6
1 యెహోవా మోషేతో “నేను ఫరోకు ఏమి చేస్తానో ఇప్పుడు నీవు చూడబోతున్నావు. నా బలిష్ఠమైన చెయ్యి కారణంగా అతడు నా ప్రజను వెళ్ళనిస్తాడు. నా బలిష్ఠమైన చెయ్యి కారణంగా తన దేశంనుంచి వారిని వెళ్ళగొట్టివేస్తాడు” అన్నాడు.
2 దేవుడు మోషేతో ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు: “నేను యెహోవాను. 3 అబ్రాహాముకూ ఇస్సాకుకూ యాకోబుకూ నేను అమిత శక్తిగల దేవుడుగా ప్రత్యక్షమయ్యాను గానీ యెహోవా అనే నా పేరున వారికి నన్ను నేను బయలుపరచుకోలేదు. 4 వారు పరాయివారుగా నివసించిన కనానుదేశాన్ని వారికిస్తానని నేను వారితో నా ఒడంబడిక చేశాను. 5 అంతేగాక, ఈజిప్ట్‌వాళ్ళు దాస్యంలో ఉంచుతున్న ఇస్రాయేల్‌ప్రజల మూలుగులు విని నా ఒడంబడికను తలచుకొన్నాను. 6 అందుచేత నీవు ఇస్రాయేల్ ప్రజతో ఈ మాటలు చెప్పు: నేను యెహోవాను. ఈజిప్ట్‌వాళ్ళు పెట్టిన భారమైన కాడిక్రిందనుంచి మిమ్ములను బయటికి తీసుకువస్తాను. ఆ దాస్యంలోనుంచి మిమ్ములను విడిపిస్తాను. నా చెయ్యి చాపి వాళ్ళకు గొప్ప తీర్పుక్రియలు చేసి మిమ్ములను విమోచిస్తాను. 7 మిమ్ములను నా ప్రజగా స్వీకరించి మీకు దేవుడుగా ఉంటాను. ఈజిప్ట్‌వాళ్ళు పెట్టిన భారంనుంచి విడిపించి మిమ్ములను బయటికి తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు. 8  నేను అబ్రాహాముకూ ఇస్సాకుకూ యాకోబుకూ ఇస్తానని చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్ములను తీసుకువచ్చి దాన్ని మీకు సొత్తుగా ఇస్తాను. నేను యెహోవాను.”
9 మోషే ఇస్రాయేల్ ప్రజలతో ఆ మాటలు చెప్పాడు గానీ వారు నిరాశవల్లా క్రూర దాస్యంవల్లా మోషే మాటను నిర్లక్ష్యం చేశారు.
10-11 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ఈజిప్ట్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇస్రాయేల్‌ప్రజను తన దేశంనుంచి బయటికి వెళ్ళనియ్యాలని అతడితో చెప్పు” అన్నాడు.
12 మోషే యెహోవా సముఖంలో ఇలా జవాబిచ్చాడు: “ఇస్రాయేల్‌ప్రజలే నా మాటను నిర్లక్ష్యం చేశారు. మాట మాంద్యంగల నేను ఫరోతో మాట్లాడితే అతడు నిర్లక్ష్యం చేయకుండా ఎలా ఉంటాడు?”
13 అయితే యెహోవా మోషేకూ అహరోనుకూ ఆజ్ఞ ఇస్తూ, వారు ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్‌దేశంనుంచి బయటికి తీసుకు రావడానికి ఇస్రాయేల్ ప్రజదగ్గరకూ ఈజిప్ట్ చక్రవర్తి ఫరో దగ్గరకూ వెళ్ళాలని చెప్పాడు.
14 వారి వంశాల నాయకులు వీరు: ఇస్రాయేల్ అగ్రజుడైన రూబేను కొడుకులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీరు రూబేను కుటుంబాలు. 15 షిమ్యోను కొడుకులు యెమూయేల్, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు (ఇతడు కనాను స్త్రీ కన్న కొడుకు). వీరు షిమ్యోను కుటుంబాలు. 16 లేవీ కొడుకుల పేర్లు, వారి వంశవృక్షం ప్రకారం: గెర్షోను, కహాతు, మెరారి. లేవీ నూట ముప్ఫయి ఏడేళ్ళు బ్రతికాడు. 17 గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం – లిబినీ, షిమీ. 18 కహాతు కొడుకులు అమ్రాం, ఇసహార్, హెబ్రోను, ఉజ్జీయేల్. కహాతు నూట ముప్ఫయి మూడేళ్ళు బ్రతికాడు. 19 మెరారి కొడుకులు మహలి, మూషి. వీరు తమ తమ వంశాల ప్రకారం లేవీ కుటుంబాలు. 20 అమ్రాం తన మేనత్త యోకెబెదును పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె అతనికి అహరోనునూ మోషేనూ కన్నది. అమ్రాం నూట ముప్ఫయి ఏడేళ్ళు బ్రతికాడు. 21 ఇసహారు కొడుకులు కోరహు, నెపెగు, జిఖ్రీ.
22 ఉజ్జీయేల్ కొడుకులు మిషాయేల్, ఎల్‌సాఫాను, సిత్రీ. 23 అహరోను అమ్మీనాదాబు కూతురు ఎలీషెబను పెళ్ళి చేసుకొన్నాడు. (ఆమె నయస్సోను సోదరి.) ఆమె అహరోనుకు నాదాబునూ అబీహునూ ఎలియాజరునూ ఈతామారునూ కన్నది. 24 కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీరు కోరహువారి కుటుంబాలు. 25 అహరోను కొడుకైన ఎలియాజరు పూతీయేల్ కూతుళ్ళలో ఒకామెను పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె అతనికి ఫీనెహాసును కన్నది. వీరు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశాల నాయకులు.
26 ఈ జాబితాలోని అహరోను, మోషే ఎవరంటే “ఇస్రాయేల్ ప్రజను వారి సేనల ప్రకారం ఈజిప్ట్‌దేశంనుంచి బయటికి తీసుకురావాల”ని యెహోవా ఆజ్ఞాపించినవారే. 27 వీరు ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్‌నుంచి బయటికి తీసుకు రావలసిన విషయం ఈజిప్ట్ చక్రవర్తి ఫరోతో మాట్లాడినవారు. ఆ మోషే, ఆ అహరోను వీరే.
28 ఈజిప్ట్‌దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన రోజు ఆయన, 29 “నేను యెహోవాను. నేను నీతో చెప్పేదంతా నీవు ఈజిప్ట్ చక్రవర్తి ఫరోకు చెప్పు” అని మోషేతో చెప్పాడు.
30 అయితే మోషే “నేను మాట మాంద్యం గల వాణ్ణి. ఫరో నా మాట ఎందుకు వింటాడు?” అని యెహోవా సముఖంలో అన్నాడు.