47
1 యోసేపు వెళ్ళి ఫరోతో “నా తండ్రి, నా అన్నదమ్ములు వారి మందలతోను, పశువులతోను, వారికున్న దానంతటితోనూ కనానుదేశంనుంచి వచ్చారు. ఇప్పుడు వారు గోషెన్ ప్రదేశంలో ఉన్నారు” అన్నాడు.
2 అంతకుముందు యోసేపు తన అన్నదమ్ముల్లో అయిదుగురిని తీసుకువచ్చాడు; ఇప్పుడు వారిని ఫరో ఎదుట పెట్టాడు. 3 చక్రవర్తి అతని అన్నదమ్ములను “మీదే వృత్తి?” అని అడిగాడు. వారు ఫరోతో, “మీ దాసులైన మేము గొర్రెల కాపరులం. మా పూర్వీకులు కూడా కాపరులు” అన్నారు. 4 వారు ఫరోతో ఇంకా అన్నారు, “మేము ఈ దేశంలో కొంత కాలం ఉండడానికి వచ్చాం. కనానుదేశంలో కరవు తీవ్రంగా ఉంది గనుక అక్కడ మీ దాసులైన మా మందలకు మేత లేదు. దయ చేసి మీ దాసులైన మమ్మల్ని గోషెన్ ప్రదేశంలో కాపురముండడానికి సెలవు ఇప్పించండి.”
5 యోసేపుతో ఫరో “నీ తండ్రీ, అన్నదమ్ములూ నీ దగ్గరికి వచ్చారు. 6 ఈజిప్ట్‌దేశం నీ ఎదుట ఉంది. ఈజిప్ట్‌లోని అన్ని ప్రదేశాల్లో మంచిదానిలో నీ తండ్రినీ అన్నదమ్ములనూ నివసించేలా చెయ్యి. వారు గోషెన్‌లో కాపురం చేయవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు తోస్తే వారిని నా మందలకు ముఖ్యమైన కాపరులుగా చెయ్యి.”
7 తరువాత యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకువచ్చి ఫరో ఎదుట పెట్టాడు. యాకోబు ఫరోను దీవించాడు. 8 చక్రవర్తి “మీ వయసెంత?” అని యాకోబు నడిగితే, యాకోబు ఫరోతో, 9 “నా జీవితయాత్ర నూట ముప్ఫయి సంవత్సరాలు. నేను బ్రతికిన రోజులు కొద్దే; అవి దౌర్భాగ్యమైనవి. అవి నా పూర్వీకుల జీవితయాత్రల్లోని సంవత్సరాలన్ని కాలేదు” అన్నాడు. 10 యాకోబు ఫరోను దీవించి అతడి సముఖంనుంచి బయటికి వెళ్ళాడు.
11 ఫరో ఆజ్ఞ ఇచ్చినట్టే యోసేపు తన తండ్రికీ, అన్నదమ్ములకూ ఈజిప్ట్ దేశం అంతటా మంచి ప్రదేశంలో, అంటే రామెసేసు ప్రదేశంలో, భూమి ఇచ్చి నివాసస్థలం ఏర్పరచాడు. 12 పైగా, యోసేపు తన తండ్రినీ తన అన్నదమ్ములనూ తన తండ్రి కుటుంబంవారందరినీ పోషిస్తూ, వారి వారి పిల్లల లెక్క ప్రకారం వారికి భోజన పదార్థాలిస్తూ వచ్చాడు.
13 ఆ కరవు చాలా తీవ్రంగా ఉండడంచేత ఆ దేశంలో ఆహారం ఎక్కడా లేకపోయింది. కరవువల్ల ఈజిప్ట్‌దేశమూ కనానుదేశమూ దుర్భలమైన స్థితికి వచ్చాయి. 14 ధాన్యం కోసం ప్రజలు డబ్బు తెస్తూ వచ్చారు. ఇలా యోసేపు ఈజిప్ట్ దేశంలోనూ కనానుదేశంలోనూ దొరికే డబ్బంతా పోగుచేసి, దాన్ని చక్రవర్తి భవనంలోకి తెప్పించాడు. 15 ఈజిప్ట్ దేశంలోనూ కనానుదేశంలోనూ ఉన్న డబ్బంతా ఖర్చు చేశాక ఈజిప్ట్‌వాళ్ళంతా యోసేపు వద్దకు వచ్చి “మాకు ఆహారం ఇప్పించండి. మీ ఎదుట మేమెందుకు చనిపోవాలి. మా డబ్బంతా అయిపోయింది” అన్నారు.
16 “సరే, మీ డబ్బంతా అయిపోయిందంటే మీ పశువుల్ని ఇవ్వండి. మీ పశువులకు బదులుగా ధాన్యమిస్తాను” అన్నాడు యోసేపు.
