4
1 అందుకు మోషే జవాబిస్తూ, “కానీ వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారు” అన్నాడు.
2 “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని యెహోవా అడిగాడు. “కర్ర” అన్నాడు మోషే.
3 “దాన్ని నేలమీద పడవెయ్యి” అని ఆయన అన్నాడు. మోషే దాన్ని నేలమీద పడవేసినప్పుడు అది పాము అయింది. మోషే దానిదగ్గరనుంచి పారిపొయ్యాడు గాని యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
4 “నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకో (అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్ర అయింది). 5 యెహోవా, వారి పూర్వీకుల దేవుడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని వారు నమ్మేలా నీవు ఈ విధంగా చెయ్యాలి.”
6 యెహోవా అతనితో ఇంకా అన్నాడు, “నీ చెయ్యి నీ రొమ్మున నీ చొక్కాలోపల పెట్టుకో”. అతడు అలా చేసి, తరువాత బయటికి తీసినప్పుడు చెయ్యి అంతా కుష్ఠే! హిమమంత తెల్లగా అయిపోయింది. 7 “నీ చెయ్యి మళ్ళీ రొమ్మున పెట్టుకో” అన్నాడాయన. మోషే అలా చేసి, తరువాత తన చెయ్యి బయటికి తీసినప్పుడు అది మళ్ళీ అతని మిగతా శరీరంలాగా అయింది. 8 “ఒకవేళ వారు నిన్ను నమ్మకుండా, ఆ మొదటి సూచనవల్ల నీ మాట వినకపోతే ఈ రెండో దానివల్ల వింటారు. 9 వారు ఈ సూచనలు రెండూ నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నీవు అక్కడి నదిలోనుంచి కొంచెం నీళ్ళు తీసుకొని పొడి నేలమీద పోయాలి. నీవు నదిలో నుంచి తీసి పోసిన ఆ నీళ్ళు పొడి నేలమీద రక్తం అవుతాయి” అని యెహోవా అన్నాడు.
10 మోషే యెహోవాతో “ప్రభూ, ఇంతకుముందు నాకు వాగ్దాటి లేదు. నీవు నీ దాసుడైన నాతో మాట్లాడినా, ఇప్పటికీ నా సంగతి అంతే. నా మాట మాంద్యం, నాలుక మందం” అన్నాడు.
11 అందుకు యెహోవా ఇలా అన్నాడు: “మనిషికి నోరిచ్చినదెవరు? మనిషిని మూగవాడుగా, చెవిటివాడుగా, చూపుగలవాడుగా, గుడ్డివాడుగా చేసేదెవరు? యెహోవా అనే నేనే గదా. 12  అయితే ఇప్పుడు వెళ్ళు. నేను నీ నోటికి తోడుగా ఉంటాను. నీవేమి అనాలో నీకు చెపుతాను.”
13 మోషే “ప్రభూ! దయచేసి ఇంకా ఎవరినైనా ఎన్నుకొని పంపించు” అని బదులు చెప్పాడు.
14 యెహోవా కోపం మోషేమీద రగులుకొంది. “లేవీ గోత్రికుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా. అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు కూడా. నిన్ను చూచి అతనికి హృదయంలో సంతోషం కలుగుతుంది. 15 నీవు అతనితో మాట్లాడుతూ అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికీ అతని నోటికీ తోడుగా ఉండి మీరు ఏమి చెయ్యాలో మీకు ఉపదేశిస్తాను. 16 అతడు నీకు బదులు ప్రజలతో మాట్లాడుతాడు. అతడే నీకు నోరు అన్నమాట. నీవు అతనికి దేవుని స్థానంలో ఉన్నట్టే! 17 ఆ చేతికర్రను పట్టుకుపో. దానితో ఆ సూచనలు చూపాలి.”
18 అప్పుడు మోషే తన మామ యిత్రో దగ్గరకు తిరిగి వెళ్ళాడు. “ఈజిప్ట్‌లో నా బంధువులు ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూడడానికి నన్ను వెళ్ళనివ్వండి” అని అతడితో అన్నాడు. యిత్రో “క్షేమంగా వెళ్ళిరా” అన్నాడు.
19 మిద్యానులో యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “నిన్ను చంపాలని చూచినవాళ్ళంతా చనిపోయారు, గనుక ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళు.”
20 మోషే తన భార్యనూ తన కొడుకులనూ గాడిదమీద ఎక్కించుకొని ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళడానికి ప్రయాణం సమకట్టాడు. “దేవుని కర్ర”ను కూడా చేతపట్టుకొని వెళ్ళాడు. 21 ఆ సమయంలో యెహోవా మోషేతో చెప్పినదేమంటే, “నీవు ఈజిప్ట్‌కు తిరిగి చేరిన తరువాత, నేను నీ అధికారంలో ఉంచిన అద్భుతాలన్నీ ఫరో ఎదుట చెయ్యాలి సుమా. నేను అతడి గుండె బండబారిపోయేలా చేస్తాను. అతడు ఇస్రాయేల్ ప్రజను వెళ్ళనియ్యడు. 22 అప్పుడు నీవు ఫరోతో ఇలా అనాలి: యెహోవా చెప్పేదేమంటే, ఇస్రాయేల్ ప్రజ నా సంతానం! నా జ్యేష్ఠ కుమారుడు! 23 నన్ను ఆరాధించి సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు చెప్పాను. నీవు నామాట తిరస్కరించావా నీ పెద్దకొడుకును చంపుతాను.”
24 ప్రయాణంలో వారు మజిలీ చేసిన చోట యెహోవా మోషేను సమీపించి అతణ్ణి చంపదలచాడు. 25 అయితే మోషే భార్య సిప్పోరా పదునుగల రాయి చేతపట్టుకొని తన కొడుకుకు సున్నతి చేసి వాడి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడవేసింది. “నిజంగా నువ్వు నా పాలిటి రక్తసంబంధమైన భర్తవు” అంది. 26 అందుచేత యెహోవా మోషేను బ్రతకనిచ్చాడు. అప్పుడు ఆమె “సున్నతి విషయంలో రక్తసంబంధమైన భర్తవే” అంది.
27 ఇంతలో యెహోవా అహరోనుతో “మోషేను కలుసు కోవడానికి ఎడారికి వెళ్ళు” అన్నాడు, గనుక అతడు వచ్చి దేవుని పర్వతం దగ్గర అతణ్ణి కలుసుకొన్నాడు, ముద్దుపెట్టుకొన్నాడు. 28 యెహోవా తనను పంపిన సంగతినీ ఆయన చెప్పమన్న మాటలన్నీ చేయమని ఆజ్ఞాపించిన అద్భుతాలన్నీ మోషే అహరోనుకు తెలిపాడు. 29 మోషే అహరోనులు వెళ్ళి ఇస్రాయేల్‌ప్రజల పెద్దలందరినీ సమకూర్చారు. 30 యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను తెలియజేశాడు. ప్రజల ఎదుట ఆ అద్భుతమైన సూచనలు చేశాడు. 31 ప్రజలకు నమ్మకం కుదిరింది. యెహోవా ఇస్రాయేల్‌ప్రజను సందర్శించి వారి బాధలు చూశాడని విని వారు తలలు వంచుకొని దేవుణ్ణి ఆరాధించారు.