12
1 ✽యెహోవా ఈజిప్ట్‌దేశంలో మోషే అహరోనులతో ఇలా అన్నాడు: 2 “నెలల్లో ఈ నెల మీకు మొదటిదిగా ఉండాలి, మీ సంవత్సరానికి మొదటి నెల అన్నమాట. 3 మీరు ఇస్రాయేల్ సర్వసమాజంలో ఈ విధంగా చెప్పాలి – ఈ నెల పదో రోజున వారిలో ప్రతి ఒక్కరూ తన కుటుంబంకోసం ఒక గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ తీసుకోవాలి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కదాన్ని తీసుకోవాలి. 4 ఒక్క కుటుంబం దాన్నంతా తినలేనంత చిన్నదైతే అతడూ అతడి పొరుగువాడూ, తమ కుటుంబాల్లో ఉన్నవారి సంఖ్య ప్రకారం, దాన్ని తీసుకోవాలి. ఒక్కొక్క వ్యక్తి ఎంత తినగలుగుతాడో దాని ప్రకారం లెక్కపెట్టి ఆ జంతువును తీసుకోవాలి. 5 ✽అది లోపం లేనిదై ఏడాది మగదై ఉండాలి. గొర్రెల్లో నుంచి గానీ మేకల్లోనుంచి గానీ దాన్ని తీసుకోవచ్చు. 6 ✽ఈ నెల పద్నాలుగో రోజువరకు దాన్ని ఉంచాలి. ఆ రోజు సాయంకాల సమయంలో ఇస్రాయేల్ సమాజ సమూహమంతా వాటిని చంపాలి.7 ✽“అప్పుడు జంతువు రక్తంలో కొంత తీసుకొని దాని మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ములమీదా పైకమ్మిమీదా పూయాలి. 8 ✝ఆ రాత్రే వారు దాన్ని కాల్చి ఆ మాంసం తినాలి✽. పొంగజేసే పదార్థం✽ లేకుండా చేసిన రొట్టెతోను చేదు కూరాకులతోను✽ దాన్ని తినాలి. 9 ✽మాంసం పచ్చిగా ఉన్న దేన్నీ తినకూడదు, నీళ్ళతో వండి తిననేకూడదు. దాన్నీ దానితో దాని తలనూ కాళ్ళనూ లోపలి భాగాలనూ కాల్చి తినాలి. 10 ✽మీరు దానిలో దేన్నీ తెల్లవారేవరకు మిగల్చకూడదు. ఒకవేళ తెల్లవారేవరకు దానిలో మిగిలినది ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా కాల్చివేయాలి.
11 ✽“మీరు దాన్ని తినవలసిన విధమేమంటే, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ చేతికర్రలను పట్టుకొని దాన్ని త్వరగా తినాలి. అది యెహోవాకు పస్కాబలి. 12 ✽ఆ రాత్రి నేను ఈజిప్ట్‌దేశం గుండా వెళ్తూ ఈ దేశంలో ఉన్న మనుషుల్లోను జంతువుల్లోను మొదట పుట్టిన సంతానాన్నంతా హతమారుస్తాను. ఈజిప్ట్‌వాళ్ళ దేవుళ్ళందరి విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. 13 ✽మీరున్న ఇండ్లకు ఆ రక్తం గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూచి మిమ్ములను దాటిపోతాను. నేను ఈజిప్ట్‌దేశాన్ని దెబ్బ తీసినప్పుడు నాశనకరమైన ఆ విపత్తు మీమీదికి రాదు.
