45
1 యోసేపు తన పరివారం ఎదుట తనను ఇంకా తమాయించుకోలేక వారితో “మీరంతా నా దగ్గరనుంచి వెళ్ళిపోవాలి” అని గట్టిగా చెప్పాడు. యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసు కొన్నప్పుడు ఇంకెవరూ లేరు. 2 అయితే అతడు బిగ్గరగా ఏడ్చాడు, గనుక ఈజిప్ట్‌వాళ్ళకూ చక్రవర్తి ఇంటివాళ్ళకూ అది వినిపించింది.
3 యోసేపు తన అన్నదమ్ములతో “నేను యోసేపును. మన తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. అయితే అతని సమక్షంలో అతని అన్నదమ్ములు కంగారుపడి నోట మాట రాక ఏ జవాబూ చెప్పలేకపొయ్యారు. 4 అప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో “దగ్గరికి రండి” అన్నాడు. వారు దగ్గరికి వచ్చాక అతడు, “ఈజిప్ట్ దేశానికి వెళ్ళేట్టు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. మీ తోడబుట్టినవాణ్ణి. 5 ఇక్కడికి చేరేలా మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, మిమ్మల్ని నిందించుకోకండి. ఎందుకంటారా? దేవుడు అనేకమంది ప్రాణాలు దక్కించడానికి నన్ను మీకు ముందుగా పంపించాడు.
6 “రెండేళ్ళనుంచి కరువు ఈ దేశంలో ఉంది. ఈ వచ్చే అయిదేళ్ళలో కూడా భూమి దున్నడం, కోత కోయడం ఉండవు. 7 అయితే లోకంలో మీ సంతానం నిలిచివుండేలా చేయడానికీ, మిమ్మల్ని ఆశ్చర్యంగా అపాయం నుంచి కాపాడడానికి దేవుడు నన్ను మీకు ముందుగా పంపించాడు. 8 కనుక నన్ను ఇక్కడికి పంపించినది మీరు కాదు గానీ దేవుడే. అంతేగాక ఆయన నన్ను ఫరోకు ప్రధానమంత్రిగానూ, అతని భవనంలో అన్ని విషయాలకూ యజమానిగానూ ఈజిప్ట్ దేశం అంతటిమీద పరిపాలకుడిగానూ చేశాడు. 9 ఇప్పుడు మీరు మన నాన్నగారి దగ్గరికి త్వరగా వెళ్ళి ఆయనతో ఇలా చెప్పండి: ‘నీ కొడుకు యోసేపు చెప్పేదేమిటంటే, దేవుడు నన్ను ఈజిప్ట్ దేశం అంతటి మీద అధిపతిగా చేశాడు. నా దగ్గరకు రండి. ఆలస్యం చేయకండి. 10 నువ్వు గోషెన్ ప్రదేశంలో కాపురం చేస్తూ నా దగ్గర ఉంటావు. నీవూ నీ సంతానమూ నీ మనుమలూ నీ గొర్రెల, మేకల, పశువుల మందలూ నీ ఆస్తిపాస్తులన్నీ గోషెన్‌లో ఉంచుకోవచ్చు. 11 నీకు ఉన్నదానంతటికీ, నీకూ, నీ ఇంటివారికీ పేదరికం రాకుండా నిన్ను ఈ స్థలంలో పోషిస్తాను. ఈ కరవు ఇంకా అయిదేళ్ళు ఉంటుంది’ అని మన నాన్న గారితో చెప్పండి.
12 “ఇదిగో మీతో మాట్టాడుతున్నది నేనే అని మీరూ నా తమ్ముడు బెన్యామీనూ కండ్లారా చూస్తున్నారు గదా! 13 ఈజిప్ట్‌లో నాకున్న వైభవాన్నీ, మీరు చూచిన సర్వాన్నీ మన నాన్నగారికి తెలియజేయండి. ఆయనను త్వరలో ఇక్కడికి తీసుకురండి.”
