49
1 తరువాత యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా పలికాడు: “సమకూడండి. చివరి రోజుల్లో మీకు ఏమేమి సంభవిస్తాయో అవి మీకు తెలియజేస్తాను. 2 యాకోబు కొడుకులారా, రండి. ఆలకించండి. మీ తండ్రి ఇస్రాయేల్ చెప్పేది వినండి.
3 “రూబేనూ, నీవు నా పెద్ద కొడుకువు,
నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి.
ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యంగలవాడివి.
4 కాని, నీళ్లలాగా అస్థిరుడివి.
నీది ఉన్నత స్థాయి కాదు.
ఎందుకంటే, నీ తండ్రి యొక్క
మంచం మీదికి ఎక్కావు.
దాన్ని అపవిత్రం చేశావు.
నిజంగా అతడు నా మంచం మీదికెక్కాడు.
5 షిమ్యోను, లేవీ అన్నదమ్ములే.
వారి ఖడ్గాలు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
6 నా ప్రాణమా, వారి కుట్రలో చేరకు.
నా హృదయమా, వారి సభలో చేరకు.
ఎందుకంటే వారు కోపపడి మనుషులను చంపారు.
వినోదంగా ఎడ్ల గుదికాళ్ళ నరం తెగగొట్టారు.
7  వారి కోపం తీవ్రంగా ఉంది.
వారి ఆగ్రహం క్రూరంగా ఉంది.
అవి శాపగ్రస్తమైనవి.
నేను వారిని యాకోబుప్రజలలో చెదరగొడతాను.
ఇస్రాయేల్‌లో పటాపంచలయ్యేలా చేస్తాను.
8 యూదా, నీ అన్నదమ్ములు నిన్ను స్తుతిస్తారు.
నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉంటుంది.
నీ తండ్రి కొడుకులు నీ ఎదుట సాగిలపడతారు.
9 యూదా సింహం పిల్లలాంటివాడు.
నీవు చీల్చినదాని దగ్గరనుంచి వచ్చావు.
సింహంలాగా, ఆడ సింహంలాగా
పొంచివుంటాడు.
పడుకొని, తల ఎత్తుతాడు;
అతణ్ణి రేపడానికి తెగించేవాడెవడు?
10 ‘షిలోహు’ వచ్చేవరకు యూదా దగ్గరనుంచి
రాజదండం పోదు.
ఆయన పాదాల మధ్యనుంచి అధికార
దండం పోదు.
ఆయనకు ప్రజలు విధేయులవుతారు.
11 ద్రాక్ష చెట్టుకు తన గాడిదను కడతాడు,
మేలిరకమైన ద్రాక్షచెట్టుకు తన గాడిద
పిల్లను కడతాడు.
ద్రాక్షరసంలో తన బట్టలనూ,
ద్రాక్షల రసంతో తన దుస్తులనూ ఉతుకుతాడు.
12 ద్రాక్షరసంకంటే అతని కళ్ళు గాఢమైన
రంగు గలవి.
పాలకంటే అతని పళ్ళు తెల్లనివి.
13 జెబూలూను సముద్రతీరం వైపు
కాపురముంటాడు.
అతని ప్రాంతం ఓడలకు రేవుగా ఉంటుంది.
అతని సరిహద్దు సీదోను వైపుకు ఉంటుంది.
14 ఇశ్శాకారు రెండు పశువుల
దొడ్లమధ్య పడుకొని ఉండే బలమైన
గార్దభంవంటివాడు,
15 విశ్రాంతి స్థలం మంచిదనీ, తన ప్రదేశం
రమ్యమైనదనీ అతనికి తోస్తుంది,
గనుక అతడు బరువులు మోయడానికి
తన భుజం వంచుతాడు,
చాకిరి చేసే దాసుడవుతాడు.
16 దాను ఇస్రాయేల్ గోత్రాల్లో ఒక
గోత్రంగా ఉండి, తన ప్రజలకు
తీర్పు చెప్తాడు.
