2
1 లేవీ వంశస్థుడొకడు లేవీ వంశంలో ఉన్న ఒకామెను పెళ్ళి చేసుకొన్నాడు. 2 ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. వాడు అందగాడని మూడు నెలలు వాణ్ణి దాచింది. 3 వాణ్ణి ఇంకా దాచిపెట్టలేక వాడికోసం జమ్ము గంప తీసుకొని దానికి జిగట మట్టినీ కీలునూ పూసింది. అందులో ఆ పిల్లవాణ్ణి ఉంచి నది ఒడ్డున ఉన్న జమ్ము గడ్డిలో దాన్ని పెట్టింది. 4 వాడికి ఏం సంభవిస్తుందో చూడడానికి ఆ పిల్లవాడి అక్క కొంత దూరంగా నిలిచి ఉంది.
5 ఫరో కూతురు నదికి స్నానానికి వచ్చింది. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె అక్కడి తుంగలో ఆ జమ్ము గంపను చూచి తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. 6 దాన్ని తెరచి ఆ పిల్లవాణ్ణి చూచింది. వాడు ఏడుస్తున్నాడు. ఆమెకు వాడిమీద జాలి వేసింది. “వీడు హీబ్రూ పిల్లల్లో ఒకడు” అంది.
7 అప్పుడు వాడి అక్క ఫరో కూతురుతో, “మీ కోసం ఈ పిల్లవాడికి పాలివ్వడానికి నేను వెళ్ళి హీబ్రూ స్త్రీలలో ఒక దాదిని తీసుకురమ్మంటారా?” అని అడిగింది.
8 ఫరో కూతురు ఆమెతో “సరే వెళ్ళు” అంది. ఆ అమ్మాయి వెళ్ళి ఆ పిల్లవాడి తల్లిని తీసుకువచ్చింది.
9 ఫరో కూతురు ఆమెతో ఇలా అంది. “ఈ పిల్లవాణ్ణి తీసుకువెళ్ళి నా కోసం వీడికి పాలిచ్చి పెంచు. నేను నీకు జీతమిస్తాను”. ఆమె వాణ్ణి తీసుకువెళ్ళి అలాగే చేసింది.
10 అబ్బాయి పెరిగాడు. ఆమె అతణ్ణి ఫరో కూతురు దగ్గరకు తీసుకువచ్చింది. అతడు చక్రవర్తి కూతురికి పెంపుడు కొడుకు అయ్యాడు. “నీళ్ళలోనుంచి అతణ్ణి తీశాను” అని చెప్పి ఆమె అతనికి ‘మోషే’ అనే పేరు పెట్టింది.
11 మోషే పెద్దవాడయిన తరువాత ఒక రోజు తన సొంత ప్రజల దగ్గరకు వెళ్ళి వారి భారాలను చూశాడు. ఈజిప్ట్‌వాడొకడు ఒక హీబ్రూవాణ్ణి, అంటే తన సొంత ప్రజల్లో ఒకడిని కొట్టడం కూడా చూశాడు. 12 అతడు అటూ ఇటూ పారచూచి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపి అతడి శవాన్ని ఇసుకలో కప్పి పెట్టాడు. 13 మరుసటి రోజు కూడా అతడు వారి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు హీబ్రూవాళ్ళు ఇద్దరు దెబ్బలాడుతూ ఉన్నారు. మోషే తప్పు చేసిన వాడితో “నువ్వు నీ సాటివాణ్ణి ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.
14 అతడిలా బదులు చెప్పాడు: “నిన్ను మామీద అధికారిగా తీర్పరిగా నియమించిందెవరు? ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకొంటున్నావా?”
మోషేకు భయం వేసింది. “ఈ సంగతి బయట పడిపోయిందే” అనుకొన్నాడు. 15 ఫరో ఆ సంగతి విని మోషేను చంపడానికి ప్రయత్నించాడు గాని మోషే అతడి దగ్గరనుంచి మిద్యానులో ఉండేందుకు పారిపొయ్యాడు. అక్కడ ఒక బావిదగ్గర కూర్చున్నాడు.
16 మిద్యానులో ఉన్న యాజికి ఏడుగురు కూతుళ్ళు. తమ తండ్రి మందకు నీళ్ళు పెట్టడానికి వాళ్ళు వచ్చి నీళ్ళు చేది తొట్లు నింపారు. 17 మంద కాపరులు కొందరు వచ్చి వారిని వెళ్ళగొట్టారు గాని మోషే లేచి వారికి సహాయం చేసి వారి మందకు నీళ్ళు పెట్టాడు.
18 వారు తమ తండ్రి “రగూయేల్” దగ్గరికి వచ్చినప్పుడు అతడన్నాడు: “ఈ వేళ మీరింత త్వరగా వచ్చారే, విశేషమేమిటి?” అని అడిగాడు.
19 వారు జవాబిస్తూ “మంద కాపరుల చేతిలోనుంచి ఈజిప్ట్‌వాడొకడు మమ్మల్ని తప్పించాడు. మాకోసం నీళ్ళు చేది మందకు పెట్టాడు కూడా” అన్నారు.
20 అందుకతడు తన కూతుళ్ళతో “అతడెక్కడ? అతణ్ణి విడిచి రావడం దేనికి? అతణ్ణి భోజనానికి పిలవండి” అన్నాడు.
21 ఆ మనిషిదగ్గర నివసించడానికి మోషే నిశ్చయించు కొన్నాడు. అతడు తన కూతురును మోషేకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆ అమ్మాయి పేరు సిప్పోరా. 22 ఆమె ఒక కొడుకును కన్నది. మోషే “ఇది పరాయి దేశం. ఇక్కడ నేను పరాయి మనిషిని” అనుకొని వాడికి గెర్షోం అనే పేరు పెట్టాడు.
23 చాలా రోజులు గడిచాయి. అంతలో ఈజిప్ట్ చక్రవర్తి మృతి చెందాడు గాని ఇస్రాయేల్ ప్రజలు దాస్యంలో ఉండి ఇంకా మూలుగుతూ మొరపెట్టుకొంటూ ఉన్నారు. వారు ఆ దాస్యాన్ని బట్టి చేసిన ఆక్రందన దేవుని సన్నిధానం చేరింది. 24 దేవుడు వారి మూలుగులను విన్నాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన ఒడంబడిక గురించి తలచుకొన్నాడు. 25 దేవుడు ఇస్రాయేల్‌ప్రజను సానుభూతితో చూశాడు.