5
1 ✽ఆ తరువాత మోషే అహరోను ఇద్దరూ వెళ్ళి ఫరోతో ఇలా అన్నారు: “ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: నా ప్రజలు ఎడారిలో నాకు మహోత్సవం చేసేందుకు వారిని వెళ్ళనియ్యి.”2 ఫరో “ఎవడా యెహోవా? అతడి మాట విని ఇస్రాయేల్ ప్రజను ఎందుకు వెళ్ళనివ్వాలి నేను? యెహోవా? – ఎవడో నాకు తెలీదు! అంతేగాక, నేను ఇస్రాయేల్ ప్రజను వెళ్ళనివ్వను” అంటూ జవాబిచ్చాడు.
3 వారు అన్నారు, “హీబ్రూవారి దేవుడు మాకు ప్రత్యక్ష మయ్యాడు. మా దేవుడైన యెహోవాకు బలులర్పించేందుకు ఎడారిలో మూడు రోజుల ప్రయాణం చేయడానికి మాకు సెలవిప్పించండి. లేకపోతే ఆయన మమ్మల్ని ఏ విపత్తుకో ఖడ్గానికో గురి చేయవచ్చు.”
4 ✽అందుకు ఈజిప్ట్ చక్రవర్తి “మోషే! అహరోనూ! ఈ జనం పని చేయకుండా చేస్తున్నారేం! పోయి మీ పని చూచుకోండి” అన్నాడు. 5 అతడింకా అన్నాడు, “దేశంలో ఈ జనసంఖ్య చాలా పెరిగింది. అయినప్పటికీ వాళ్ళు పని మానుకునేలా మీరు చేస్తున్నారు.”
6 ఆ రోజే ఫరో ఇశ్రాయేల్‌ప్రజలను అణగద్రొక్కే అధికారులకూ వారి తనిఖీదారులకూ ఇలా ఆజ్ఞాపించాడు: 7 “ఇటుకలు చేయడానికి ఇంతవరకూ మీరు ఆ జనానికి గడ్డి ఇస్తూ వచ్చారు. ఇకనుంచి అలా ఇవ్వకూడదు. వాళ్ళే వెళ్ళి గడ్డి సేకరించాలి. 8 అయితే వాళ్ళు ఇంతకుముందు చేసినన్ని ఇటుకలే, లెక్క తగ్గకుండా, చేసేలా మీరు చూడాలి. దాన్ని ఏమాత్రం తగ్గించకూడదు. వాళ్ళు వట్టి సోమరులు, గనుకనే ‘మేము వెళ్ళి మా దేవునికి బలులు అర్పించడానికి సెలవివ్వండి’ అంటూ కేకలేస్తూవున్నారు. 9 ఆ మనుషులపైన ఇంకా కష్టమైన పనులు పెట్టాలి. అప్పుడైతే వాళ్ళు పచ్చి అబద్ధాలమీద మనసు నిలపకుండా పని చేస్తారు.”
10 గనుక ప్రజలను అణగద్రొక్కే ఆ అధికారులూ ఆ తనిఖీదారులూ వారిదగ్గరికి వెళ్ళి వారితో అన్నారు, “ఫరో సెలవిచ్చేదేమంటే, మీకు గడ్డి ఇప్పించము. 11 మీరే వెళ్ళి గడ్డి ఎక్కెడెక్కడ దొరుకుతుందో మీ పనికోసం వెదికి తేవాలి. అయితే మీ పనిలో ఇసుమంత కూడా తగ్గించము.” 12 అందుచేత గడ్డికి బదులు కొయ్య కాడ పుల్లలను సేకరించడానికి ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్ దేశం అంతటా చెదిరిపొయ్యారు.
13 అంతేగాక, ఆ అధికారులు వారిని బలవంతం చేస్తూ “గడ్డి మీకున్నప్పుడు రోజూ మీరెన్ని ఇటుకలు చేశారో ఇప్పుడూ అన్ని చేయాలి” అన్నారు. 14 ఫరో అధికారులు ఇస్రాయేల్ ప్రజలమీద నియమించిన ఇస్రాయేల్ తనిఖీదారులను కొట్టి “ఎప్పటిలాగే మీరు చెయ్యాల్సినన్ని ఇటుకలు నిన్న ఈవేళ ఎందుకు చేయలేదు?” అన్నారు.
15 అందుచేత ఇస్రాయేల్‌ప్రజలు, తనిఖీదారులు ఫరోను ప్రాధేయపడుతూ “తమరు తమ దాసులైన మాపట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? 16 తమ దాసులైన మాకు గడ్డి ఇవ్వకుండా ‘ఇటుకలు చెయ్యాలి’ అని మాతో చెప్తూ ఉన్నారు. తమ దాసులైన మమ్మల్ని కొడుతున్నారు కూడా. అయితే తప్పు తమ మనుషులదే” అన్నారు.
17 అందుకు ఫరో అన్నాడు, “మీరు సోమరులు, వట్టి సోమరులు, గనుకనే ‘మేము వెళ్ళి యెహోవాకు బలులు అర్పించడానికి సెలవిప్పించండి’ అని అంటున్నారు గదా. 18 మీరు పోయి పని చెయ్యాలి. గడ్డి మీకివ్వము గానీ నియమించిన లెక్కప్రకారం ఇటుకలు అప్పగించి తీరాలి.”
19 ✽రోజూ చేయవలసిన ఇటుకల లెక్క తక్కువ కాకూడదనే మాటనుబట్టి ఇస్రాయేల్‌ప్రజల తనిఖీదారులు తాము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుసుకొన్నారు. 20 వారు ఫరో దగ్గరనుంచి బయటికి వచ్చినప్పుడు మోషే అహరోనులు వారిని కలుసు కోవడానికి చూస్తూ ఉన్నారు.
21 ఆ తనిఖీదారులు వారిని చూచి ఇలా అన్నారు: “యెహోవా మిమ్మల్ని చూసి న్యాయం తీరుస్తాడు గాక! ఫరోకు, అతని పరివారానికి మమ్మల్ని నీచులుగా చేసి మమ్మల్ని చంపడానికి వారి చేతికి ఖడ్గం అందించినట్టున్నారు”.
22 మరోసారి మోషే యెహోవా వైపు తిరిగి “ప్రభూ, నీవు ఈ ప్రజకు దురవస్థను ఎందుకు కలిగించావు? నన్నెందుకు పంపావు? 23 నేను నీ పేరట ఫరోతో మాట్లాడడానికి వచ్చిన నాటినుంచి అతడు ఈ ప్రజకు కీడు చేస్తూ ఉన్నాడే గానీ నీ ప్రజను రక్షించడానికి నీవు ఏమీ చేయలేదు.”