9
1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఫరోదగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పు – హీబ్రూవారి దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి. 2 నీవు వారిని వెళ్ళనియ్యడానికి ఒప్పుకోకుండా ఇంకా వారిని ఆపుతూ ఉంటే, 3 యెహోవా తన చెయ్యి చాపి చాలా బాధకరమైన తెగులును పంపుతాడు. ఆ తెగులు పొలాల్లో ఉన్న నీ పశువులకూ గుర్రాలకూ గాడిదలకూ ఒంటెలకూ ఎడ్లకూ గొర్రెలకూ తగులుతుంది. 4 అయితే యెహోవా ఇస్రాయేల్‌ప్రజల పశువులకూ ఈజిప్ట్‌వాళ్ళ పశువులకూ మధ్య భేదం కనపరుస్తాడు. ఇస్రాయేల్ వారికి ఉన్నవాటన్నిట్లో ఏదీ చావదు.”
5 యెహోవా సమయాన్ని నిర్ణయించి “రేపు యెహోవా ఈ దేశంలో ఇలా జరిగిస్తాడు.” అన్నాడు. 6 మరుసటి రోజు యెహోవా అలాగే జరిగించాడు కూడా. ఈజిప్ట్‌వాళ్ళ పశువులన్నీ చచ్చాయి గాని ఇస్రాయేల్‌ప్రజల పశువులలో ఒక్కటైనా చావలేదు. 7 ఇస్రాయేల్‌వారి పశువుల్లో ఒక్కటి కూడా చావలేదని ఫరో విచారించి తెలుసుకొన్నాడు. అంతేగాని ఫరో గుండె ఇంకా బండబారిపోయేవుంది.
8 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు కొలిమిలోనుంచి పిడికిళ్ళ బూడిద తీసుకొని ఫరో చూస్తుండగానే మోషే దాన్ని ఆకాశంవైపు విసిరివెయ్యాలి. 9 బూడిద ఈజిప్ట్ దేశమంతటిమీద సన్నని దుమ్ము అవుతుంది: అది ఈజిప్ట్‌దేశంలో అంతటా మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులవుతుంది” అన్నాడు.
10 గనుక వారు కొలిమిలోనుంచి బూడిద తీసుకొని ఫరో ఎదుట నిలబడ్డారు. మోషే దాన్ని ఆకాశంవైపు విసరివేసినప్పుడు అది మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులయింది. 11  ఆ కురుపులు ఈజిప్ట్‌వాళ్ళందరికి వచ్చినట్టే మాంత్రికులకు కూడా వచ్చాయి. గనుక వారు మోషే ఎదుట నిలబడలేకపొయ్యారు. 12 అయితే ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు. యెహోవా మోషేతో చెప్పిన ప్రకారమే అతడు వారి మాటను నిర్లక్ష్యం చేశాడు.
13 తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “తెల్లవారగానే నీవు లేచి వెళ్ళి ఫరో ఎదుట నిలబడి అతడితో ఈ విధంగా చెప్పు – హీబ్రూవారి దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి. 14 లేకపోతే, లోకమంతట్లో నావంటివాడెవడూ లేడని నీవు తెలుసుకొనేలా ఈసారి నేను నా విపత్తులన్నీ నీమీదికీ నీ పరివారం మీదికీ నీ ప్రజలమీదికీ రప్పిస్తాను. 15 ఇంతకుముందు నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజనూ విపత్తుతో కొట్టి ఉంటే మీరు భూమిమీద లేకుండా నాశనమై ఉండేవారే. 16  అయితే నేను నీకు నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు విశాలలోకంలో ప్రచురం కావాలి. ఈ కారణంచేతనే నిన్ను బ్రతకనిచ్చాను. 17 నీవింకా నా ప్రజను వెళ్ళనియ్యకుండా వారికి విరోధంగా మిడిసి పడుతున్నావు. 18 ఇదిగో విను. రేపు ఈ వేళకు నేను చాలా బాధకరమైన వడగండ్లను కురిపిస్తాను. ఈజిప్ట్‌లో దాని ఆరంభంనుంచి ఇదివరకు అలాంటి వడగండ్లు పడలేదు. 19 అందుచేత ఇప్పుడు నీవు నీ పశువులనూ పొలాల్లో ఉన్న నీ ఆస్తినంతా భద్రమైన స్థలానికి రప్పించాలి. లోపలికి రాకుండా వెలుపల ఉండే ప్రతి మనిషిమీదా ప్రతి జంతువుమీదా వడగండ్లు పడి చంపివేస్తాయి.”
