43
1 కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. 2 వారు తాము ఈజిప్ట్‌నుంచి తెచ్చిన ధాన్యమంతా తినివేశాక వారి తండ్రి వారితో “మీరు మళ్ళీ వెళ్ళి మా కోసం కొంచెం ఆహారం కొనుక్కురండి” అన్నాడు.
3 అందుకు యూదా “ఆ మనిషి ‘మీ తమ్ముడు మీతోపాటు ఉంటేనే తప్ప మీరు నా ముఖం చూడర’ని మాతో గట్టిగా చెప్పాడు. 4 మీరు మా తమ్ముణ్ణి మాతోపాటు పంపితే మేము వెళ్ళి మీకోసం ఆహారం కొంటాం. 5 కాని, మీరు అతణ్ణి పంపకపోతే మేము వెళ్ళము. ఎందుకంటే ఆ మనిషి అన్నాడు ‘మీ తమ్ముడు మీతోపాటు ఉంటేనే తప్ప నా ముఖం చూడరు.’”
6 ఇస్రాయేల్ “మీకు ఇంకో తమ్ముడున్న సంగతిని ఆ మనిషితో చెప్పి ఇంత కీడు నామీదికి ఎందుకు తెచ్చిపెట్టారు?” అన్నాడు. 7 వారు “ఆ మనిషి మన గురించీ, మన బంధువుల గురించీ ఖచ్చితంగా అడిగాడు– ‘మీ తండ్రి బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని. అతని ప్రశ్నలకు తగ్గ జవాబులిచ్చాం. ‘మీ తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకు రమ్మంటాడ’ని మాకేం తెలుసు?” అన్నారు.
8 అప్పుడు యూదా తన తండ్రి ఇస్రాయేల్‌తో అన్నాడు “మేమూ నీవూ మా చిన్నవాళ్ళూ చావకుండా బ్రతికేలా మేము వెళ్ళాలి. ఆ అబ్బాయిని నాతో కూడా పంపు. 9 నేను అతని విషయం జామీను ఉంటాను. నీవు నన్ను బాధ్యుడుగా ఎంచవచ్చు. నేనతణ్ణి మళ్ళీ తీసుకువచ్చి, నీ ఎదుట నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను. 10 ఇప్పుడు ఈ విధంగా మాకు ఆలస్యం కాకపోతే ఈలోగా మేము రెండోసారి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళమే.”
11 అప్పుడు వారి తండ్రి ఇస్రాయేల్ వారితో “సరే, అలాగైతే ఈ విధంగా చెయ్యండి, ఈ దేశంలోని మేలిరకమైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని ఆ మనిషి దగ్గరికి తీసుకువెళ్ళండి – అంటే, కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు. 12 రెండంతల డబ్బు కూడా తీసుకుపోవాలి. మీ సంచుల మూతిలో వాళ్ళు మళ్ళీ ఉంచిన డబ్బు చేతపట్టుకుపోవాలి. వాళ్ళు అలా పొరపాటుగా ఉంచారేమో. 13 మీ తమ్ముణ్ణి కూడా తీసుకొని, తిరిగి ఆ మనిషి దగ్గరికి వెళ్ళండి. 14 అతడు మీ అన్ననూ, బెన్యామీన్నూ అప్పగించేలా అమిత శక్తిగల దేవుడు అతడి సముఖంలో మిమ్మల్ని కరుణిస్తాడు గాక! నేను సంతానాన్ని పోగొట్టుకోవలసి ఉంటే పోగొట్టుకుంటాను” అన్నాడు. 15 వారు ఆ కానుకనూ చేతిలో రెండంతల డబ్బునూ తమవెంట బెన్యామీనునూ కూడా తీసుకొని, బయలుదేరి, ఈజిప్ట్ దేశానికి వెళ్ళి యోసేపు ఎదుట నిలబడ్డారు. 16 యోసేపు వారితో ఉన్న బెన్యామీన్ను చూచి, తన ఇంటి పనులను నిర్వహించే వాడితో “ఈ మనుషులను ఇంటికి తీసుకుపోయి, వీళ్ళకోసం మేక మాంసం వండించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు” అన్నాడు. 17 యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు, వారిని యోసేపు ఇంటికి తీసుకువెళ్ళాడు.
