42
1 ఈజిప్ట్‌లో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకొని అతని కొడుకులతో “మీరెందుకు ఊరికే ఒకడి ముఖం ఒకడు చూచుకొంటున్నారు?” అన్నాడు.
2 అతడింకా ఇలా అన్నాడు: “చూడండి, ఈజిప్ట్‌లో ధాన్యం ఉందని నేను విన్నాను, కనుక మనం చావకుండా బ్రతికేలా మీరు అక్కడికి వెళ్ళి మనకోసం ధాన్యం కొనుక్కురండి.”
3 అందుచేత యోసేపు పదిమంది అన్నలు ఈజిప్ట్‌లో ధాన్యం కొనుక్కొనేందుకు వెళ్ళారు.
4 అయితే యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును తన అన్నలతోపాటు పంపలేదు. “అతడికి ఏదైనా కీడు కలుగుతుందేమో” అనుకొన్నాడు. 5 ఇలా కనానుదేశంలో కరువు రావడంచేత ధాన్యం కొనుక్కోవడానికి వచ్చినవాళ్ళతో ఇస్రాయేల్ కొడుకులు వచ్చారు.
6 అప్పుడు ఈజిప్ట్‌దేశం మీద అధికారి యోసేపే. ఆ దేశప్రజలందరికీ ధాన్యం అమ్మేవాడూ అతడే. యోసేపు అన్నలు వచ్చి ముఖాలు నేలకు వంచి అతనికి వందనం చేశారు. 7 యోసేపు తన అన్నలను చూచి గుర్తు పట్టాడు. గానీ, వారిని గుర్తు పట్టిన సంగతి కనుపరచుకోకుండా వారితో కటువుగా మాట్లాడాడు. “మీరెక్కడనుంచి వచ్చారు?” అని అడిగితే, వారు “కనానుదేశం నుంచి వచ్చామండి, ఆహారం కొనుక్కొందామని” అన్నారు.
8 యోసేపు తన అన్నలను గుర్తు పట్టాడు గానీ వారు అతణ్ణి గుర్తు పట్టలేదు. 9 వారిని గురించి తనకు వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొని వారితో “మీరు గూఢచారులే. ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు” అన్నాడు.
10 వారు అతనిలో “అలా కాదు, ప్రభూ! మీ దాసులైన మేము ఆహారం కొనుక్కొనేందుకే వచ్చాం. 11 మేమంతా ఒకే తండ్రి కొడుకులం. మేము నిజాయితీపరులం. మీ దాసులైన మేమేమీ గూఢచారులం కాము” అని బదులు చెప్పారు. 12 అయితే అతడు వారితో “అలా కాదు. ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు” అన్నాడు. 13 వారు “మీ దాసులైన మేము పన్నెండుగురు అన్నదమ్ములం. కనానుదేశంలో ఉన్న ఒకే తండ్రి కొడుకులం. ఈ రోజున చిన్నవాడూ మా నాన్నగారి దగ్గర ఉన్నాడు. ఒకతను లేడు” అన్నారు.
14 అందుకు యోసేపు అన్నాడు, “నేను ముందు చెప్పినట్టే మీరు గూఢచారులు. 15 మీ మాటలు నిజమని దీన్నిబట్టి తెలుస్తుంది – ఫరో జీవంమీద ఒట్టు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరిక్కడనుంచి వెళ్ళరు. 16 మీ తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకురావడానికి మీరు మీలో ఒకణ్ణి పంపాలి. అందాకా మీరు ఖైదులో ఉండాలి. ఈ విధంగా మీ మాటలు పరిశోధించి, మీలో సత్యం ఉందో లేదో తెలుసుకుంటాను. లేకపోతే ఫరో జీవంమీద ఒట్టు, మీరు గూఢచారులే.”
17 అప్పుడు వారందరినీ మూడు రోజులు చెరసాలలో ఉంచాడు. 18 మూడో రోజున యోసేపు వారితో “దేవుడంటే నాకు భయభక్తులున్నాయి. గనుక మీరు ఇలా చేసి ప్రాణాలు దక్కించుకోండి. 19 మీరు నిజాయితీపరులైతే మీలో ఒకణ్ణి చెరసాలలో ఉంచుతాను. మిగతావారు మీ ఇంటివారి కరవు నివారణకోసం ధాన్యం తీసుకువెళ్ళి, 20 మీ తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురావాలి. ఈ విధంగా మీ మాటలు నిజమని రుజువవుతాయి. అప్పుడు మీ ప్రాణాలకు ముప్పు ఉండదు” అన్నాడు. వారు అలా చేయబూనుకొన్నారు.
21 అప్పుడు వారు ఒకడితో ఒకడు “మనం యోసేపు విషయంలో అపరాధులమే. అతడు మనల్ని బ్రతిమిలాడినప్పుడు అతడి మనోవేదన చూచి కూడా మనం లక్ష్యపెట్టలేదు. కనుకనే మనకీ బాధ” అన్నారు.
