16
1 తరువాత ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా ఏలీంనుంచి ప్రయాణం సాగించి సీన్ ఎడారిలోకి వచ్చారు. సీన్ ఎడారి ఏలీంకూ సీనాయి పర్వతానికీ మధ్య ఉంది. వారు అక్కడ చేరింది ఈజిప్ట్‌దేశంనుంచి బయలుదేరి రెండో నెల పదిహేనో రోజు. 2 ✝ఆ ఎడారిలో ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా మోషేమీదా అహరోనుమీదా సణిగారు.3 ✽ ఇస్రాయేల్‌ప్రజ “ఈజిప్ట్‌దేశంలో మాంసంతో నిండిన కుండలదగ్గర మేము కూచున్నాం, కడుపునిండా భోంచేశాం. అప్పుడు యెహోవా చేతిలో మేము చనిపోయి ఉంటే ఎంతో బాగుండేది! ఈ సమాజమంతటినీ ఆకలిచేత చంపడానికి మీరు మమ్మల్ని ఎడారిలోకి తీసుకువచ్చారు!” అని వారితో అన్నారు.
4 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను మీకోసం ఆకాశం✽నుంచి ఆహారాన్ని కురిపించబోతున్నాను. ప్రతి రోజూ ప్రజలు వెళ్ళి ఆ రోజుకు చాలినంత సేకరించాలి. వారు నా ఉపదేశం ప్రకారం మెలగుతారో లేదో ఈ విధంగా వారిని పరిశోధిస్తాను✽. 5 ఆరో రోజున వారు రెండింతలు సేకరించి తెచ్చి సిద్ధం చేయాలి.”
6 ✝మోషే అహరోనులు ఇస్రాయేల్‌ప్రజలందరికీ ఇలా చెప్పారు: “ఈజిప్ట్‌దేశంనుంచి మిమ్ములను తెచ్చినది యెహోవాయే అని ఈ సాయంకాల సమయంలో మీరు తెలుసుకొంటారు. 7 రేపు ప్రొద్దున మీరు యెహోవా మహిమాప్రకాశం✽ చూస్తారు. మీరు తనమీద సణగడం యెహోవా విన్నాడు. మీరు సణగడం యెహోవా మీదే గాని మామీద కాదు. మేము ఏపాటివారం?” 8 మోషే ఇంకా అన్నాడు, “మీరు తినడానికి సాయంకాలాన మాంసమూ ప్రొద్దున ఆహారమూ యెహోవా మీకిచ్చేటప్పుడు మీరు ఇది తెలుసుకొంటారు. మీరు ఆయనమీద సణగడం యెహోవా వింటున్నాడు. మేము ఏపాటివారం? మీరు సణిగేది యెహోవామీదే✽ గాని మామీద కాదు.”
9 మోషే అహరోనుతో “ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటితో ఇలా చెప్పు: యెహోవా మీ సణుగులు విన్నాడు, గనుక యెహోవా సన్నిధానానికి రండి” అన్నాడు.
10 ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటితో అహరోను మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు ఎడారివైపు చూశారు. అప్పుటి కప్పుడే యెహోవా మహిమాప్రకాశం ఆ మేఘంలో కనిపించింది.
11 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 12 ✝“ఇస్రాయేల్‌ప్రజల సణుగులు నాకు వినిపించాయి. వారితో ఈ విధంగా చెప్పు: సాయంకాలం మీరు మాంసం తింటారు; ప్రొద్దున ఆహారం కడుపునిండా తింటారు; యెహోవా అనే నేనే మీ దేవుడనని ఆ విధంగా మీరు తెలుసుకొంటారు.”
13 అలానే జరిగింది. సాయంకాల సమయంలో పూరేడు పిట్టలు వచ్చి వారి శిబిరాన్ని కమ్మాయి. ప్రొద్దున శిబిరం చుట్టూ మంచు ఉంది. 14 ఆ మంచు ఇంకిపొయ్యాక, ఎడారిలో నేలమీద సన్నని పొరలలాంటిదేదో కనిపించింది. అది నేలమీద గడ్డగట్టిన పొడి మంచంత సన్ననిది. 15 ✽దాన్ని ఇస్రాయేల్ ప్రజలు ఒకడితో ఒకడు, “అదేమిటి?” అని అడిగారు. అదేమిటో వారికి బొత్తిగా తెలియదు.
16 ✽ మోషే వారితో “తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం ఇదే. యెహోవా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: ప్రతి ఒక్కరు తన అక్కర ప్రకారం దాన్ని సేకరించాలి. తన గుడారంలో ఉంటున్న వారికోసం, ఒక్కొక్క వ్యక్తికి రెండేసి లీటర్లు సేకరించాలి.”
