10
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో దగ్గరకు తిరిగి వెళ్ళు. ఈ నా అద్భుతమైన సూచనలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతడి సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను. 2 నేను ఈజిప్ట్‌వాళ్ళపట్ల వ్యవహరించిన విధానాన్నీ వాళ్ళమధ్య చేసిన అద్భుతమైన సూచనలనూ నీవు నీ కొడుకులకూ మనుమలకూ తెలియజేయాలనీ యెహోవాను నేనే అని మీరంతా తెలుసుకోవాలనీ ఇందులో నా ఉద్దేశం.”
3 మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: “హీబ్రూవారి దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవెంత కాలం నా ఎదుట మెడ వంచకుండా ఉంటావు? నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి. 4 నీవు నా ప్రజలను వెళ్ళనియ్యకపోయావా, రేపు నేను నీ దేశానికి మిడతలను రప్పిస్తాను.
5 “భూమి కనబడలేనంతగా అవి దాన్ని కమ్ముతాయి. మీ దేశంలో మిగిలినదానిని, అంటే వడగండ్లవల్ల నాశనం కాని దాన్నంతా అవి తినివేస్తాయి. మీ పొలాల్లో ఉన్న ప్రతి చెట్టునూ తింటాయి. 6 నీ ఇండ్లూ నీ సేవకుల ఇండ్లూ ఈజిప్ట్‌వాళ్ళందరి ఇండ్లూ వాటితో నిండిపోతాయి. నీ పూర్వీకులు ఈ దేశంలో నివసించడం ఆరంభించిన రోజునుంచి ఈ రోజువరకు ఇలా జరగడం వారు చూడలేదు.” అప్పుడు మోషే ఫరో దగ్గరనుంచి వెళ్ళాడు.
7 ఫరో పరివారం చక్రవర్తితో “ఆ మనిషి ఎంతకాలం మనల్ని తన వలలో చిక్కించుకొని ఉంటాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించి సేవించేందుకు వారిని వెళ్ళనియ్యండి. ఈజిప్ట్ పాడైపోయిందని మీకింకా తెలీదా?” అన్నారు.
8 కనుక మోషేనూ అహరోన్నూ ఫరో తనదగ్గరికి మళ్ళీ రప్పించారు. అతడు వారితో “సరి, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను ఆరాధించి సేవించండి. అయితే అసలు వెళ్ళబొయ్యే వారెవరు?” అన్నాడు.
9 మోషే అన్నాడు, “మేము యెహోవాకు మహోత్సవం చేయాలి. గనుక మేము మా పిన్నాపెద్దలనూ మా కొడుకులనూ కూతుళ్ళనూ మందలనూ పశువులనూ వెంటబెట్టుకొని వెళ్ళాలి”.
10 అందుకు ఫరో “నేను మిమ్మల్ని మీ పిల్లలతోపాటు వెళ్ళనిస్తే యెహోవా మీకు తోడైవుంటాడు గాక! అసలు మీకు దురుద్దేశం ఉంది! 11 వాళ్ళను వెళ్ళనివ్వను. పురుషులు మాత్రమే వెళ్ళి యెహోవాను ఆరాధించి సేవించాలి. మీరు కోరేది అదే గదా” అన్నాడు. వారిని ఫరో సముఖంనుంచి వెళ్ళగొట్టారు.
12 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “గాలిలో ఎగిరే మిడతలను ఈజిప్ట్‌దేశానికి రప్పించడానికి ఈజిప్ట్‌మీద నీ చెయ్యి చాపు. వడగండ్లవల్ల నాశనం గాక, దేశంలో మిగిలిన మొక్కలన్నిటినీ ఆ మిడతలు తినివేస్తాయి.”
13 మోషే తన కర్రను ఈజిప్ట్‌దేశంమీద చాపాడు; దేశంమీద పగలంతా రాత్రంతా తూర్పు గాలి విసిరేలా యెహోవా చేశాడు. ప్రొద్దున ఆ తూర్పు గాలికి ఎగిరే మిడతలు వచ్చాయి. 14 ఆ మిడతలు ఈజిప్ట్‌దేశమంతటి మీదికీ వచ్చి ఆ సరిహద్దునుంచి ఈ సరిహద్దువరకు ఈజిప్ట్ అంతటిమీదా కమ్మాయి. అంత దట్టమైన మిడతల గుంపులు పూర్వం ఎన్నడూ కనిపించలేదు, తరువాత కనిపించబోవు.
