48
1 ఆ తరువాత యోసేపుకు “మీ తండ్రిగారు అనారోగ్యంగా ఉన్నార”ని కబురు వచ్చింది. కనుక యోసేపు తన ఇద్దరు కొడుకులైన మనష్షేనూ ఎఫ్రాయిం✽నూ వెంటబెట్టుకొని బయలుదేరాడు. 2 ఎవరో ఒకరు యాకోబుతో “ఇదిగో మీ కొడుకు యోసేపు మీ దగ్గరికి వస్తున్నాడు” అన్నారు. అప్పుడు ఇస్రాయేల్ బలం పుంజుకొని పడకమీద కూర్చున్నాడు.3 యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు: “అమిత శక్తిగల దేవుడు✽ కనానుదేశంలో ఉన్న లూజు✽లో నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి నాతో చెప్పినదేమిటంటే 4 ✽‘నిన్ను ఫలవంతంగా చేసి నీ సంతానాన్ని అధికం చేస్తాను. నీవు జనాల సమూహమయ్యేలా చేస్తాను. నీ తరువాత నీ సంతానానికి ఈ దేశాన్ని ఎప్పటికీ సొత్తుగా ఇస్తాను.’ 5 ✽ ఇప్పుడు విను. నేను ఈజిప్ట్ దేశానికి వచ్చేముందు ఈజిప్ట్‌లో నీకు పుట్టిన ఇద్దరు కొడుకులు నా సంతానమే. రూబేను, షిమ్యోనులాగే ఎఫ్రాయిం, మనష్షే నా కొడుకులే. 6 వారి తరువాత నీకు పుట్టే సంతానం నీదే. అయితే వారి వారసత్వం వారి అన్నల పేర వ్రాసి ఉంటుంది.
7 “నేను పద్దన్‌అరాం నుంచి వచ్చినప్పుడు ప్రయాణంలోనే కనానుదేశంలో ఎఫ్రాతాకు ఇంకా కాస్త దూరాన ఉన్నప్పుడు రాహేలు చనిపోయి నన్ను దుఃఖాక్రాంతుణ్ణి చేసింది. ఎఫ్రాతాకు వెళ్ళే తోవలో ఆమెను పాతిపెట్టాను. ఎఫ్రాతా అంటే బేత్లెహేం.”
8 యోసేపు కొడుకులను ఇస్రాయేల్ చూచి “వీరెవరు?” అని అడిగాడు. 9 అందుకు యోసేపు “దేవుడు ఈ దేశంలో నాకు ప్రసాదించిన కొడుకులు వీరు” అన్నాడు. అతడు “వారిని దగ్గరికి తీసుకువస్తే నేను వారిని దీవిస్తాను✽” అన్నాడు.
10 ఇస్రాయేల్ వృద్ధాప్యం వల్ల చూడలేనంత మందదృష్టి గలవాడు. యోసేపు అతనిదగ్గరికి వారిని తీసుకువచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకొని కావలించుకొన్నాడు.
11 ఇస్రాయేల్ యోసేపుతో, “నీ ముఖాన్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. అయితే నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు.
12 అప్పుడు యోసేపు వారిని అతని మోకాళ్ళ మధ్య నుంచి తీసుకొని, సాగిలపడ్డాడు. 13 తరువాత ఇస్రాయేల్ యొక్క ఎడమ చేతివైపుకు యోసేపు తన కుడిచేత ఎఫ్రాయింనూ, ఇస్రాయేల్ కుడి చేతివైపుకు తన ఎడమచేత మనష్షేనూ తీసుకొని ఇద్దరినీ అతని దగ్గరికి జరిపాడు. 14 ✽మనష్షే పెద్దవాడయినప్పటికీ ఇస్రాయేల్ తన కుడి చెయ్యి చాపి, కనిష్ఠుడు ఎఫ్రాయిం తలమీదా, తన ఎడమ చెయ్యి మనష్షే తలమీదా ఉంచాడు. అతడిలా బుద్ధిపూర్వకంగానే చేశాడు.
15 అతడు యోసేపును దీవిస్తూ ఇలా అన్నాడు:
“నా పూర్వీకులు అబ్రాహామూ ఇస్సాకూ
ఏ దేవుని సముఖంలో నడుచుకున్నారో
ఆ దేవుడు నా జన్మదినం నుంచి
ఈ రోజువరకు నేను బతికిన రోజులన్నిట్లో
నాకు కాపరిగా✽ ఉన్నాడు.
16 ఆయన దూత✽ అన్ని కీడు✽లనుంచి
నన్ను విడిపించాడు.
ఆయన ఈ అబ్బాయిలను దీవిస్తాడు గాక!
నా పేరు ప్రతిష్ఠలు, నా పూర్వీకులు
అబ్రాహాము ఇస్సాకుల పేరు ప్రతిష్ఠలు
వారికి ఉంటాయి గాక.
లోకంలో వారు పెద్ద జనసమూహంగా
అవుతారు గాక.”
17 యోసేపు తన తండ్రి అతని కుడి చెయ్యి ఎఫ్రాయిం తలమీద ఉంచడం చూశాడు. అది అతనికి అయిష్టంగా ఉంది. తన తండ్రి చెయ్యి మనష్షే తలమీద పెట్టించాలని దాన్ని ఎఫ్రాయిం తలమీదనుంచి ఎత్తి ఇలా అన్నాడు:
18 “అలా కాదు, నాన్నగారూ! పెద్దవాడు ఇతడే; ఇతడి తలమీదే నీ కుడిచెయ్యి ఉంచు.”
19 అతని తండ్రి ఒప్పుకోలేదు. “నాకు తెలుసు, బాబూ, నాకు తెలుసు. ఇతడు కూడా గొప్పవాడై ఒక జనం అవుతాడు. అయితే ఇతడి తమ్ముడు ఇతడి కంటే గొప్పవాడవుతాడు. అతడి సంతానం జనాల సమూహాలు అవుతారు” అన్నాడు.
20 ఆరోజు అతడు వారిని దీవిస్తూ “ఇస్రాయేల్ ప్రజలు ఆశీర్వచనం పలికేటప్పుడు వారు మీ పేరెత్తి ‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయింలాగా మనష్షే✽ లాగా చేస్తాడు గాక’ అని దీవిస్తారు” అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయింను ముందుగా ఉంచాడు.
21 ఇస్రాయేల్ యోసేపుతో “చూడు, నేను చనిపోతున్నాను. అయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. 22 ✽నేను నా కత్తితోనూ, నా వింటితోను అమోరీవాళ్ళ చేతిలో నుంచి తీసుకున్నదాంట్లో నీ అన్నదమ్ములకు ఇచ్చేకంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను.”