమెక్కారు. 11 అప్పుడు జరిగినదేమిటంటే, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇస్రాయేల్‌ప్రజ గెలవసాగారు; చెయ్యి దించినప్పుడు అమాలేకువాళ్ళు గెలవసాగారు. 12 అయితే మోషే చేతులు బరువెక్కాయి. అందుచేత వారు ఒక రాయి తీసుకువచ్చి దానిమీద మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఈ ప్రక్క, హూరు ఆ ప్రక్క ఉండి, అతని చేతులు పడిపోకుండా ఎత్తి పట్టుకొన్నారు. అలా అతని చేతులు ప్రొద్దు క్రుంకేవరకూ కదలకుండా ఉన్నాయి. 13 ఆలోగా యెహోషువ ఖడ్గంతో అమాలేకు రాజునూ అతడి వాళ్ళనూ ఓడించాడు.
14 అప్పుడు యెహోవా మోషేతో “జ్ఞాపకార్థంగా పుస్తకంలో ఈ సంగతి వ్రాసి యెహోషువకు వినిపించు. నేను అమాలేకువాళ్ళ నామరూపాలు ఆకాశంక్రింద లేకుండా పూర్తిగా నిర్మూలం చేస్తాను” అన్నాడు.
15 అనంతరం మోషే ఒక బలిపీఠం కట్టి, దానికి ‘యెహోవా నిస్సీ’ అనే పేరు పెట్టాడు. 16 “అమాలేకువాళ్ళు తమ చెయ్యి యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తారు గనుక యెహోవాకు వాళ్ళతో తరతరాలకు యుద్ధం” అన్నాడు.