22 అందుకు రూబేను “ఆ అబ్బాయిపట్ల అపరాధం చేయకూడదని నేను మీతో చెప్పినా మీరు వినలేదు గదా! కనుక ఇప్పుడు అతని చావునుబట్టి తగిన శాస్తి జరుగుతున్నది” అన్నాడు.
23 తాము చెప్పినది యోసేపుకు అర్థమైందని వారికి తెలియదు. ఎందుకంటే యోసేపు ఒక అనువాదకుణ్ణి వినియోగించుకొన్నాడు. 24 అతడు వారి దగ్గరనుంచి అవతలికి వెళ్ళి కన్నీళ్ళు విడిచాడు. వారి దగ్గరికి మళ్ళీ వచ్చి మాట్లాడి వారి మధ్యలో నుంచి షిమ్యోనును పట్టుకొని వారి కళ్ళెదుటే అతణ్ణి బంధించాడు. 25 అప్పుడు యోసేపు వారి గోనెసంచులలో ధాన్యం నింపివేసి ఎవరి డబ్బు వారి సంచిలో తిరిగి ఉంచి ప్రయాణానికి భోజన పదార్థాలను వారికివ్వాలని తన పనివాళ్ళకు ఆజ్ఞాపించాడు.
26 వారు తమ ధాన్యం తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుంచి తరలి వెళ్ళారు. 27 తరువాత వాళ్ళలో ఒకతను తాము దిగిన సత్రంలో తన గాడిదకు మేత పెడదామని తన సంచి విప్పితే, తన డబ్బు కానవచ్చింది. అది అతని సంచిలో పైన ఉంది. 28 అతడు తన అన్నదమ్ములతో “నా డబ్బు మళ్ళీ తిరిగి వచ్చింది. ఇదిగో! అది నా సంచిలో ఉంది” అన్నాడు. వారి గుండెలు ఆగిపోయినట్లయింది. ఒకరివైపు ఒకరు భయంతో చూచుకొంటూ “ఇదేమిటి? దేవుడు మనకు ఇలా చేశాడు!” అని చెప్పుకొన్నారు.
29 వారు కనానుదేశానికి, తమ తండ్రి దగ్గరికి చేరుకొన్నప్పుడు తమకు సంభవించినదంతా అతనికి తెలుపుతూ ఇలా అన్నారు:
30 “మేము ఆ దేశాన్ని చూచే గూఢచారులమని ఆ దేశానికి అధిపతిగా ఉన్నవాడు అనుకొని మాతో కటువుగా మాట్లాడాడు. 31 మేము అతడితో అన్నాం గదా – ‘మేము నిజాయితీపరులం, గూఢచారులమేమీ కాదు. 32 మేము పన్నెండుగురు అన్నదమ్ములం, ఒకే తండ్రి కొడుకులం. ఒకడు లేడు. చిన్నవాడు ఇప్పుడు మా తండ్రిదగ్గర కనానుదేశంలో ఉన్నాడు’. 33 అందుకా మనిషి, ఆ దేశాధిపతి, మాతో ఇలా అన్నాడు: ‘మీరు నిజాయితీపరులని తెలుసుకొనేందుకు ఓ పరీక్ష పెట్టదలిచాను – మీలో ఒకణ్ణి నాదగ్గర విడిచిపెట్టి, మీ ఇంటివాళ్ళ కరవు నివారణకోసం ధాన్యం తీసుకువెళ్ళి, 34 నా దగ్గరికి మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకు రావాలి. మీరు గూఢచారులు కాక, నిజాయితీపరులయితే అదీ తెలుస్తుంది. మీ సోదరుణ్ణి మీకు అప్పచెప్పి మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి సెలవిస్తాను’”.
35 అప్పుడు వారు తమ సంచులు ఖాళీ చేస్తే ఎవరి డబ్బు మూట వారి సంచిలో ఉంది. తమ డబ్బు మూటలు వారూ వారి తండ్రీ చూచి బిత్తరపోయారు.
36 వారి తండ్రి యాకోబు “నాకు సంతానం లేకుండా చేస్తున్నారు మీరు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీనును కూడా తీసుకుపోతారట. ఇవన్నీ నా మీదికే వచ్చాయి” అన్నాడు.
37 రూబేను తన తండ్రితో అన్నాడు, “నేనతణ్ణి మీదగ్గరికి తిరిగి తీసుకురాకపోతే మీరు నా ఇద్దరు కొడుకుల్ని చంపవచ్చు. అతణ్ణి నా చేతికి అప్పగిస్తే అతణ్ణి తిరిగి మీ దగ్గరికి తీసుకువస్తాను.”
38 అయితే యాకోబు “నా కొడుకు మీతోపాటు వెళ్ళకూడదు. అతడి అన్న చనిపోయాడు. అతడు మాత్రమే మిగిలాడు. ఒకవేళ మీరు వెళ్ళే తోవలో అతడికి హాని కలిగితే నెరసిన వెండ్రుకలు గల నన్ను దుఃఖంతో మృత్యులోకానికి దిగిపోయేలా చేస్తారు” అన్నాడు.