11
1 అంతకుముందు యెహోవా మోషేతో చెప్పిన మాట ఇది: “ఫరో మీదికీ ఈజిప్ట్‌మీదికీ ఇంకొక విపత్తు రప్పిస్తాను. ఆ తరువాత అతడు మిమ్ములను ఇక్కడనుంచి వెళ్ళనిస్తాడు. వెళ్ళనివ్వడమే కాదు, అతడు మిమ్ములను పూర్తిగా వెళ్ళగొట్టివేస్తాడు. 2 ✽ప్రజల్లో ప్రతి పురుషుడూ ప్రతి స్త్రీ ఈజిప్ట్‌వాళ్ళైన తమ పొరుగువాళ్ళ దగ్గర వెండి బంగారు నగలను అడిగి తీసుకోవాలని వారితో చెప్పు.” 3 ✝(ఈజిప్ట్‌వాళ్ళు ప్రజలను దయతో చూచేలా యెహోవా చేశాడు. అంతేగాక, ఈజిప్ట్‌దేశంలో రాజ పరివారం దృష్టిలోను, ప్రజల దృష్టిలోను మోషే చాలా ఘనుడు.)4 ✽అప్పుడు మోషే ఫరోతో ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ‘మధ్యరాత్రి సమయంలో నేను ఈజిప్ట్‌వాళ్ళ మధ్యలోకి బయలుదేరుతాను. 5 ఈజిప్ట్‌దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోవడం జరుగుతుంది. అంటే, తన సింహాసనంమీద కూర్చున్న ఫరోకు మొదట పుట్టిన సంతానం మొదలుకొని తిరగలి విసిరే పనికత్తెకు మొదట పుట్టిన సంతానం వరకు, పశువుల్లో కూడా తొలి సంతానమంతా చనిపోవడం జరుగుతుంది.’
6 “అప్పుడు ఈజిప్ట్‌దేశంలో అంతటా గొప్ప ఏడ్పు ఉంటుంది. అలాంటి ఏడ్పు ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు, ఇకనుంచి జరగదు. 7 ✝యెహోవా ఈజిప్ట్‌వాళ్ళకూ ఇస్రాయేల్‌ప్రజకూ మధ్య భేదం చూపిస్తాడని మీకు తెలియాలి, గనుక ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరిమీదా వారి పశువుల్లో దేనిమీదా ఏ కుక్కా నాలుక ఆడించదు. 8 అప్పుడు మీ పరివారంలోని వీళ్ళంతా నాదగ్గరికి వచ్చి నాకు సాష్టాంగపడి నాతో ఇలా అంటారు: ‘వెళ్ళిపోండి. మీరూ మిమ్మల్ని అనుసరించేవాళ్ళంతా వెళ్ళిపోండి! ఆ తరువాత నేను వెళ్ళిపోతాను.’”
అలా చెప్పి మోషే ఫరోదగ్గరనుంచి తీవ్రకోపంతో బయలుదేరాడు.
9 ✝యెహోవా మోషేతో, “నా అద్భుతాలు ఈజిప్ట్‌దేశంలో అధికం కావాలని నా ఉద్దేశం, గనుక ఫరో నీ మాట వినడు” అన్నాడు. 10 ✽మోషే అహరోనులు ఫరో సముఖంలో ఆ అద్భుతాలు చేశారు. అయితే ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు, గనుక అతడు తన దేశంనుంచి ఇస్రాయేల్‌ప్రజను వెళ్ళనియ్యలేదు.