14
1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 2 “ఇస్రాయేల్‌ ప్రజలు వెనుకకు తిరిగి పీహహీరోతు ఎదుట మకాం చేయాలని వారితో చెప్పు. అది మిగదోల్‌కూ సముద్రానికీ మధ్య ఉంది. వారు బేల్‌సెఫోను ఎదురుగా, సముద్రం దగ్గర దిగాలి. 3 అప్పుడు ఫరో ఇస్రాయేల్ ప్రజను గురించి ‘వాళ్ళు ఆ ప్రాంతంలో చిక్కుబడిపొయ్యారు. ఎడారి వాళ్ళను చుట్టుకొంది’ అనుకొంటాడు. 4 నేను ఫరో గుండె బండబారిపోయేలా చేస్తాను, అతడు వారిని తరుముతాడు. ఇలా నేను ఫరోవల్లా అతడి సైన్యమంతటివల్లా పేరుప్రతిష్ఠలు తెచ్చుకొంటాను. నేను యెహోవానని ఈజిప్ట్‌వాళ్ళు తెలుసుకొంటారు.” ఇస్రాయేల్ ప్రజలు అలా చేశారు.
5 ప్రజలు పారిపొయ్యారని ఈజిప్ట్ చక్రవర్తికి తెలియవచ్చి నప్పుడు అతడూ అతడి పరివారమూ వారిని గురించి మనసు మార్చుకొన్నారు. “మనం ఇలా చేశామేమిటి? మన సేవలో ఉండకుండా ఇస్రాయేల్‌ప్రజను వెళ్ళనిచ్చామెందుకు?” అని చెప్పుకొన్నారు. 6 కనుక అతడు తన రథాన్ని సిద్ధం చేయించుకొని తన జనాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. 7 అన్నిటికంటే మంచివి ఆరు వందల రథాలను ఈజిప్ట్‌లో ఉన్న ఇతర రథాలన్నిటినీ కూడా తీసుకుపొయ్యారు. ఒక్కొక్క రథానికి అధిపతి ఒకడు ఉన్నాడు. 8 ఈజిప్ట్ చక్రవర్తి ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు గనుక అతడు ఇస్రాయేల్‌ప్రజను తరిమాడు. ఇస్రాయేల్‌ప్రజ ధైర్యసాహసాలతో తరలివెళ్ళారు. 9 వారు పీహహీరోతు ప్రక్కన బేల్‌సెఫోను ఎదుట, సముద్రం దగ్గర మకాం వేశారు. వారు ఆ స్థలంలోనే ఉన్నప్పుడు ఈజిప్ట్‌వాళ్ళు వారిని తరుముతూ వచ్చారు. ఫరోకున్న అన్ని గుర్రాలూ రథాలూ అతడి రౌతులూ అతడి సైన్యమూ తరుముతూ వారి దరిదాపులకు చేరారు. 10 ఫరో వారిదగ్గరకు వచ్చినప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు తలెత్తి చూస్తే తమవెంట వస్తూ ఉన్న ఈజిప్ట్‌వాళ్ళు కనబడ్డారు. ఇస్రాయేల్‌ప్రజలు చాలా భయంతో యెహోవాకు ఆక్రందన చేశారు.
11 వారు మోషేతో ఇలా అన్నారు: “ఈజిప్ట్‌లో సమాధులు లేవని ఈ ఎడారిలో మేము చచ్చిపోవాలని మమ్మల్ని ఇక్కడికి తెచ్చారా? మరి మమ్మల్ని ఈజిప్ట్‌నుంచి ఇలా తీసుకువచ్చి మాకేం చేశావో చూడు? 12 ఈజిప్ట్‌లో మేము నీతో చెప్పాం గదా ‘మా సంగతి విడిచిపెట్టు. మేము ఈజిప్ట్‌వాళ్ళకు సేవ చేస్తామ’ని. మేము ఎడారిలో చావడంకంటే ఈజిప్ట్‌వాళ్ళకు సేవ చెయ్యడం నయం గదా.”
13 అందుకు మోషే “భయపడకండి! స్థిరంగా నిలబడండి! ఈ రోజున యెహోవా మీకోసం కలిగించబోయే రక్షణ చూడండి! ఈవేళ మీరు చూచిన ఈజిప్ట్‌వాళ్ళను ఇంకెన్నడూ చూడరు. 14 యెహోవా మీకోసం యుధ్ధం చేస్తాడు. మీరు ఊరుకోవాలి.”
