15
1 అప్పుడు మోషే, ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు ఈ పాట పాడారు:
“యెహోవాను గురించి గానం చేస్తాను.
ఆయన ఘన విజయం సాధించాడు.
గుర్రాన్నీ దాని రౌతునూ సముద్రంలో పడద్రోశాడు.
2 యెహోవా నా బలం, నా గానం;
ఆయనే నాకు రక్షణ కూడా అయ్యాడు.
ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను;
నా పూర్వీకుల దేవుడు, ఆయనను కీర్తిస్తాను.
3  యెహోవా యుద్ధవీరుడు;
ఆయన పేరు యెహోవా.
4 ఫరో రథాలనూ అతడి సైన్యాన్నీ సముద్రంలో
పడద్రోశాడు. అతడి నాయకుల్లో శ్రేష్ఠులు
ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
5 వాళ్ళను జలాగాధం కప్పివేసింది.
వాళ్ళు బండ్లలాగా సముద్రం లోతుల్లో
మునిగిపొయ్యారు.
6 యెహోవా, నీ కుడిచెయ్యి అధిక బలం గలది;
యెహోవా, నీ కుడిచెయ్యి నీ శత్రువును
చితగ్గొట్టివేస్తుంది.
7 నీకు విరోధంగా లేచేవాళ్ళను
నీ మహిమా ప్రకాశం వల్ల నాశనం చేస్తావు,
నీ కోపాగ్నిని రగుల చేస్తావు.
అది వాళ్ళను ఎండుగడ్డిలాగా కాల్చివేస్తుంది.
8 నీ నాసికా రంధ్రాలలో నుంచి వచ్చిన ఊపిరి
నీళ్ళను కుప్పగా సమకూర్చింది.
ప్రవాహాలు ఆనకట్టలాగా నిలిచాయి.
సముద్రం లోతులో జలం గడ్డ కట్టింది.
9 శత్రువు ‘వాళ్ళను తరిమి అందుకుంటాం.
కొల్లగొట్టి ఆ సొమ్ము పంచి ఇస్తాం.
దానివల్ల నాకు తృప్తి కలుగుతుంది.
నా ఖడ్గం దూసి నా హస్తంచేత వాళ్ళను
నిర్మూలిస్తాను’ అన్నాడు.
10 నీవు నీ గాలిని వీచేలా చేశావు.
సముద్రం వాళ్ళను కప్పివేసింది.
సీసంలాగా వాళ్ళు మహా జలాగాధంలో
మునిగారు.
11 యెహోవా, దేవుళ్ళలో నీవంటి వాడెవడు?
నీ పవిత్రతనుబట్టి మహనీయుడవు.
పొగడతగిన నీ ఘనకార్యాలు
ఎంత భయభక్తులను కలిగిస్తాయి!
నీవు అద్భుతాలు చేసేవాడవు.
నీవంటి వాడెవడు?
12 నీ కుడిచెయ్యి చాపావు–
వాళ్ళను భూమి మింగివేసింది.
13 నీవు విడిపించిన ఈ ప్రజకు నీ వాత్సల్యతతో
వాళ్ళు వెళ్ళవలసిన త్రోవను చూపుతావు.
నీ బలంచేత నీ పవిత్ర నివాసస్థలానికి
వారిని తీసుకువెళ్తావు.
14 ఈ సంగతి జనాలకు వినిపిస్తుంది.
వాళ్ళు వణుకుతారు.
ఫిలిష్తీయ దేశవాసులకు భయాందోళన
కలుగుతుంది.
15 ఏదోం దేశనాయకులు కంగారుపడతారు.
మోయాబు దేశాధికారులు కంపిస్తారు.
కనాను దేశవాసులందరికీ ధైర్యం
లేకుండా పోతుంది. బీతి భయాలు వాళ్ళను
ఆవరిస్తాయి.
16 నీ బలమైన హస్తంచేత వాళ్ళు రాయిలాగా
స్తంభించిపోతారు.
యెహోవా, నీ ప్రజ అవతలకు చేరేవరకూ–
నీవు కొనుక్కొన్న ప్రజ అవతలకు చేరేవరకూ
అలా జరుగుతుంది.
17 నీవు నీ ప్రజను తీసుకొని
నీ సొంత పర్వతంమీద వారికి
స్థిరనివాసం ప్రసాదిస్తావు.
యెహోవా, నీవు నిర్మించుకొన్న నివాసస్థలంలో,
ప్రభూ, నీ చేతులు స్థాపించిన పవిత్రస్థానంలో
వారిని స్థిరులుగా చేస్తావు.
18  యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.”
19 ఫరో గుర్రాలూ రథాలూ రౌతులూ సముద్రంలోకి వెళ్ళినప్పుడు యెహోవా వాళ్ళమీదికి సముద్రం నీళ్ళు మళ్ళించాడు. అయితే ఇస్రాయేల్‌ప్రజలు సముద్రం మధ్యలోగుండా ఆరిన నేలమీద నడిచారు. 20  అహరోను అక్క మిర్యాం దేవునిమూలంగా పలికే స్త్రీ. ఆవిడ ఒక కంజరి చేతపట్టుకొంది. స్త్రీలంతా కంజరీలతోనూ నాట్యంతోనూ ఆమెను అనుసరించారు. 21 మిర్యాం ఇలా పల్లవి ఎత్తి పాడితే వారంతా ఆమెతోకూడా పాడారు:
“యెహోవాను గురించి గానం చెయ్యండి!
ఆయన ఘన విజయం సాధించాడు.
గుర్రాన్నీ దాని రౌతునూ సముద్రంలో
పడద్రోశాడు.”
22  ఆ తరువాత మోషే ఇస్రాయేల్ ప్రజను ఎర్ర సముద్రం నుంచి షూర్ ఎడారిలోకి ప్రయాణం చేయించాడు. వారంతా ఎడారిలోకి మూడు రోజులు పయనించారు. నీళ్ళు ఎక్కడా దొరకలేదు. 23 వారు మారా దగ్గరకు చేరినప్పుడు దాని నీళ్ళు చేదుగా ఉండడంచేత వాటిని త్రాగలేకపోయారు. అందుచేతే ఆ స్థలానికి ‘మారా’ అనే పేరు పెట్టారు.
24 ప్రజలు మోషేమీద సణుగుకొంటూ “మేమేం తాగాలి?” అన్నారు. 25 అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టు నీళ్ళలో వేస్తే అవి తియ్యనివయ్యాయి. అక్కడ యెహోవా వారికి ఒక శాసనాన్నీ న్యాయనిర్ణయాన్నీ ఇచ్చాడు, వారిని పరిశోధించాడు.
26 “మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును మనసారా వింటే, ఆయన దృష్టిలో సరిగా ప్రవర్తిస్తే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన శాసనాలన్నీ పాటిస్తే నేను ఈజిప్ట్‌వాళ్ళకు కలిగించిన రోగాల్లో ఏదీ మీకు తగలనియ్యను. యెహోవా అనే నేనే మిమ్ములను బాగుచేసేవాణ్ణి.”
27 ఆ తరువాత వారు ఏలీం చేరుకొన్నారు. అక్కడ పన్నెండు నీటి బుగ్గలూ డెబ్భై ఈతచెట్లూ ఉన్నాయి. అక్కడే వారు ఆ నీళ్ళ దగ్గర మకాం చేశారు.