13
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 ✝“ఇస్రాయేల్ ప్రజలో మొదట పుట్టిన సంతానాన్నంతా నాకు ప్రతిష్ఠించాలి. మనిషికి గానీ జంతువుకు గానీ పుట్టిన ప్రతి తొలిచూలు పిల్ల నాదే.”3 ✝తరువాత ప్రజలతో మోషే ఇలా అన్నాడు: “మిమ్ములను దాస్యంలో ఉంచిన ఈజిప్ట్‌దేశంనుంచి మీరు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా తన బలిష్ఠమైన హస్తం చేత దానినుంచి మిమ్ములను బయటికి తీసుకువచ్చాడు. మీరు పొంగజేసే పదార్థమేమీ తినకూడదు. 4 ఈ అబీబ్ నెల ఈ రోజే మీరు ఈజిప్ట్‌నుంచి తరలివెళ్తున్నారు. 5 ✝యెహోవా మిమ్ములను పాలు తేనెలు నదులై పారుతున్న దేశానికి తీసుకువెళ్తాడు. అది కనాను, హిత్తి, అమోరీ, హివ్వి, యెబూసి జాతులవాళ్ళు కాపురముంటున్న దేశం. ఆ దేశాన్ని మీకిస్తానని యెహోవా మీ పూర్వీకులతో శపథం చేశాడు. మీరు దానిలో ప్రవేశించిన తరువాత ఈ ఆచారకాండ ఈ నెలలోనే జరుపుకోవాలి. 6 ఏడు రోజులు మీరు పొంగని రొట్టెను తినాలి. ఏడో రోజున యెహోవాకు పండుగ ఆచరించాలి. 7 పొంగని రొట్టెనే ఆ ఏడు రోజులూ తినాలి. మీ దేశంలో ఆ సరిహద్దునుంచి ఈ సరిహద్దువరకు పొంగిన రొట్టె మీదగ్గర ఉండకూడదు. పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. 8 ✝ఆ రోజున మీ సంతానానికి ఇలా వివరిస్తూ ‘నేను ఈజిప్ట్‌నుంచి వచ్చిన కాలంలో యెహోవా నాకోసం చేసిన దాన్నిబట్టి ఇలా చేస్తున్నాను’ అనాలి. 9 ✝యెహోవా ఉపదేశం మీ నోట ఉండేలా ఈ ఆచారం మీకు మీ చేతులమీద గురుతులాగా మీ నొసళ్ళలో జ్ఞాపకార్థ సూచనలాగా ఉంటుంది. యెహోవా తన బలిష్ఠమైన హస్తంచేత మిమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాడు గదా. 10 అందుచేత మీరు ఏటేటా ఈ ఆచారక్రియ దాని నియామక కాలంలో ఆచరించాలి.
11 “యెహోవా మీకూ మీ పూర్వీకులకూ దాన్ని ఇస్తానని శపథం చేసిన ప్రకారం మిమ్ములను కనాను దేశంలోకి తీసుకువస్తాడు. 12 అప్పుడు మీరు ప్రతి తొలిచూలు పిల్లనూ యెహోవాకు ప్రతిష్ఠించాలి. మీ పశువులకు కలిగే ప్రతి తొలి మగపిల్ల యెహోవాదే. 13 ✽ప్రతి గాడిద తొలిపిల్లకు బదులుగా ఒక గొర్రెపిల్లను విడుదల వెలగా అర్పించవచ్చు. ఆ గాడిద పిల్లను అలా విడిపించడం మీకిష్టం లేకపోతే దాని మెడను విరుగదీయాలి. మీ కొడుకుల్లో కూడా మొదట పుట్టినవాడికోసం విడుదల వెల చెల్లించాలి. 14 రాబొయ్యే రోజుల్లో మీ కొడుకు నిన్ను ‘దీని భావమేమిటి?’ అని అడిగినప్పుడు అతడితో ఇలా అనాలి: ‘మమ్ములను దాస్యంలో ఉంచిన ఈజిప్ట్‌నుంచి యెహోవా తన బలిష్ఠమైన హస్తంచేత మమ్ములను తీసుకువచ్చాడు. 15 ఫరో తన గుండె బండబారిపోయేలా చేసుకొని మమ్ములను వెళ్ళనియ్యకుండా ఉంటే, ఈజిప్ట్‌దేశంలో ఉన్న మొదట పుట్టిన సంతానాన్నంతా యెహోవా సంహారం చేశాడు. మనుషులకూ పశువులకూ మొదట పుట్టిన సంతానాన్ని సంహారం చేశాడు, గనుకనే నేను పశువులకు తొలిచూలు మగపిల్లలన్నిటినీ యెహోవాకు అర్పిస్తాను. కానీ నా కొడుకుల్లో మొదట పుట్టినవాణ్ణి విడుదల వెల ఇచ్చి విడిపిస్తాను.’ 16 యెహోవా తన బలిష్ఠమైన హస్తంచేత మమ్ములను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చాడు, గనుక ఈ ఆచారం నీ చేతిమీద గురుతులాగా నీ నొసట జ్ఞాపకార్థమైన వ్రాతలాగా ఉంటుంది.”
17 ✽ఫరో ఆ ప్రజను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వారిని ఫిలిష్తీయవాళ్ళ దేశానికి పోయే త్రోవలో ప్రయాణం చేయించలేదు. దేశానికి అది దగ్గర త్రోవే గాని, “ఈ ప్రజలు యుద్ధం చూచి విచారపడి మనసు మార్చుకొని ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళకూడదు” అని దేవుడు అనుకొని 18 ప్రజను చుట్టుత్రోవలో ప్రయాణం చేయించాడు. ఆ త్రోవ ఎడారిమీదుగా ఎర్రసముద్రం వైపుకు పోయేది. ఇస్రాయేల్‌ప్రజలు ఆయుధాలు ధరించి ఈజిప్ట్‌దేశం నుంచి వచ్చారు.
19 ✝పూర్వం యోసేపు ఇస్రాయేల్ సంతానంచేత శపథం చేయించుకొంటూ “దేవుడు మిమ్ములను తప్పక జ్ఞాపకముంచు కొంటాడు. మీరు నా ఎముకలను ఇక్కడనుంచి తీసుకువెళ్ళాలి” అన్నాడు, గనుక మోషే అతడి ఎముకలను తీసుకువచ్చాడు. 20 వారు సుక్కోతునుంచి ప్రయాణం చేసి ఎడారి అంచున ఉండే ఏతాంలో మకాం చేశారు.
21 ✝పగటివేళ వారికి వెళ్ళవలసిన దారి చూపడానికీ రాత్రివేళ వెలుగు ఇవ్వడానికీ వారికి ముందుగా యెహోవా వెళ్ళాడు. పగటివేళ స్తంభంలాంటి మేఘంలో, రాత్రివేళ స్తంభంలాంటి అగ్నిలో వెళ్ళాడు. ఈ విధంగా వారు పగలూ రాత్రీ ప్రయాణం చేయగలిగారు. 22 ✝పగటివేళ ఆ మేఘాన్ని, రాత్రివేళ ఆ అగ్నిని ప్రజ ఎదుటనుంచి యెహోవా తొలగించలేదు.