17 కనుక వాళ్ళు తమ పశువులను యోసేపు దగ్గరకు తెచ్చారు. యోసేపు వాళ్ళ గుర్రాలనూ గొర్రెల మందలనూ పశువుల మందలనూ గాడిదలనూ తీసుకొని వాళ్ళకు భోజన పదార్థాలిచ్చాడు. ఆ సంవత్సరం వాళ్ళ మందలన్నిటికీ బదులుగా అతడు ధాన్యమిచ్చి వాళ్ళను పోషించాడు.
18 ఆ సంవత్సరం గడిచాక మరుసటి ఏట వాళ్ళు అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ నుంచి దాచలేము. మా పశువుల మందలన్నీ కూడా మా యజమానులైన మీవి అయ్యాయి. మా యజమానులైన మీ ఎదుట మిగిలినది మా శరీరాలూ మా భూములూ మాత్రమే. 19 మీ కళ్ళెదుట మా భూములూ మేమూ ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ, మా భూముల్నీ కొనండి. మా భూములతోపాటు మేము చక్రవర్తికి దాసులమవుతాం. మేము బ్రతికేట్టు మాకు విత్తనాలివ్వండి. అప్పుడు మేము చావము, ఈ దేశం పాడైపోదు.”
20 ఈ విధంగా యోసేపు ఈజిప్ట్ భూములన్నిటినీ చక్రవర్తి కోసం కొన్నాడు. ఆ కరవు ఈజిప్ట్ వాళ్ళకు తీవ్రంగా ఉండడంవల్ల ప్రతి ఒక్కడూ తన పొలం అమ్మాడు. ఇలా ఆ భూమి అంతా చక్రవర్తిది అయిపోయింది. 21 తరువాత యోసేపు ఈజిప్ట్‌లో ఆ కొననుంచి ఈ కొనవరకు ఉన్న ప్రజలందరినీ ఊళ్ళలోకి రప్పించాడు. 22 యాజుల భూములను మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే, యాజులకు చక్రవర్తి బత్తెం నియమించాడు. వాళ్ళు తమకు ఫరో ఇచ్చిన ఆహారం తినేవాళ్ళు గనుక తమ భూములను అమ్మలేదు.
23 యోసేపు ప్రజలతో అన్నాడు, “చూడండి, ఈ రోజు మిమ్మల్నీ మీ భూములనూ చక్రవర్తి కోసం కొన్నాను. ఇదిగో, మీకు విత్తనాలు. పొలాల్లో విత్తండి. 24 పంటలో అయిదో భాగం మీరు చక్రవర్తికివ్వాలి. నాలుగు భాగాలు మీవి అవుతాయి. అవి పొలాల్లో మళ్ళీ విత్తడం కోసం, మీకూ, మీ పిల్లలకూ మీ కుటుంబంవారికీ ఆహారం కోసం ఉంటాయి.”
25 వాళ్ళు “మీవల్లే మా ప్రాణాలు దక్కాయి. మా యజమానులైన మీరు మమ్మల్ని దయ చూస్తే మేము చక్రవర్తికి దాసులమవుతాం” అన్నారు.
26 అయిదో భాగం చక్రవర్తిది అని యోసేపు ఈజిప్ట్ దేశానికి చట్టం నియమించాడు. అది నేటివరకు నిలిచి ఉన్నది. యాజుల భూములు మాత్రమే చక్రవర్తివి కాలేదు.
27 ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌లో గోషెన్ ప్రదేశంలో నివసించారు. అందులో వారికి ఆస్తి లభించింది. అనేక మంది పిల్లలు పుట్టారు. వారి సంఖ్య చాలా ఎక్కువయింది. 28 యాకోబు ఈజిప్ట్‌లో నివసించినది పదిహేడేళ్ళు. యాకోబు జీవించిన కాలం నూట నలభై ఏడు సంవత్సరాలు. 29 ఇస్రాయేల్ అవసాన కాలం దగ్గరపడగా అతడు తన కొడుకు యోసేపును పిలిపించి, “నీవు నన్ను అభిమానంతో చూస్తుంటే నా పట్ల నిజమైన దయతో వ్యవహరిస్తావని నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి శపథం చెయ్యి – నన్ను ఈజిప్ట్‌లో పాతిపెట్టకు. 30 నా పితరుల దగ్గర నా శరీరం ఉండేలా నన్ను ఈజిప్ట్ నుంచి తీసుకువెళ్ళి, వారి శ్మశాన భూమిలో పాతిపెట్టు” అన్నాడు.
31 యోసేపు “సరే, నీవు చెప్పినట్టే చేస్తాను” అన్నాడు. యాకోబు “నాకు శపథం చెయ్యి” అన్నాడు. అతడు శపథం చేశాడు. అప్పుడు ఇస్రాయేల్ తన పడకమీద పడుకొని దేవుణ్ణి ఆరాధించాడు.