14 అప్పుడతడు తన తమ్ముడు బెన్యామీన్ను కావలించుకొని కన్నీళ్ళు విడిచాడు. బెన్యామీను అతని మెడమీద పడి కన్నీళ్ళు విడిచాడు. 15 యోసేపు తన అన్నలందరినీ ముద్దు పెట్టుకొని, కావలించుకొని కన్నీళ్ళు విడిచాడు. ఆ తరువాత అతని అన్నదమ్ములు అతనితో మాట్లాడారు. 16 యోసేపు అన్నదమ్ములు వచ్చిన సంగతి చక్రవర్తి భవనంలో వినిపించింది. వారు రావడం ఫరోకూ అతని పరివారానికీ నచ్చింది.
17 యోసేపుతో ఫరో “నీ అన్నదమ్ములతో ఇలా చెప్పు – ‘మీరు చేయవలసినదేమంటే, మీ గాడిదలమీద సామాను కట్టి కనానుదేశానికి వెళ్ళి, 18 మీ తండ్రినీ మీ ఇంటివాళ్ళనూ వెంటబెట్టుకొని నా దగ్గరికి రావాలి. ఈజిప్ట్ దేశంలోని విలువైనవాటిని మీకిస్తాను. మీరు ఈ భూసారాన్ని అనుభవిస్తారు’. 19 నీవు వాళ్ళతో ఇంకా ఇలా చెప్పాలి: మీ పిల్లలకోసం మీ భార్యలకోసం ఈజిప్ట్ నుంచి పెద్ద పెద్ద బండ్లను తీసుకుపోయి, మీ తండ్రిని వెంటబెట్టుకురండి. 20 ఈజిప్ట్‌దేశంలో ఉన్న విలువైనవి మీవే అవుతాయి, గనుక విడవవలసిన ఆస్తి విషయంలో చింతపడకండి.”
21 ఇస్రాయేల్ కొడుకులు అలాగే చేశారు. ఫరో మాట ప్రకారం యోసేపు వారికి పెద్ద పెద్ద బండ్లనూ, ప్రయాణానికి భోజన పదార్థాలనూ ఇప్పించాడు. 22 వారిలో ఒక్కొక్కరికి దుస్తులు ఇచ్చాడు. గాని, బెన్యామీనుకు మూడు వందల వెండి నాణేలూ, అయిదంతలుగా దుస్తులిచ్చాడు. 23 అతడు తన తండ్రి దగ్గరికి కూడా వస్తువులు పంపించాడు. ఈజిప్ట్‌లో ఉన్న శ్రేష్ఠమైనవాటిని మోస్తున్న పది గాడిదలనూ, ప్రయాణానికి తన తండ్రికోసం ధాన్యం, భోజన పదార్థాలు, వేరు వేరు తినుబండారాలు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు. 24 అతడు తన అన్నదమ్ములను సాగనంపాడు. వారు బయలుదేరుతుండగా అతడు “ప్రయాణంలో మీరు వివాదాలు పెట్టుకోకండి సుమా” అన్నాడు.
25 వారు ఈజిప్ట్ నుండి తరలివెళ్ళి కనానుదేశానికి, తమ తండ్రి యాకోబు దగ్గరికి చేరుకున్నారు.
26 “యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఈజిప్ట్ దేశం అంతటిమీదా పరిపాలకుడుగా ఉన్నాడు” అంటూ అతనికి తెలియజేశారు. యాకోబు వారి మాట నమ్మలేక స్తంభించిపొయ్యాడు. 27 అయితే తమతో యోసేపు చెప్పిన మాటలన్నీ వారతనికి తెలిపారు. అతడు తనను తీసుకువెళ్ళడానికి యోసేపు పంపించిన ఆ పెద్ద బండ్లను చూచినప్పుడు వారి తండ్రి యాకోబుకు ప్రాణం లేచి వచ్చింది.
28 “ఇక చాలు. నా కొడుకు యోసేపు బ్రతికే ఉన్నాడు. నేను చనిపోవడానికి ముందు అతణ్ణి చూడడానికి వెళ్తాను” అన్నాడు ఇస్రాయేల్.