20 ఫరో సేవకులలో ఎవరైతే యెహోవా మాటకు భయపడ్డారో వాళ్ళు తమ దాసులనూ పశువులనూ ఇండ్లలోకి త్వరగా తెచ్చారు. 21 యెహోవా మాటను లక్ష్యపెట్టనివారైతే తమ దాసులనూ పశువులనూ వెలుపల ఉండనిచ్చారు.
22 యెహోవా మోషేతో అన్నాడు, “నీ చెయ్యి ఆకాశంవైపు చాపు. ఈజిప్ట్‌దేశంలో అంతటా మనుషులమీదా జంతువులమీదా పొలాల్లో ఉన్న మొక్కలన్నిటిమీదా వడగండ్లు పడతాయి.”
23 మోషే తన కర్రను ఆకాశంవైపు చాపగానే యెహోవా ఉరుములనూ వడగండ్లనూ పుట్టించాడు. పిడుగులు భూమిమీద పడ్డాయి. యెహోవా ఈజిప్ట్‌దేశంపైన వడగండ్లను కురిపించాడు. 24 ఆ వడగండ్ల వర్షం, దానితో వచ్చిన పిడుగులు చాలా బాధకరమైనవి. ఈజిప్ట్ రాజ్యంగా ఏర్పడ్డనాటినుండి అలాంటిది ఎన్నడూ కలగలేదు. 25 ఆ వడగండ్లు ఈజిప్ట్ అంతటా వెలుపల ఉండేదాన్నంతా జంతువులనూ మనుషులనూ పొలాల్లో మొక్కలనూ పడగొట్టాయి. ప్రతి చెట్టూ కూడా విరిగిపోయింది. 26 ఇస్రాయేల్‌ప్రజ కాపురమున్న గోషెన్‌లో మాత్రమే వడగండ్లు పడలేదు.
27 అప్పుడు ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి వారితో “ఈ సారి నేను తప్పిదం చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నాప్రజా దోషులం. 28 దేవుడు పంపిన ఈ ఉరుములూ వడగండ్లూ ఇక చాలు. వాటిని ఆపమని యెహోవాను ప్రాధేయపడండి. నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను. ఇకనుంచి మిమ్మల్ని నిలుపను” అన్నాడు.
29 అందుకు మోషే అన్నాడు, “నేను నగరంనుంచి బయటికి వెళ్ళగానే నా చేతులు యెహోవావైపు చాపుతాను. ప్రపంచం యెహోవాదే అని మీరు తెలుసుకొనేలా అప్పుడే ఉరుములు ఆగుతాయి, వడగండ్లు ఇక పడవు. 30 అయినా యెహోవాదేవుడంటే నీకూ నీ సేవకులకూ భయభక్తులు ఇంకా కలగలేదని నాకు తెలుసు.”
31 ఆ రోజుల్లో జనపనార మొగ్గలు వేసింది. యవల చేలు వెన్నులు వేశాయి గనుక ఈ రెండూ పాడైపొయ్యాయి. 32 గాని వారి రెండు రకాల గోధుమలు ఇంకా ఎదగలేదు. గనుక అవి పాడు కాలేదు.
33 మోషే ఫరో దగ్గరనుంచి నగరం బయటికి వెళ్ళి యెహోవావైపు తన చేతులు చాపగానే ఉరుములూ వడగండ్లూ ఆగిపొయ్యాయి, వర్షం అప్పటినుంచి కురియలేదు. 34 వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూచినప్పుడు అతడూ అతడి పరివారమూ ఇంకా అక్రమం కొనసాగించారు. తమ గుండెలు బండబారిపోయేలా చేసుకొన్నారు. 35 ఫరో గుండె ఇంకా బండబారిపోయివుంది గనుక యెహోవా మోషేచేత పలికించినట్టే ఫరో ఇస్రాయేల్‌ప్రజను వెళ్ళనివ్వలేదు.