7
1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో విను, నిన్ను ఫరోకు దేవుడుగా నియమించాను. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. 2 నేను నీకు ఆజ్ఞాపించేదంతా నీవు చెప్పాలి. ఫరో తన దేశంనుంచి ఇస్రాయేల్‌ప్రజను వెళ్ళనియ్యాలని నీ అన్న అహరోను అతనితో చెపుతాడు. 3 ఫరో గుండె బండబారిపోయేలా నేను చేస్తాను. ఈజిప్ట్‌దేశంలో నా అద్భుతమైన సూచనలూ మహా క్రియలూ అనేకం చేస్తాను. 4 అప్పుడు కూడా అతడు మీ మాట వినడు, గనుక నేను నా చెయ్యి ఈజిప్ట్‌మీద వేసి గొప్ప తీర్పు క్రియలు చేసి నా సేనలను, అంటే నా ప్రజ అయిన ఇస్రాయేల్‌వారిని ఈజిప్ట్‌దేశంనుంచి బయటికి తీసుకువస్తాను. 5 నేనే ఈజిప్ట్‌మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్యనుంచి ఇస్రాయేల్ ప్రజను బయటికి తీసుకువచ్చేటప్పుడు నేను యెహోవానని ఈజిప్ట్‌వాళ్ళు తెలుసుకొంటారు.”
6 మోషే అహరోనులు తమకు యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారు. 7 వారు ఫరోతో మాట్లాడిన కాలంలో మోషే ఎనభై ఏళ్ళవాడు, అహరోను ఎనభై మూడేళ్ళవాడు.
8 యెహోవా మోషేతో, అహరోనుతో ఇలా అన్నాడు: 9 “ఫరో మీతో ఏదైనా అద్భుతం చెయ్యమంటే, నీవు అహరోనుతో అతని చేతికర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమను. అది పామవుతుంది.”
10 మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టే చేశారు. అహరోను ఫరో ఎదుటా అతడి పరివారం ఎదుటా తన చేతికర్రను పడవేసినప్పుడు అది పామయింది. 11 అప్పుడు ఫరో జ్ఞానులనూ ఇంద్రజాలికులనూ పిలిపించాడు. ఈ ఈజిప్ట్ మాంత్రికులు కూడా తమ మంత్రవిద్య ద్వారా అహరోను చేసినట్టే చేశారు. 12 వాళ్ళలో ప్రతి ఒక్కరూ తన చేతికర్ర పడవేసినప్పుడు అది పామయింది. అయితే అహరోను కర్ర వాళ్ళ కర్రలను మ్రింగివేసింది. 13 అయినా ఫరో గుండె బండబారి పోయింది. యెహోవా చెప్పినట్టే, మోషే అహరోనుల మాట అతడు వినలేదు.
14 తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో హృదయం కఠినం అయింది. అతడు ప్రజను వెళ్ళనియ్యడానికి ఒప్పుకోవడం లేదు. 15 రేపు ప్రొద్దున్న ఫరో నది దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నీవు అతని దగ్గరకు వెళ్ళు, పాముగా మారిన కర్రను చేతపట్టుకొని అతణ్ణి కలుసుకోవడానికి నది ఒడ్డున నిలబడు. 16 నీవు అతనితో ఇలా అనాలి: ‘హీబ్రూవారి దేవుడైన యెహోవా నన్ను నీదగ్గరికి పంపాడు. ఆయన అంటున్నాడు – నా ప్రజ ఎడారిలో నన్ను ఆరాధించి సేవించడానికి వారిని వెళ్ళనియ్యి. ఇదివరకు నీవు నామాట వినలేదు. 17 ఇప్పుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను యెహోవానని దీనివల్ల నీవు తెలుసుకొంటావు: ఇదిగో, నేను నా చేతిలో ఉన్న కర్రతో నది నీళ్ళను కొడతాను. అవి రక్తంగా మారుతాయి. 18 నదిలో ఉన్న చేపలు చస్తాయి. నది కంపు కొడుతుంది. నది నీళ్ళు త్రాగడానికి ఈజిప్ట్‌వాళ్ళకు అసహ్యమనిపిస్తుంది.’”
19 యెహోవా మోషేతో అన్నాడు, “నీవు అహరోనుతో ఇలా చెప్పు – ‘ఈజిప్ట్ నీళ్ళు రక్తం అయ్యేలా నీ కర్రను చేతపట్టుకొని వాటిమీద, అంటే వాళ్ళ నదులమీదా కాలువల మీదా చెరువులమీదా అన్ని జలధారలమీదా నీ చెయ్యి చాపు.’ ఈజిప్ట్‌దేశంలో అంతటా చెక్క తొట్లలోను రాతి పాత్రల్లోను సహా రక్తం ఉంటుంది.”
20 యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మోషే అహరోనులు చేశారు. ఫరో, అతడి పరివారమూ చూస్తుండగానే అహరోను తన కర్రను ఎత్తి నది నీళ్ళను కొట్టాడు. నది నీళ్ళంతా రక్తంగా మారింది. 21 నదిలో ఉన్న చేపలు చచ్చాయి. నది కంపు కొట్టింది. ఆ నది నీళ్ళు ఈజిప్ట్‌వాళ్ళు త్రాగలేకపొయ్యారు. ఆ రక్తం ఈజిప్ట్‌దేశంలో అంతటా ఉంది. 22 అయితే ఈజిప్ట్ మాంత్రికులు కూడా వాళ్ళ మంత్రవిద్య ద్వారా అదే పని చేశారు, గనుక యెహోవా చెప్పినట్టు ఫరో గుండె బండబారిపోయింది. అతడు వారి మాట వినలేదు. 23 జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తిరిగి తన భవనంలోకి వెళ్ళాడు. 24 ఈజిప్ట్ వాళ్ళంతా నది నీళ్ళు త్రాగలేక త్రాగే నీళ్ళకోసం నదికి అటూ ఇటూ చెలమలు త్రవ్వుకొన్నారు. 25 యెహోవా నదిని కొట్టి ఏడు రోజులయ్యాయి.