17 ఇస్రాయేల్ ప్రజలు అలా చేశారు; కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా సేకరించారు. 18 ✝వారు లీటర్ల ప్రకారం కొలిచినప్పుడు ఎక్కువగా సేకరించినవారికి ఏమీ మిగలలేదు. తక్కువగా సేకరించినవారికి కొరత ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ తన అక్కర మేరకు దాన్ని సేకరించారు.
19 ✽మోషే వారితో “ఉదయంవరకు మీరు దానిలో ఏమీ మిగల్చుకోకూడదు” అన్నాడు.
20 కానీ మోషే మాట వినకుండా కొంతమంది ఉదయంవరకు దానిలో కొంత మిగుల్చుకొన్నారు. అయితే అది పురుగులు పట్టి కంపుకొట్టింది. మోషేకు వారిమీద కోపం వచ్చింది. 21 గనుక ప్రతి ఒక్కరూ తమ అక్కర ప్రకారం ప్రతి రోజూ ప్రొద్దున దాన్ని సేకరించారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది.
22 ✽ఆరో రోజున వారు ఒక్కొక్కరికి రెండంతలుగా – నాలుగు లీటర్లు – ఆహారం సేకరించారు. సమాజ నాయకులంతా మోషే దగ్గరికి వచ్చి ఈ సంగతి తెలియజేశారు. 23 అతడు “యెహోవా చెప్పినది ఇదే: రేపు విశ్రాంతి దినం, యెహోవాకు ఆచరించవలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు కాల్చాలనుకొన్నది కాల్చండి, ఉడకబెట్టి వండాలనుకొన్నది వండండి. మిగిలినది అంతా ఉదయంవరకు మీకోసం ఉంచండి” అని వారితో చెప్పాడు.
24 మోషే ఇచ్చిన ఆదేశం ప్రకారం ఉదయంవరకు వారు అలా ఉంచారు; అది కంపు కొట్టలేదు. దానికి పురుగులు పట్టలేదు.
25 అప్పుడు మోషే అన్నాడు, “ఈవేళ అది తినండి. ఈ రోజు యెహోవాకు ఆచరించవలసిన విశ్రాంతి దినం. ఈవేళ అది వెలుపట దొరకదు. 26 మీరు ఆరు రోజులే దాన్ని సేకరించాలి. ఏడో రోజు విశ్రాంతి దినం. ఆ రోజు అది దొరకదు.” 27 అయితే ఏడో రోజున జరిగినదేమిటంటే, ప్రజల్లో కొంతమంది దాన్ని సేకరించడానికి బయటికి వెళ్ళారుగాని వారికేమీ దొరకలేదు.
28 అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మీరు నా ఆజ్ఞలనూ నా ఉపదేశాన్నీ పాటించడం ఎంతకాలం తిరస్కరిస్తారు? 29 ఇదిగో వినండి. యెహోవా విశ్రాంతిదినం మీకిచ్చాడు. గనుక ఆరో రోజున రెండు రోజుల ఆహారమిస్తున్నాడు. ఏడో రోజున ప్రతి ఒక్కరూ తన స్థలంలోనే ఉండాలి. ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు.” 30 అందుచేత ఏడో రోజున ప్రజలు విశ్రమించారు.
31 ఇస్రాయేల్‌ప్రజలు ఆ పదార్థానికి మన్నా అనే పేరు పెట్టారు. అది ధనియాలలాగా, తెల్లగా ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకంలాంటిది.
32 ✝మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, దానితో ఓమెర్ పట్టే పాత్రను నింపి తరతరాలకూ మీ సంతతివారి కోసం దాన్ని ఉంచాలి. ఎందుకంటే నేను మిమ్ములను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చి, ఎడారిలో మీకు ప్రసాదించిన ఆహారాన్ని వారు చూడాలి.” 33 మోషే అహరోనుతో “ఒక జాడీని తీసుకొని అందులో ఓమెర్ మన్నాను పెట్టి మీ సంతతివారి కోసం తరతరాలుగా దాన్ని యెహోవా సన్నిధానంలో ఉంచాలి.”
34 యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞప్రకారం అహరోను చేశాడు. తరువాత అది భద్రంగా ఉండాలని శాసనాలుండే స్థలం ఎదుట దాన్ని పెట్టాడు. 35 ✝తాము నివసించవలసిన దేశానికి చేరేవరకూ ఇస్రాయేల్ ప్రజలు నలభై ఏళ్ళు మన్నా తింటూ వచ్చారు. కనానుదేశం సరిహద్దులకు చేరేవరకు మన్నా తినేవాళ్ళు. 36 (ఓమెర్ అంటే తూములో పదో భాగం.)