44
1 ✽ యోసేపు తన ఇంటి పనులు చూచుకొనే వాడికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: “ఆ మనుషుల సంచులనిండా భోజన పదార్థాలు పెట్టు. ఎవరి డబ్బు వారి సంచిలో పైన పెట్టాలి. 2 చిన్నవాడి సంచిలో పైన నా గిన్నెనూ – నా వెండి గిన్నెనూ – అతడి ధాన్యం డబ్బునూ పెట్టు.” అతడు యోసేపు చెప్పినట్టే చేశాడు.3 తెల్లవారగానే ఆ మనుషులను వారి గాడిదలతోపాటు పంపివేయడం జరిగింది. 4 వారు పట్టణం నుంచి తరలివెళ్ళి ఇంకా దరిదాపుల్లో ఉండగానే యోసేపు తన నిర్వాహకుడితో, “ఇప్పుడే ఆ మనుషుల వెంటపడి వెళ్ళు. వారిని కలుసుకొని వారితో ఇలా అను: మీరు ఉపకారానికి అపకారం ఎందుకు చేశారు? 5 ✽నా యజమాని పానం చేసే గిన్నె – శకునాలు చూచే ఆ గిన్నె – మీదగ్గర ఉంది గదా! మీరు చేసినది చెడ్డ పని.” 6 అతడు వారిని కలుసుకొని వారితో ఆ మాటలన్నాడు.
7 వారు అతణ్ణి చూచి “మా యజమాని ఇలా మాట్లాడడం ఎందుకు? మీ దాసులైన మేము ఆ విధంగా ఎన్నడూ చేయము. 8 చూడండి, మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు కనానుదేశం నుంచి మీదగ్గరికి తెచ్చాం గదా! అలాంటప్పుడు మీ యజమాని ఇంట్లో నుంచి వెండి, బంగారం దొంగిలిస్తామంటారా మరి? 9 అది మీ దాసులైన మాలో ఎవరి దగ్గరైనా దొరికితే అతడు చావాలి. మేము మా యజమానికి దాసులం అవుతాం” అన్నారు. 10 అందుకతడు “సరే, మీరు చెప్పినట్టే కానియ్యండి. అది ఎవరిదగ్గర దొరుకుతుందో అతడే నాకు దాసుడవుతాడు. మిగతావాళ్ళు నిర్దోషులు” అన్నాడు. 11 అప్పుడు వారు త్వరపడి ప్రతి ఒక్కడూ తన సంచిని క్రిందికి దించాడు; ప్రతి ఒక్కడూ తన సంచిని విప్పాడు. 12 అతడు పెద్దవాడి సంచితో ఆరంభించి చిన్నవాడి సంచి వరకూ వాటిని సోదా చేశాడు. బెన్యామీను సంచిలో ఆ గిన్నె దొరికింది. 13 ✽అప్పుడు వారంతా తమ బట్టలు చింపుకొన్నారు. ప్రతి ఒక్కడూ తన గాడిద మీద తన సంచిని ఎక్కించుకొని వారంతా పట్టణానికి తిరిగి వెళ్ళారు. 14 ✝యూదా, అతని అన్నదమ్ములు యోసేపు ఇంటికి చేరుకొన్నప్పుడు అతడింకా అక్కడే ఉన్నాడు. వారు అతని ఎదుట సాష్టాంగపడ్డారు. 15 వారిని చూచి యోసేపు అన్నాడు, “మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటివాడు శకునం✽ చూచి తెలుసుకోగలడని మీకు తెలియదా?”
16 యూదా, “మా యజమానులైన మీతో మేమేం చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? మీ దాసులైన మా అపరాధం✽ దేవుడే కనిపెట్టాడు. ఇదిగో, మేము మా యజమానులైన మీ దాసులం. మేమూ, ఆ గిన్నె ఎవరిదగ్గర దొరికిందో వాడూ మీ దాసుడూ” అన్నాడు.
17 అందుకతడు “నేను అలా ఏమాత్రం చేయను. ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికిందో వాడే నా దాసుడవుతాడు. మీరైతే మీ తండ్రి దగ్గరకు క్షేమంగా వెళ్ళండి” అన్నాడు.