18 ఇలా తమ్మును యోసేపు ఇంటికి రప్పించడం వల్ల వారికి భయం వేసింది. “మొదటిసారి మన సంచుల్లో వాళ్ళు తిరిగి ఉంచిన డబ్బు విషయాన్నిబట్టి మనల్ని లోపలికి తీసుకుపోతున్నారు. అతడు మన పైబడి మనల్ని దాసులుగా పట్టుకొని మన గాడిదలను తీసుకోవడానికి అవకాశం వెదకుతున్నాడ”ని చెప్పుకొన్నారు.
19 అందుచేత వారు యోసేపు ఇంటిపనులు చేసేవాణ్ణి సమీపించి ఇంటి గుమ్మం దగ్గర మాట్లాడారు – 20 “అయ్యగారూ, ఆ మొదటిసారి ఆహారాన్ని కొనుక్కోవడానికి వచ్చాం. 21 తరువాత బయలుదేరి సత్రం చేరుకున్నప్పుడు మా సంచుల్ని విప్పిచూస్తే మాలో ప్రతివాడి డబ్బు మొత్తం మా సంచుల్లో పైన ఉంది. అదంతా చేతపట్టుకొని వచ్చాం. 22 ఆహారం కొనడం కోసం వేరే డబ్బుకూడా చేతపట్టుకువచ్చాం. అప్పుడు మా డబ్బు మా సంచుల్లో పెట్టినదెవరో మాకేమీ తెలీదు.”
23 అతడు “మీకు క్షేమం! భయపడకండి. మీకూ మీ తండ్రికీ ఉన్న దేవుడు మీ సంచుల్లో ఆ ధనం పెట్టాడనుకోండి. మీ డబ్బు నాకు ముట్టింది” అన్నాడు. అప్పుడతడు వారి దగ్గరికి షిమ్యోన్ను తీసుకువచ్చాడు. 24 ఆ తరువాత వారందరినీ యోసేపు ఇంటిలోపలికి తీసుకువచ్చి వారికి నీళ్ళిచ్చాడు. వారు కాళ్ళు కడుక్కొన్నారు. అతడు వారి గాడిదలకు మేత పెట్టించాడు కూడా. 25 తాము భోజనం చేయవలసినది అక్కడే అని విని, యోసేపు ఇంటికి వచ్చే మధ్యాహ్నం వేళకు తమ కానుక సిద్ధంగా ఉంచారు. 26 యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ దగ్గర ఉన్న ఆ కానుక ఇంటిలోపలికి తెచ్చి అతనికి నేలను వంగి దండం పెట్టారు.
27 అతడు వారిని కుశల ప్రశ్నలడిగి “మీరు చెప్పిన వృద్ధుడు మీ తండ్రి బాగున్నాడా? ఆయన బ్రతికి ఉన్నాడా?” అని కూడా అడిగాడు.
28 “మీ దాసుడైన మా తండ్రి బాగున్నాడు, బ్రతికే ఉన్నాడు” అంటూ సవినయంగా వంగారు. 29 యోసేపు తలెత్తి తన తల్లి కొడుకైన తన తమ్ముడు బెన్యామీన్ను చూచి, “నాతో మీరు చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక” అన్నాడు.
30 యోసేపు తన తమ్ముణ్ణి చూచి, అతడి హృదయం వాత్సల్యంతో కరిగిపోయింది. ఎక్కడ ఏడ్వాలో అని వెదికి త్వరపడి తన గదికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. 31 తరువాత ముఖం కడుగుకొని బయటికి వచ్చి తన దుఃఖం అణచిపెట్టుకొంటూ “భోజనం వడ్డించు” అన్నాడు.
32 అతనికీ, వారికీ అతనితో భోజనం చేసే ఈజిప్ట్‌వాళ్ళకూ వేరు వేరుగా వడ్డించారు. ఈజిప్ట్‌వాళ్ళు హీబ్రూవారితో కలిసి భోజనం చేసేవారు కాదు. అది ఈజిప్ట్‌వాళ్ళకు అసహ్యం. 33 ఆ అన్నదమ్ములను, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు తమ తమ వయసు ప్రకారం కూర్చోబెట్టడం జరిగింది. గనుక వారు ఒకడివైపు ఒకడు ఆశ్చర్యంతో చూచుకొన్నారు. 34 యోసేపు తన ఎదుటనుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను పళ్ళెంలోది వారందరి పళ్ళేల్లో దానికంటే అయిదంతలు ఎక్కువగా ఉంది. అలా వారంతా యోసేపుతో ఉల్లాసంగా విందు ఆరగించారు.