3
1 మోషే తన మామ యిత్రో మందను మేపాడు. (యిత్రో మిద్యానులో ఉన్న యాజి.) మందను ఎడారి అవతలి వైపుకు తోలుకొంటూ హోరేబు పర్వతం చేరాడు. అది దేవుని పర్వతం.
2 అక్కడ యెహోవా దూత ఒక పొద నడుమ మంటల్లో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతూ ఉంది గానీ అది బూడిద కాలేదు. ఇది చూచి మోషే, 3 “ఈ పొద ఎందుకు కాలిపోవడం లేదు? నేను ఆ వైపుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూడాలి” అనుకొన్నాడు.
4 దాన్ని చూడడానికి అతడు ఆ వైపు రావడం యెహోవా చూచినప్పుడు ఆ పొద మధ్యనుంచి దేవుడు అతణ్ణి పిలుస్తూ “మోషే! మోషే!” అన్నాడు. “చిత్తం ప్రభూ!” అన్నాడతడు.
5 ఆయన “దగ్గరకు రావద్దు. నీ పాదరక్షలు విడువు; నీవు నిలుచున్నది పవిత్ర స్థలం” అన్నాడు. 6 ఆయన ఇంకా “నేను నీ తండ్రియొక్క దేవుణ్ణి, అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి” అన్నాడు. మోషే దేవుని వైపు చూడడానికి భయపడి తన ముఖం కప్పుకొన్నాడు.
7 అప్పుడు యెహోవా అన్నాడు, “ఈజిప్ట్‌లో ఉన్న నా ప్రజల బాధను నేను నిజంగా చూశాను. వారిని అణగద్రొక్కే అధికారుల కారణంగా వారు పెట్టే మొర నేను విన్నాను. వారి దుఃఖాలు నాకు తెలిసేవున్నాయి. 8 ఇప్పుడు వారిని ఈజిప్ట్‌వాళ్ళ చేతిలోనుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను. ఆ దేశంనుంచి విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు నదులై పారుతున్న దేశానికి వారిని తీసుకు వెళ్ళడానికి దిగివచ్చాను. ఆ దేశం కనానుజాతివాళ్ళకూ హిత్తి, అమోరీ, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవాళ్ళకూ నివాస స్థలం. 9 ఇప్పుడు విను. ఇస్రాయేల్‌ప్రజల మొర నాకు చేరింది; ఈజిప్ట్‌వాళ్ళు వారిని పెట్టిన హింస చూశాను; 10 గనుక ఇప్పుడు నిన్ను ఫరోదగ్గరకు పంపుతాను. నీవు ఇస్రాయేల్‌వారైన నా స్వప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకురావాలి.”
11 దేవునితో మోషే అన్నాడు, “ఫరోదగ్గరికి వెళ్ళడానికీ ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్ నుంచి తీసుకురావడానికీ నేను ఏపాటివాణ్ణి?”
12 దేవుడు “నేను తప్పక నీకు తోడుగా ఉంటాను. నీవు ఆ ప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన తరువాత మీరు ఈ పర్వతందగ్గర దేవుణ్ణి ఆరాధిస్తారు. నిన్ను పంపినది నేనే అనడానికి ఇది నీకు రుజువుగా ఉంటుంది” అన్నాడు.
13 దేవునితో మోషే “ఒకవేళ నేను ఇస్రాయేల్ ప్రజ దగ్గరికి వెళ్ళి వారితో ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీదగ్గరికి పంపాడు’ అంటే వారు నన్ను ‘ఆయన పేరేమిటి?’ అని అడగవచ్చు. అలాంటప్పుడు వారితో నేనేం చెప్పాలి?” అన్నాడు.
14 దేవుడు మోషేకు జవాబిస్తూ “నేను శాశ్వతంగా ఉన్నవాడను” అన్నాడు. ఆయన ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేల్ ప్రజతో ‘ఉన్నవాడు’ నన్ను మీదగ్గరికి పంపాడు అనాలి.”
15 దేవుడు మోషేతో ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేల్ ప్రజతో ఈ విధంగా చెప్పాలి: ‘మీ దగ్గరికి నన్ను పంపినది యెహోవా, మీ పూర్వీకుల దేవుడు – అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు,’ ఎల్లకాలం నా పేరు ఇదే. తరతరాలకు నా జ్ఞాపకార్థ నామమిదే. 16 నీవు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల పెద్దలను సమకూర్చి వారితో ఇలా చెప్పు: మీ పూర్వీకుల దేవుడైన యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో చెప్పినదేమిటంటే, ‘నేను మిమ్ములను నిజంగా సందర్శించి ఈజిప్ట్‌లో మీకు సంభవిస్తున్నదాన్ని చూశాను. 17 ఈజిప్ట్ బాధలనుంచి పాలు తేనెలు నదులై పారుతున్న దేశానికి మిమ్ములను రప్పిస్తానన్నాను. అది కనాను, హిత్తి, అమోరీ, పెరిజ్జీ, హివ్వి, యెబూసి జాతులవాళ్ళు కాపురమున్న దేశం.’
18 “వారు నీ మాట వింటారు. తరువాత నీవూ ఇస్రాయేల్ ప్రజల పెద్దలూ ఈజిప్ట్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అతడితో ఇలా చెప్పాలి: ‘హీబ్రూవారి దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మా దేవుడైన యెహోవాకు బలులు సమర్పించేందుకు ఎడారిలో మూడు రోజుల ప్రయాణం చేయడానికి మాకు సెలవిప్పించండి.’ 19 బలవంతంమీద గాని ఈజిప్ట్ చక్రవర్తి మిమ్ములను వెళ్ళనియ్యడని నాకు తెలుసు. 20 అయితే నా చెయ్యి చాపి ఈజిప్ట్‌లో నేను చేయబొయ్యే అద్భుతాలన్నిటివల్ల ఆ దేశాన్ని దండిస్తాను. ఆ తరువాత అతడు మిమ్ములను వెళ్ళనిస్తాడు. 21 అంతేగాక, ఈజిప్ట్‌వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజను దయగా చూచేలా చేస్తాను, గనుక మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. 22 ప్రతి స్త్రీ తనదగ్గర ఉన్న స్త్రీని తన యజమానురాలినీ వెండి నగలూ బంగారు నగలూ వస్త్రాలూ ఇమ్మని అడగాలి. వాటిని మీ కొడుకులకూ కూతుళ్ళకూ ధరింపజేయాలి. ఇలా మీరు ఈజిప్ట్‌వాళ్ళను కొల్లగొట్టివేస్తారు.”