15 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవెందుకు నాకు మొరపెట్టుకొంటున్నావు? ‘ముందుకు సాగిపోండి’ అని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు. 16 నీవు నీ చేతికర్రను ఎత్తి నీ చెయ్యి సముద్రంమీద చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇస్రాయేల్‌ప్రజ సముద్రం మధ్య ఆరిన నేలమీద నడిచి వెళ్ళగలరు. 17 నేను ఈజిప్ట్‌వాళ్ళ గుండెలు బండబారిపోయేలా చేస్తాను. నేనే అలా చేస్తాను. గనుక వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజను తరుముతారు. అప్పుడు నేను ఫరోవల్లా అతడి సైన్యమంతటివల్లా అతడి రథాలవల్లా అతడి రౌతులవల్లా పేరుప్రతిష్ఠలు సంపాదించుకొంటాను. 18 నేను ఫరోవల్లా అతడి రథాలవల్లా అతడి రౌతులవల్లా పేరుప్రతిష్ఠలు సంపాదించుకొన్నప్పుడు నేనే యెహోవానని ఈజిప్ట్‌వాళ్ళు తెలుసుకొంటారు.”
19 అదివరకు ఇస్రాయేల్‌ప్రజల సేనలకు ముందుగా నడుస్తూ వచ్చిన దూత అప్పుడు వారి వెనుకకు వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వారి ఎదుటనుంచి వెళ్ళి వారి వెనుక నిలిచింది. 20 అది ఈజిప్ట్‌వాళ్ళ శిబిరానికీ ఇస్రాయేల్‌ప్రజల శిబిరానికీ మధ్యగా వచ్చింది. ఆ మేఘం ఈజిప్ట్‌వాళ్ళకు చీకటి కలిగించింది గాని ఇస్రాయేల్‌ప్రజను రాత్రిలో వెలుగిచ్చింది, గనుక ఆ రాత్రంతా వాళ్ళ సైన్యం వీరిని సమీపించలేదు.
21 మోషే సముద్రంవైపు చెయ్యి చాచాడు; యెహోవా బలమైన తూర్పు గాలి రాత్రంతా వీచేలా చేసి సముద్రాన్ని తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాడు. నీళ్ళు రెండు పాయలుగా ఏర్పడ్డాయి. 22 ఇస్రాయేల్‌ప్రజలు సముద్రం మధ్య ఆరిన నేలమీద నడుస్తూ వెళ్ళారు. వారి కుడిప్రక్కకూ ఎడమప్రక్కకూ నీళ్ళు గోడల్లాగా నిలిచాయి.
23 ఈజిప్ట్‌వాళ్ళూ ఫరో గుర్రాలూ రథాలూ రౌతులంతా వారిని తరుముతూ సముద్రంలోకి వెళ్ళారు. 24 వేకువ జామున యెహోవా ఆ అగ్ని స్తంభంనుంచీ మేఘంనుంచీ ఈజిప్ట్‌వాళ్ళ సైన్యాన్ని చూచి దానిని తారుమారు చేశాడు. 25 వాళ్ళ రథచక్రాలు ఊడిపడేలా చేశాడు. వాటిని తోలడం చాలా కష్టమయింది. అందుచేత ఈజిప్ట్‌వాళ్ళు “యెహోవా ఇస్రాయేల్‌ప్రజ పక్షాన ఈజిప్ట్‌తో యుద్ధం చేస్తున్నాడు! వాళ్ళ దగ్గరనుంచి పారిపోదాం!” అని చెప్పుకొన్నారు.
26 అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, “నీ చెయ్యి సముద్రంమీద చాపు. నీళ్ళు ఈజిప్ట్‌వాళ్ళమీదికీ వాళ్ళ రథాలమీదికీ వాళ్ళ రౌతులమీదికీ మళ్ళీ వస్తాయి.”
27  మోషే చెయ్యి సముద్రంమీద చాచాడు. ఉదయం కాగానే సముద్రం దాని స్థలానికి మళ్ళీ ప్రవహించింది. అలా జరిగినప్పుడు ఈజిప్ట్‌వాళ్ళు పారిపోతున్నారు గాని యెహోవా వాళ్ళను సముద్రం మధ్యలోనే నాశనం చేశాడు. 28 నీళ్ళు మళ్ళీ వచ్చి రథాలనూ రౌతులనూ వాళ్ళవెంట సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యమంతటినీ ముంచి కప్పివేశాయి. వాళ్ళలో ఏ ఒక్కడూ మిగలలేదు. 29 ఇస్రాయేల్ ప్రజలైతే సముద్రం మధ్య ఆరిన నేలమీద నడుస్తూ వెళ్ళారు. వారి కుడి ప్రక్కగా ఎడమ ప్రక్కగా నీళ్ళు గోడల్లాగా నిలిచాయి. 30 ఈ విధంగా ఆ రోజున యెహోవా ఇస్రాయేల్ ప్రజను ఈజిప్ట్‌వాళ్ళ చేతిలోనుండి రక్షించాడు. సముద్రతీరాన పడివున్న ఈజిప్ట్‌వాళ్ళ శవాలను ఇస్రాయేల్‌ప్రజలు చూశారు. 31  యెహోవా ఈజిప్ట్‌వాళ్ళ విషయం చేసిన ఆ మహా క్రియను చూచి ఇస్రాయేల్‌ప్రజకు యెహోవామీద భయభక్తులు కలిగాయి. వారు యెహోవామీదా ఆయన సేవకుడైన మోషేమీదా నమ్మకం ఉంచారు.