46
1 ✽అప్పుడు ఇస్రాయేల్ తనకున్నదంతా తీసుకొని ప్రయాణమై బేర్‌షెబాకు చేరుకొన్నాడు. అక్కడ తన తండ్రి ఇస్సాకు యొక్క దేవునికి బలులు సమర్పించాడు. 2 దేవుడు రాత్రిపూట దర్శనం✽లో ఇస్రాయేల్‌తో “యాకోబూ! యాకోబూ!✽” అని పిలిచాడు. అతడు “చిత్తగించు, ప్రభూ” అన్నాడు.3 ఆయన అన్నాడు “నేను నీ దేవుణ్ణి. నీ తండ్రి యొక్క దేవుణ్ణి. నేను నిన్ను ఈజిప్ట్‌లో గొప్ప జనం✽గా చేస్తాను, గనుక అక్కడికి వెళ్ళడానికి భయపడకు. 4 నీతోకూడా✽ నేను ఈజిప్ట్‌కు వస్తాను. నిన్ను ఇక్కడికి తప్పకుండా తిరిగి తీసుకువస్తాను. యోసేపు సమక్షంలో నీవు చనిపోతావు.”
5 ✽యాకోబు బేర్‌షెబా నుంచి తరలివెళ్ళాడు. ఇస్రాయేల్ కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ చిన్నవాళ్ళనూ తమ భార్యలనూ, వారిని తీసుకురావడానికి చక్రవర్తి పంపించిన పెద్ద బండ్ల మీద ఎక్కించారు. 6 వారు కనానుదేశంలో తాము సంపాదించిన పశువులనూ సర్వసంపదలనూ తీసుకొని ఈజిప్ట్‌కు వచ్చారు. యాకోబు, తనతోపాటు అతని సంతతివారంతా వచ్చారు. 7 అతడు తన కొడుకులనూ తన మనుమలనూ తన కూతుళ్ళనూ తన మనుమరాండ్రనూ – తన సంతానాన్నంతా – ఈజిప్ట్‌కు తీసుకువచ్చాడు.
8 ఈజిప్ట్‌కు వచ్చిన ఇస్రాయేల్‌వారి పేర్లు – యాకోబు, అతడి కొడుకుల పేర్లు ఇవే: 9 మొదట పుట్టినవాడు రూబేను. రూబేను కొడుకుల పేర్లు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. 10 షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు (షావూలు ఒక కనాను స్త్రీ కన్న కొడుకు). 11 లేవీ కొడుకులు గెర్షోను, కహాతు, మెరారి. 12 యూదా కొడుకులు ఏర్, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. ఏర్, ఓనాను✽ కనానుదేశంలో చనిపోయారు. పెరెసు కొడుకులు హెస్రోను, హామూల్. 13 ఇశ్శాకారు కొడుకులు తోలా, పువ్యా, యొబు, షిమ్యోను. 14 జెబూలూను కొడుకులుసెరెదు, ఏలోను, యాహలేలు. 15 వీరు పద్దన్ అరాం✽లో యాకోబుకు లేయా కన్నకొడుకులు. ఆమె అతని కూతురు దీనాను కూడా కన్నది. అతని కొడుకులూ కూతుళ్ళూ అందరూ ముప్ఫయి ముగ్గురు.
16 గాదు కొడుకులు సిప్యోను, హగ్గి, షూని, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ. 17 ఆషేరు కొడుకులు ఇన్నూ, ఇష్వా, ఇష్వి, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేల్. 18 వీరు యాకోబుకు జిల్ఫా కన్నవారు. జిల్పా లాబాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చిన ఆమె. ఆమెవల్ల ఈ పదహారుమంది యాకోబుకు కలిగిన సంతానం. 19 యాకోబు భార్య రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను. 20 ఈజిప్ట్‌దేశంలో యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిం జన్మించారు. ఓను అనే పట్టణానికి యాజిగా ఉన్న పోతీఫెర కూతురు ఆసెనతు వారిని యోసేపుకు కన్నది. 21 బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేల్, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీం, హుప్పీం, ఆర్దు. 22 యాకోబుకు రాహేలు కన్న సంతతివారైన వీరంతా పద్నాలుగుమంది. 23 దాను కొడుకు హుషీం. 24 నఫ్తాలి కొడుకులు యహసేల్, గూనీ, యేసెరు, షిల్లేం. 25 వీరు బిల్హా యాకోబుకు కన్న సంతానం. వారు ఏడుగురు. బిల్హా, లాబాను తన కూతురు రాహేలుకు దాసిగా ఇచ్చిన ఆమె. 26 ✽యాకోబు కోడళ్ళుగాక, యాకోబు సంతతివారై అతనితోపాటు ఈజిప్ట్‌కు వచ్చినవారంతా అరవై ఆరుగురు. 27 ఈజిప్ట్‌లో యోసేపుకు జన్మించిన కొడుకులు ఇద్దరు. ఈజిప్ట్‌కు వచ్చిన యాకోబు కుటుంబం వారంతా డెబ్భైమంది.
28 యాకోబు తనకు గోషెన్‌కు త్రోవ చూపడానికి యూదాను తనకు ముందుగా యోసేపు దగ్గరికి పంపాడు. ఈ విధంగా వారు గోషెన్ ప్రదేశం చేరుకొన్నారు. 29 యోసేపు తన రథం సిద్ధం చేయించుకొని తన తండ్రి ఇస్రాయేల్‌ను కలుసుకోవడానికి గోషెన్‌కు వచ్చాడు. అతణ్ణి చూడడంతోనే అతణ్ణి కావలించుకొని అలాగే చాలా సేపు ఏడ్చాడు✽.
30 అప్పుడు ఇస్రాయేల్ యోసేపుతో “నీవు ఇంకా బ్రతికి ఉన్నావు. నీ ముఖం చూశాను. గనుక ఇప్పుడు చనిపోగలను” అన్నాడు. 31 ✽వారు పశువులు గలవారు, గొర్రెల కాపరులు. వారు తమ మందలనూ పశువులనూ తమకున్నదంతా తీసుకువచ్చారు గనుక యోసేపు తన అన్నదమ్ములనూ తన తండ్రి కుటుంబం వారినీ చూచి ఇలా అన్నాడు: “నేను ఫరో దగ్గరికి వెళ్ళి మీరు వచ్చిన సంగతి అతనికి తెలియజేసి, 32 ‘కనాను దేశంలో ఉండిన నా అన్నదమ్ములూ, నా తండ్రి కుటుంబాలవారూ నా దగ్గరికి వచ్చారు’ అంటాను. 33 తరువాత ఫరో మిమ్ములను పిలిపించి ‘మీదే వృత్తి?’ అని అడిగినప్పుడు 34 మీరిలా అనాలి: ‘మా పూర్వీకులు పశువుల కాపరులు. చిన్నప్పటినుంచి మీ దాసులమైన మేమూ కాపరులం.’ గొర్రెల కాపరులంటే ఈజిప్ట్‌వాళ్ళకు అసహ్యం గనుక మీరు గోషెన్‌లో కాపురం చేసేలా అలా చెప్పాలి.”