నిర్గమకాండం (దాస్యవిముక్తి)
1
1 ✝ఈజిప్ట్‌దేశానికి యాకోబుతోపాటు వచ్చిన ఇస్రాయేల్ కొడుకుల పేర్లు ఇవి: 2 రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, 3 ఇశ్శాకారు, జెబూలూను, బెన్యామీను, 4 దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు. 5 యాకోబు సంతతి అంతా డెబ్భైమంది. అప్పటికే యోసేపు ఈజిప్ట్‌లో ఉన్నాడు. 6 ✝యోసేపు, అతడి అన్నదమ్ములు, ఆ తరంవారంతా చనిపోయారు. 7 ✝ఇస్రాయేల్ ప్రజ ఫలవంతమై బహు సంతానంతో సంఖ్యలో అధికమై బలం గల జనం అయింది. ఆ విధంగా వాళ్ళు ఆ దేశం నలుమూలలా వ్యాపించారు.8 ఆ తరువాత యోసేపును ఎరుగని కొత్త చక్రవర్తి ఈజిప్ట్‌లో రాజ్యానికి వచ్చాడు. 9 అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు: “చూశారా, ఇస్రాయేల్‌ప్రజల సంఖ్య చాలా పెరిగిపోయింది. బలంలో మనల్ని మించిపోయారు. 10 వాళ్ళింకా ఎక్కువమంది కాకుండేలా వాళ్ళపట్ల మనం యుక్తిగా వ్యవహరించాలి. లేకపోతే, యుద్ధం వస్తే వాళ్ళు మన శత్రువుల పక్షం చేరి, మనతో పోరాడి దేశంనుంచి వెళ్ళిపోతారేమో.”
11 ✽అందుచేత వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలను భారాలతో అణగదొక్కే అధికారులను వారిమీద నియమించారు. ఈ విధంగా వాళ్ళు ఫరో✽కోసం సరుకులు నిలువచేసే పట్టణాలను కట్టించారు. (అవి పీతోం, రామెసేసు.) 12 అయితే ఈజిప్ట్‌వాళ్ళు వారిని అణగదొక్కే కొలదీ ఇస్రాయేల్ ప్రజ పెరిగి వ్యాపించారు. గనుక ఈజిప్ట్‌దేశీయులకు వారి విషయం భయాందోళన కలిగింది. 13 అందుచేత వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలను కఠిన దాస్యంలో ఉంచారు. 14 జిగటమట్టి పని, ఇటుక పని, అన్ని రకాల పొలం పనులు బలవంతంమీద వారిచేత చేయించుకొన్నారు. వారి పనంతా కఠినతరం చేస్తూ వారి జీవితాలను దుర్భరం చేశారు.
15 అంతేగాక, ఈజిప్ట్ చక్రవర్తి హీబ్రూవారి✽ మంత్రసానులతో, 16 “మీరు హీబ్రూ స్త్రీలకు కాన్పు చేసేటప్పుడు మగబిడ్డ పుడితే చంపెయ్యాలి. ఆడదైతే బతకనియ్యండి” అన్నాడు. 17 ఆ మంత్రసానుల పేర్లు షిఫ్రా, పూయా. వారికి దేవుడంటే భయభక్తులు✽ గనుక ఈజిప్ట్ చక్రవర్తి తమతో చెప్పినది చేయక, మగపిల్లలను బ్రతకనిచ్చారు. 18 ఈజిప్ట్ చక్రవర్తి ఆ మంత్రసానులను పిలిపించి వారితో, “మీరు మగపిల్లల్ని ఎందుకు బతకనిచ్చారు? ఇలా చెయ్యడం దేనికి?” అన్నాడు.
19 ఆ మంత్రసానులు “ఎందుకంటే, హీబ్రూ స్త్రీలు ఈజిప్ట్ స్త్రీలలాంటివాళ్ళు కాదు. వాళ్ళు చాలా బలమైనవారు. వాళ్ళ దగ్గరికి మంత్రసాని చేరేముందే వాళ్ళు ప్రసవిస్తారు” అని ఫరోతో బదులు చెప్పారు.
20 ✝దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఇస్రాయేల్ ప్రజ సంఖ్యలో అధికమై చాలా బలమైన జనంగా అయింది. 21 ఆ మంత్రసానులు దేవునిమీద భయభక్తులు ఉంచినందుచేత ఆయన వారికి కుటుంబాలను ప్రసాదించాడు.
22 ఫరో ఈజిప్ట్ ప్రజలందరికీ “హీబ్రూ వాళ్ళకు పుట్టిన ప్రతి మగబిడ్డనూ నదిలో పారవెయ్యాలి. ప్రతి ఆడబిడ్డనూ బ్రతక నియ్యవచ్చు” అని ఆజ్ఞాపించాడు.