14 ✝“ఈ రోజు మీకు జ్ఞాపకార్థంగా ఉండాలి. మీరు యెహోవాకు పండుగగా దాన్ని తరతరాలకు ఆచరిస్తూ ఉండాలి. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం. 15 ✽ ఏడు రోజులపాటు మీరు పొంగజేసే పదార్థంలేని రొట్టెను తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగచేసే పదార్థమంటూ లేకుండా చేయాలి. మొదటి రోజునుంచి ఏడో రోజువరకు ఎవరైనా సరే, పొంగజేసే పదార్థంతో చేసిన రొట్టెను తింటే ఆ వ్యక్తిని ఇస్రాయేల్‌ప్రజలో లేకుండా చేయాలి. 16 ✝ఆ మొదటి రోజున, ఆ ఏడో రోజున మీరు పవిత్రసభగా సమకూడాలి. ఆ రెండు రోజుల్లో అందరూ భోజనం సిద్ధం చేయవచ్చు గానీ వేరే పని ఏమీ చేయకూడదు. 17 ✽ఈ పొంగని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మీ సేనలను ఈజిప్ట్‌దేశంనుంచి బయటికి తీసుకువచ్చే రోజు అదే. అందుచేత మీరు తరతరాలకూ ఈ రోజును ఆచరించాలి. ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం. 18 ఈ మొదటి నెల పద్నాలుగో రోజు సాయంకాల సమయంనుంచి ఇదే నెల ఇరవయ్యొకటో రోజు సాయంకాలంవరకు పొంగజేసే పదార్థంలేని రొట్టె మీరు తినాలి. 19 ఏడు రోజులు మీ ఇండ్లలో పొంగజేసే పదార్థమేదీ ఉండకూడదు. పొంగజేసే పదార్థంతో చేసిన దాన్ని ఎవరైనా తింటే (అతడు మీ మధ్యలో నివసించే విదేశస్తుడు కానియ్యి, స్వదేశస్తుడు కానియ్యి), ఆ వ్యక్తిని ఇస్రాయేల్ సమాజంలో లేకుండా చేయాలి. 20 మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేన్నీ తినకూడదు. మీ నివాసాలన్నిట్లో పొంగని రొట్టె తినాలి.”
21 అప్పుడు మోషే ఇస్రాయేల్ ప్రజల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా చెప్పాడు: “మీరు మీ కుటుంబాలకోసం మందలోనుంచి గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ తీసుకొని పస్కాబలిని వధించండి. 22 మీరు హిస్సోపు మొక్క గుబురు రెమ్మను తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధానికి దాన్ని పూయాలి. తరువాత ఉదయంవరకు మీలో ఎవ్వరూ తలుపుగుండా బయటికి వెళ్ళకూడదు. 23 ✽ఈజిప్ట్‌వాళ్ళను సంహారం చేయడానికి యెహోవా ఈ దేశంగుండా వెళ్తూ ఉంటాడు. ఆయన ఆ ద్వారబంధం పైకమ్మిమీదా రెండు నిలువుకమ్ములమీదా ఉన్న రక్తం చూచి ఆ తలుపును దాటిపోతాడు. మీ ఇళ్ళలో ప్రవేశించడానికీ మిమ్ములను చంపడానికీ సంహారం చేసే దూతకు సెలవియ్యడు. 24 అందుచేత మీరు ఈ ఆచారం అనుసరించాలి. ఇది మీకూ మీ సంతతివారికీ ఎప్పటికీ నిలిచివుండే చట్టం. 25 తాను ఇచ్చిన వాగ్దానం ప్రకారం యెహోవా మీకు ప్రసాదించబోయే దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఈ ఆచారక్రియ ఆచరించాలి. 26 ✽అప్పుడు మీ పిల్లలు ‘ఈ ఆచారక్రియ భావమేమిటి?’ అని మిమ్ములను అడిగితే, 27 ✽మీరు ఇలా అనాలి: ‘ఇది యెహోవాకు పస్కాబలి. ఈజిప్ట్‌లో యెహోవా ఈజిప్ట్‌వాళ్ళను సంహారం చేసినప్పుడు ఇస్రాయేల్‌ప్రజల ఇండ్లను దాటిపోయాడు. మన ఇండ్లను కాపాడాడు.’”
28 ✽అది విని ప్రజలు తలలు వంచుకొని దేవుణ్ణి ఆరాధించారు. అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళి విధేయులయ్యారు; మోషేకూ అహరోనుకూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారమే వారు చేశారు.
29 ✝మధ్యరాత్రివేళ ఈజిప్ట్‌దేశంలో ఉన్న మొదటపుట్టిన సంతానాన్నంతా యెహోవా హతం చేశాడు. తన సింహాసనంమీద కూర్చుండే చక్రవర్తి మొదలుకొని చెరసాలలో ఉండే ఖైదీవరకు వాళ్ళకు మొదట పుట్టిన సంతానాన్నంతా, పశువుల తొలిపిల్లలను కూడా, సంహారం చేశాడు. 30 ✝ఆ రాత్రి చక్రవర్తి, అతడి సేవకులంతా, ఈజిప్ట్‌వాళ్ళంతా లేచారు. శవం లేని ఇల్లంటూ ఒక్కటీ లేదు, గనుక ఈజిప్ట్‌లో గొప్ప ఏడ్పు పుట్టింది.
31 ✽ ఆ రాత్రి చక్రవర్తి మోషేనూ అహరోన్నూ పిలిపించి ఇలా అన్నాడు: “మీరూ ఇస్రాయేల్ ప్రజలంతా లేచి నా ప్రజల మధ్యనుంచి వెళ్ళిపోండి. మీరు కోరుకున్నట్టు యెహోవాను ఆరాధించి సేవించండి. 32 మీరు చెప్పినట్టే మీ మందలనూ పశువులనూ తీసుకువెళ్ళిపోండి. నన్ను దీవించండి కూడా.”