17 దాను త్రోవలో పాములాగా,
దారిలో గుర్రం గుదికాలును కరచి రౌతు
పడేలా చేసే కట్లపాములాగా ఉంటాడు.
18 యెహోవా, నీవు ప్రసాదించే రక్షణకోసం
ఎదురు చూస్తున్నాను.
19 గాదు విషయమేమంటే, దోపిడిగాళ్ళు
అతని పైబడతారు.
అతడు వెనుకనుంచి వాళ్ళ పైబడతాడు.
20 ఆషేరు సంగతంటారా?
అతని భోజన పదార్థాలూ శ్రేష్ఠమైనవి.
రాజులకు తగ్గ భక్ష్యాలు అతని
దగ్గర దొరుకుతాయి.
21 నఫ్తాలి విడుదల పొందిన
లేడిలాగా ఉన్నాడు.
మధుర వాక్కులు పలుకుతాడు.
22 యోసేపు ఫలవంతమైన కొమ్మలాంటివాడు.
ఊటదగ్గర ఉండి, దాని రెమ్మలు
గోడమీద నుంచి వ్యాపించే ఫలవంతమైన
కొమ్మవంటివాడు.
23 విలుకాళ్ళు అతణ్ణి హింసించారు.
బాణాలు వేశారు. అతణ్ణి ద్వేషించారు.
24 అయితే అతని విల్లు స్థిరంగా ఉంది.
అతని చేతులు బలంగా ఉన్నాయి.
ఇది యాకోబుయొక్క పరాక్రమశాలి అయిన
దేవుని హస్తాలవల్ల అయింది.
ఇస్రాయేల్ యొక్క ‘ఆధారశిల’, ‘కాపరి’
అనే వాని పేరట అది అయింది.
25 నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవునివల్ల,
నిన్ను దీవించే అమిత శక్తిగల
దేవుని వల్ల అది అయింది.
ఆయన నీకు పరంనుంచి వచ్చే ఆశీస్సులను,
కింద దాగివున్న జలగాధ ఆశీస్సులను స్తనాల,
గర్భాల ఆశీస్సులనూ అనుగ్రహిస్తాడు.
26 నీ తండ్రి పొందిన ఆశీస్సులు నిత్యమైన
పర్వతాలంత ఎత్తుగా ఉన్నాయి.
అవి నా పూర్వీకుల ఆశీస్సులకంటే గొప్పవి.
ఈ ఆశీస్సులు యోసేపు తలమీద,
అతని అన్నదమ్ముల్లో ప్రత్యేకమైన
అతని నడినెత్తిమీద ఉంటాయి.
27 బెన్యామీను చీల్చే తోడేలులాంటివాడు.
ఉదయం చంపినదాన్ని తింటాడు.
సాయంకాలం దోపిడీ పంచి ఇస్తాడు.”
28 ఇవన్నీ ఇస్రాయేల్ పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన వారికి తగినదే.
29 తరువాత అతడు వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను నా పూర్వీకుల దగ్గరికి పోతున్నాను. నన్ను నా పూర్వీకులదగ్గర పాతిపెట్టాలి. హిత్తివాడైన ఎఫ్రోను భూమిలోని గుహలో నన్ను పాతిపెట్టాలి. 30 ఆ గుహ కనానుదేశంలోని మమ్రే ఎదుట ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దాన్నీ, ఆ మైదానాన్నీ హిత్తివాడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమికోసం కొనుకొన్నాడు. 31 అక్కడే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకునూ అతని భార్య రిబ్కానూ పాతిపెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను. 32 హేతుజాతివాళ్ళ దగ్గర కొనుక్కొన్న ఆ మైదానాన్నీ అందులోని గుహనూ నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను.”
33 యాకోబు తన కొడుకులకు ఇలా ఆజ్ఞాపించడం చాలించి, మంచంమీదికి తన కాళ్ళు ముడుచుకొని, ప్రాణం విడిచి, తనవారి దగ్గరికి చేరాడు.