8
1 ✽యెహోవా నదిని కొట్టి ఏడు రోజులయ్యాక మోషేతో ఇలా అన్నాడు: “నీవు ఫరోదగ్గరకు వెళ్ళి ఇలా చెప్పు – యెహోవా చెప్పేదేమిటంటే, నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి. 2 ✽నీవు వారిని వెళ్ళనియ్యడానికి ఒప్పుకోకుండా ఉన్నావా, విను, నేను నీ దేశాన్నంతా సరిహద్దులవరకు కప్పలచేత బాధిస్తాను. 3 నది కప్పలమయంగా ఉంటుంది. అవి నదిలోనుంచి వచ్చి నీ ఇంట్లోకీ నీ పడకగదిలోకీ నీ మంచంమీదికీ నీ సేవకుల ఇండ్లలోకీ నీ ప్రజమీదికీ నీ పొయ్యిలలోకీ నీ పిండి పిసికే తొట్లలోకీ దూరుతాయి. 4 ఆ కప్పలు నీ మీదికీ నీ జనంమీదికీ నీ సేవకులందరిమీదికీ దూకుతాయి.”5 యెహోవా మోషేతో అన్నాడు, “నీవు అహరోనుతో ‘నీ కర్ర చేతపట్టుకొని నది పాయలమీదా కాలువలమీదా చెరువులమీదా నీ చెయ్యి చాపి కప్పలు ఈజిప్ట్‌దేశంమీదికి వచ్చేలా చెయ్యి’ అని చెప్పు.”
6 ✝అహరోను ఈజిప్ట్ జలాలమీద తన చెయ్యి చాపినప్పుడు కప్పలు పైకి వచ్చి ఈజిప్ట్‌దేశాన్ని కమ్మాయి. 7 ✽అయితే మాంత్రికులు తమ మంత్రవిద్య ద్వారా అలా చేశారు. వాళ్ళు కూడా ఈజిప్ట్‌దేశంమీదికి కప్పలు వచ్చేలా చేశారు.
8 ✽అప్పుడు ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి “నాదగ్గర్నుంచీ నా జనం దగ్గర్నుంచీ ఈ కప్పల్ని తొలగించమని యెహోవాను ప్రాధేయపడండి. అప్పుడు యెహోవాకు బలులు అర్పించడానికి ఈ ప్రజను వెళ్ళనిస్తాను” అన్నాడు.
9 అందుకు మోషే అన్నాడు, “ఈ కప్పలు నదిలోనే మిగిలి, మీ దగ్గర, మీ ఇండ్లలో ఉండకుండా నాశనమయ్యేలా మీకోసం మీ పరివారంకోసం, మీ జనంకోసం నేనెప్పుడు ప్రాధేయపడాలి? వేళ నియమించే ఘనత మీదే.”
ఫరో “రేపు” అన్నాడు.
10 మోషే అన్నాడు, “మా దేవుడైన యెహోవా వంటి వాడెవ్వడూ లేడ✽ని మీరు తెలుసుకోవాలి, గనుక మీ మాట ప్రకారమే జరుగుతుంది. 11 కప్పలు మిమ్మల్నీ మీ ఇళ్ళనూ మీ సేవకులనూ మీ జనాన్నీ విడిచిపోతాయి. అవి నదిలోనే మిగులుతాయి.”
12 మోషే అహరోనులు ఫరో దగ్గరనుంచి బయటికి వచ్చిన తరువాత యెహోవా ఫరోమీదికి రప్పించిన కప్పలను గురించి మోషే ఆయనను ప్రాధేయపడ్డాడు. 13 మోషే మనవి ప్రకారం యెహోవా చేశాడు. ఇళ్ళలోనూ ఆవరణాల్లోనూ పొలాల్లోనూ కప్పలు చచ్చాయి. 14 ప్రజలు వాటిని కుప్పలుగా వేశారు. దేశం కంపు కొట్టింది. 15 ✽అయినా, బాధనివారణ అయిందని ఫరో తన గుండె బండబారిపోయేలా చేసుకొన్నాడు. యెహోవా చెప్పినట్లే అతడు వారి మాటను నిర్లక్ష్యం చేశాడు.
16 యెహోవా మోషేతో అన్నాడు, “నీవు అహరోనుతో ఇలా చెప్పు: ‘నీ కర్ర చాపి నేలమీది దుమ్మును కొట్టు’. దుమ్ము ఈజిప్ట్‌దేశంలో అంతటా దోమలు✽ అవుతాయి.” 17 వారు అలా చేశారు. అహరోను తన కర్ర చేతపట్టుకొని దాన్ని చాపి నేలమీది దుమ్మును కొట్టినప్పుడు ఈజిప్ట్‌దేశంలో అంతటా నేల దుమ్మంతా దోమలు అయింది. అవి మనుషులమీదా జంతువులమీదా వచ్చి పడ్డాయి. 18 ✽మాంత్రికులు కూడా దోమలు పుట్టించడానికి తమ మంత్రవిద్యద్వారా ప్రయత్నం చేశారు గాని అది వాళ్ళచేత కాలేదు. మనుషులమీదా జంతువులమీదా దోమలు ఉన్నాయి.