18 అప్పుడు యూదా, దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: “ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనియ్యండి. మీ కోపాగ్ని మీ దాసుడైన నామీద రగులుకోనివ్వకండి. మీరు చక్రవర్తి అంతటివారే గదా! 19 నా యజమానులైన మీరు మీ దాసులైన మమ్మల్ని ప్రశ్నిస్తూ ‘మీకు తండ్రి ఉన్నాడా? తమ్ముడు ఉన్నాడా?’ అని అడిగారు. 20 మేము నా యజమానులైన మీతో ‘మాకు తండ్రి ఉన్నాడు. ఆయన వృద్ధుడు. ఆయనకు వృద్ధాప్యంలో జన్మించిన కొడుకు ఉన్నాడు. అతడి అన్న చనిపొయ్యాడు. అతడి తల్లికి అతడొక్కడే మిగిలాడు. అతడు తన తండ్రి ప్రేమ✽ చూరగొన్నవాడు’. 21 మీరు మీ దాసులైన మాతో అన్నారు గదా – ‘నేనతణ్ణి చూచేట్టు అతణ్ణి నా దగ్గరికి తీసుకురావాలి’ అని. 22 మేము నా యజమానులైన మీతో ‘ఆ అబ్బాయి తన తండ్రిని విడువలేడు. ఒకవేళ తండ్రిని విడిస్తే మా తండ్రి చనిపోతాడు’ అన్నాం. 23 మీరు మీ దాసులైన మాతో ‘మీ తమ్ముడు మీతో కూడా రాకపోతే మీరు నా ముఖాన్ని ఇక చూడరు’ అన్నారు. 24 మేము మీ దాసుడైన మా తండ్రి దగ్గరికి చేరుకొన్నాక మా యజమానులైన మీ మాటలు ఆయనకు చెప్పాం. 25 తరువాత మా తండ్రి ‘మళ్ళీ వెళ్ళి, మనకోసం కొంత భోజన పదార్థాలను కొనుక్కు రండి’ అన్నాడు. 26 అందుకు మేము అన్నాం గదా – ‘మేము వెళ్ళలేము. మా తమ్ముడు మాతోకూడా వస్తేనే వెళ్తాం. ఎందుకంటే, మా తమ్ముడు మాతో ఉంటేనే తప్ప ఆ మనిషి ముఖాన్ని చూడడానికి అవకాశం ఉండదు’. 27 అప్పుడు మీ దాసుడైన మా తండ్రి మాతో మాట్లాడుతూ ‘నా భార్య✽ నాకు ఇద్దరు కొడుకులను కన్నదని మీకు తెలుసు. 28 వారిలో ఒకడు నా దగ్గరనుంచి వెళ్ళిపోయాడు. అతణ్ణి దుష్టమృగాలు తప్పక చీల్చివేసి ఉంటాయి. అప్పటినుంచి అతడు నాకు కనిపించలేదు. 29 ఈ అబ్బాయిని కూడా మీరు తీసుకుపోతే, ఒకవేళ అతనికీ హాని కలిగితే, నెరసిన వెండ్రుకలు గల నన్ను చింతాక్రాంతుణ్ణి చేసి మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు’ అన్నాడు.
30 “కనుక మీ దాసుడైన మా తండ్రి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి మాతోపాటు లేకపోతే, అది చూచి ఆయన చనిపోతాడు. ఈ అబ్బాయంటే మా తండ్రికి ప్రాణం గదా! 31 అలా మీ దాసులైన మేము నెరసిన వెండ్రుకలు గల మీ దాసుడైన మా తండ్రిని చింతాక్రాంతుణ్ణి చేసి మృత్యు లోకంలోకి దిగిపోయేలా చేస్తాం. 32 మీ దాసుడైన నేను ఈ అబ్బాయి విషయంలో మా తండ్రికి జామీను ఉన్నాను. నేను ఆయనతో ‘నీ దగ్గరికి అతణ్ణి తిరిగి తీసుకురాకపోతే నా తండ్రియైన నీ ఎదుట నా జీవితకాలమంతా ఆ నింద భరిస్తాను’ అన్నాను. 33 ✽అందుచేత దయచేసి మీ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి బదులుగా నా యజమానులైన మీకు దాసుడుగా ఉండనివ్వండి. అబ్బాయిని తన అన్నలతో పాటు వెళ్ళనివ్వండి. 34 అబ్బాయి నాతో కూడా లేకపోతే నా తండ్రి దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే నా తండ్రికి ముంచుకు వచ్చే దుఃఖాన్ని చూచి సహించలేను.”