15 అవి దేశాన్నంతా కమ్మాయి; దేశం చీకటిగా అయిపోయింది. వడగండ్ల వల్ల నాశనం గాక పొలాల్లో మిగిలిన ప్రతి మొక్కనూ చెట్ల పండ్లన్నిటినీ తినివేశాయి. ఈజిప్ట్‌దేశమంతటా చెట్టుకు గానీ మొక్కకు గానీ పచ్చనిది ఏదీ మిగలలేదు.
16 ఫరో హడావుడిగా మోషే అహరోనులను పిలిపించి ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవాకూ మీకూ విరోధంగా తప్పిదం చేశాను. 17 ఈ ఒకసారి నా తప్పిదం క్షమించండని మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీ దేవుడు యెహోవా నాదగ్గరనుంచి చావు తెచ్చే ఈ విపత్తును మాత్రం తొలగించమని ఆయన్ను ప్రాధేయపడండి.”
18 మోషే ఫరో దగ్గరనుంచి వెళ్ళి యెహోవాను ప్రాధేయపడ్డాడు. 19 యెహోవా గాలిని త్రిప్పి పడమటినుంచి చాలా పెనుగాలి విసిరేలా చేశాడు. ఆ గాలికి ఆ మిడతలు కొట్టుకుపోయి ఎర్రసముద్రంలో పడ్డాయి. ఈజిప్ట్ సరిహద్దుల్లో ఒక్క మిడత కూడా ఎక్కడా మిగలలేదు. 20 అయితే ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు, గనుక అతడు ఇస్రాయేల్‌ప్రజను వెళ్ళనియ్యలేదు.
21 అప్పుడు యెహోవా మోషేతో “నీ చెయ్యి ఆకాశంవైపు చాపు. ఈజిప్ట్‌దేశంమీద కటిక చీకటి కమ్ముతుంది” అన్నాడు.
22 మోషే తన చెయ్యి ఆకాశంవైపు చాపగానే దట్టమైన చీకటి కమ్మింది. అది ఈజిప్ట్‌దేశమంతట్లో మూడు రోజులు ఉంది. 23 ఆ మూడు రోజుల్లో ఒకరినొకరు చూడలేకపోయారు. ఎవ్వరూ తానున్న స్థలంనుంచి లేవలేకపోయారు. అయితే ఇస్రాయేల్‌ప్రజ నివసించే స్థలాల్లో వెలుగు ఉంది.
24 ఫరో మోషేను పిలిపించి, “మీరు వెళ్ళి యెహోవాను ఆరాధించి సేవించండి. మీ పిల్లలు మీతో కూడా వెళ్ళవచ్చు. మీ మందలూ మీ పశువులూ మాత్రం ఇక్కడ ఉంచాలి” అన్నాడు.
25 అందుకు మోషే ఇలా జవాబిచ్చాడు: “అప్పుడు మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలులకోసం హోమాలకోసం మీరు పశువుల్ని ఇవ్వవలసి వస్తుంది. 26 అలా కాదు. మా పశువులు కూడా మాతోపాటు వెళ్ళాలి. ఒక్క డెక్కయినా విడిచిపెట్టము. మా దేవుడైన యెహోవాను ఆరాధించి సేవించడానికి మా పశువుల్లోనుంచి వేటిని తీసుకోవాలో, యెహోవా ఆరాధనలో ఏమేమి ఉపయోగించాలో అక్కడ చేరేవరకు మాకే తెలియదు.”
27 అయితే ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు గనుక అతడు వారిని వెళ్ళనియ్యలేదు. 28 ఫరో మోషేతో అన్నాడు, “బయటకు పో. నన్ను చూడడానికి ఇంకెన్నడూ రాకు, జాగ్రత్త సుమా! నువ్వు నా ముఖాన్ని మళ్ళీ చూచే రోజున చనిపోతావు.” 29 అందుకు మోషే అన్నాడు, “సరే, నీ మాటప్రకారమే ఇకనుంచి నీ ముఖాన్ని చూడను.”