19 మాంత్రికులు ఫరోతో “ఇది దైవశక్తి” అని ఒప్పుకొన్నారు. అయితే ఫరో గుండె బండబారిపోయి ఉంది, గనుక యెహోవా చెప్పినట్టే అతడు వాళ్ళ మాటను అలక్ష్యం చేశాడు.
20 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “తెల్లవారగానే నీవు లేవాలి. అప్పుడు ఫరో నది దగ్గరికి వెళ్తాడు. నీవక్కడ అతని ఎదుట నిలబడివుండి ఇలా చెప్పాలి: నా ప్రజ నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి, 21 నీవు నా ప్రజను వెళ్ళనియ్యక పొయ్యావా నేను నీమీదికీ నీ సేవకులమీదికీ నీ ప్రజలమీదికీ నీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపిస్తాను. ఈజిప్ట్‌వాళ్ళ ఇళ్ళూ భూములూ ఈగల గుంపులతో నిండి ఉంటాయి. 22 ✽అయితే నా ప్రజ కాపురమున్న గోషెను ప్రదేశంలో ఈగల గుంపులుండవు. ఆ రోజు ఆ ప్రదేశాన్ని ప్రత్యేకపరుస్తాను. ఈ విధంగా యెహోవా అనే నేనే ఈ దేశంలో ఉన్నానని నీవు తెలుసుకొనేలా చేస్తాను. 23 నా ప్రజలపట్ల, నీ ప్రజలపట్ల వేరువేరు విధాలుగా వ్యవహరిస్తాను. ఈ అద్భుతమైన సూచన రేపు జరుగుతుంది.”
24 యెహోవా అలాగే చేశాడు. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకీ అతడి సేవకుల ఇళ్ళలోకీ ఈజిప్ట్‌దేశంలో అంతటా వచ్చాయి. ఆ దేశం ఈగల గుంపులవల్ల పాడయింది.
25 ✽ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి, “మీరు వెళ్ళి మీ దేవుడికి బలులు అర్పించండి గానీ ఈ దేశంలోనే అలా చెయ్యాలి” అన్నాడు.
26 అందుకు మోషే ఇలా జవాబిచ్చాడు: “అలా చేయతగదు. మేము మా దేవుడైన యెహోవాకు అర్పించే బలులు ఈజిప్ట్‌వాళ్ళకు అసహ్యమైనవి. ఇదిగో ఈజిప్ట్‌వాళ్ళ కళ్ళెదుట వాళ్ళకు అసహ్యమైన బలులు మేము అర్పిస్తే వాళ్ళు మామీద రాళ్ళు రువ్వి చంపరా? 27 మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణం చేసి మా దేవుడు యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అక్కడే ఆయనకు బలులు అర్పిస్తాం.”
28 ఫరో ఒప్పుకొన్నాడు. “మీరు మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించడానికి మిమ్ముల్ని ఎడారిలోకి వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళకండి. ఇప్పుడు నాకోసం దేవుణ్ణి ప్రాధేయపడండి”✽ అన్నాడు.
29 మోషే “ఇదిగో విను. నేను మీదగ్గరనుంచి వెళ్ళి యెహోవాను ప్రాధేయపడతాను. రేపు ఈ ఈగల గుంపులు ఫరోనూ అతని సేవకులనూ అతని ప్రజలనూ విడిచిపోతాయి. అయితే ఈ ప్రజ యెహోవాకు బలులు అర్పించడానికి ఫరో వారిని వెళ్ళనియ్యకుండా ఇంకా మోసంతో వ్యవహరించకూడదు” అన్నాడు.
30 మోషే ఫరోదగ్గరనుంచి వెళ్ళి యెహోవాను ప్రార్థించాడు. 31 యెహోవా మోషే మనవి ప్రకారం చేశాడు, ఈగల గుంపులను ఫరోదగ్గరనుంచీ, అతడి సేవకుల, అతడి ప్రజల దగ్గరనుంచి తొలగించాడు. ఒక్కటైనా మిగలలేదు. 32 ✽అయితే ఈ సారి కూడా ఫరో తన గుండె బండబారిపోయేలా చేసుకొని ప్రజను వెళ్ళనివ్వలేదు.