33 ✽ఈజిప్ట్‌వాళ్ళు “మేమంతా చచ్చిపోతాం” అనుకొని ఇస్రాయేల్ ప్రజలను దేశంనుంచి త్వరగా వెళ్ళిపోండని వారిని బలవంతం చేశారు. 34 ప్రజలు పొంగజేసే పదార్థం లేని తమ పిండిముద్దలనూ పిండి పిసికే పళ్ళేలనూ మూటకట్టుకొని తమ భుజాలపై పెట్టుకొన్నారు. 35 ✝అంతకుముందు ఇస్రాయేల్ ప్రజలు మోషే మాట ప్రకారం చేసి ఈజిప్ట్‌వాళ్ళ దగ్గర వెండి బంగారు నగలనూ వస్త్రాలనూ అడిగి తీసుకొన్నారు. 36 ఈజిప్ట్‌వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలను దయచూచేలా యెహోవా చేశాడు గనుక వారేమేమి కోరారో వాటిని వారికిచ్చారు. ఈ విధంగా వారు ఈజిప్ట్‌వాళ్ళను దోచుకొన్నారు.
37 ✽అప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు రామసేసునుంచి సుక్కోతు దిక్కుకు తరలివెళ్ళారు. పిల్లలు కాక కాలినడకన వెళ్ళిన పురుషులే ఆరు లక్షలమంది. 38 అంతేకాకుండా వేరు వేరు జాతులవారు అనేకులు వారితో వచ్చారు. పెద్ద పెద్ద మందలూ గొప్ప పశుసంపదా కూడా వచ్చాయి. 39 తరువాత, వారు ఈజిప్ట్‌నుంచి తెచ్చిన పిండి ముద్దలతో పొంగజేసే పదార్థం వేయకుండా రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్దల్లో పొంగజేసే పదార్థం ఏమీ లేదు. తమను ఈజిప్ట్‌నుంచి వెళ్ళగొట్టడం జరిగినందుకు వ్యవధి లేకపోవడంచేత తమకోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేదు.
40 ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్‌లో నివసించిన కాలం నాలుగు వందల ముప్ఫయి సంవత్సరాలు. 41 ఆ నాలుగు వందల ముప్ఫయి సంవత్సరాలు గడిచాక ఆ కాలం ముగిసిన రోజే ఈజిప్ట్‌దేశంనుంచి యెహోవా సేనలన్నీ తరలివెళ్ళాయి. 42 ఆయన వారిని ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చిన రాత్రి యెహోవాకు జాగరణ చేయవలసిన రాత్రి గనుక ఇస్రాయేల్ ప్రజలందరూ తరతరాలకూ ఆ రాత్రి యెహోవాకు జాగరణ చేయవలసినదే.
43 ✽యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు: “పస్కాపండుగ బలి చట్టం ఇదే – పరాయివాడెవ్వడూ దాన్ని తినకూడదు. 44 అయితే మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కొన్న దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చు. 45 కాని, విదేశీయులూ జీతానికి వచ్చిన పనివాళ్ళూ దాన్ని తినకూడదు. 46 ✝ఏ ఇంటివారు ఆ ఇంట్లోనే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెమైనా ఇంట్లోనుంచి బయటికి తీసుకుపోకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. 47 ✝ఇస్రాయేల్ సమాజమంతా ఈ పండుగను ఆచరించాలి. 48 మీ దగ్గర విదేశీయుడు నివసిస్తూ పస్కాపండుగను యెహోవాకు ఆచరించడానికి ఇష్టపడితే అతడి కుటుంబంలో ఉన్న ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. ఆ తరువాత అతడు పండుగలో పాల్గొనవచ్చు. అలాంటివారు ఇస్రాయేల్‌దేశ పౌరుడితో సమానుడు. సున్నతి పొందనివాడైతే పస్కాబలి మాంసం తినకూడదు. 49 ✝మీ దేశంలో పుట్టినవాడికీ మీ మధ్యలో కాపురం చేసే విదేశస్తులకూ విధించిన చట్టం ఒకటే.”
50 ఇస్రాయేల్‌ప్రజలంతా విధేయులయ్యారు. మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే వారు చేశారు. 51 ఆ రోజే యెహోవా ఇస్రాయేల్ ప్రజలను వారి వారి సేనలతో ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చాడు.