41
1 రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నది దగ్గర నిలబడి ఉన్నాడు. 2 నదిలోనుంచి బలిసిన నున్నని ఆవులు ఏడు పైకి వచ్చి, జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. 3 వాటి తరువాత చిక్కిపోయిన నీరసమైన మరో ఏడు ఆవులు నదిలోనుంచి పైకి వచ్చి, ఆ ఆవులదగ్గర నది ఒడ్డున నిలుచున్నాయి. 4 అప్పుడు చిక్కిపోయిన నీరసమైన ఆవులు బలిసిన నున్నని ఆ ఏడు ఆవులను మ్రింగివేశాయి. దానితో ఫరో మేల్కొన్నాడు. 5 కాసేపటికి అతడు నిద్రపోయి రెండోసారి కల కన్నాడు. అందులో ఏడు పుష్టిగల మంచి వెన్నులతో దంటు ఒకటి పైకి వచ్చింది. 6 వాటి తరువాత మరో ఏడు వెన్నులు మొలిచాయి. అవి పీలవి, తూర్పుగాలికి ఎండిపోయినవి. 7 అప్పుడా పీల వెన్నులు పుష్టిగల మంచి వెన్నులను మ్రింగివేశాయి. దానితో ఫరో మేల్కొని అది కల అని గ్రహించాడు.
8  ఉదయమైనప్పుడు అతని మనసు కలతగా ఉంది. కనుక అతడు ఈజిప్ట్‌దేశంలో ఉన్న మాంత్రికులనూ పండితులనూ అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు. కానీ ఫరోకు ఆ కల భావం తెలపడానికి ఎవరిచేతా కాలేదు. 9 అప్పుడు పానపాత్ర అందించేవాడు ఫరోతో ఇలా చెప్పాడు:
“ఈవేళ నా తప్పులు గుర్తుకు వస్తున్నాయి. 10 ఫరో తన సేవకులమీద కోప్పడి, నన్ను, రొట్టెలు చేసే మనిషిని, మా ఇద్దరినీ రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచాడు. 11 నేనూ అతడూ ఇద్దరమూ ఒకే రాత్రిలో వేరు వేరు భావాలు గల కలలు కన్నాం. 12 అప్పుడు అక్కడ మాతోపాటు ఒక యువకుడు ఉన్నాడు. అతడు హీబ్రూవాడు, రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడు. మేము ఆ కలలు చెప్పినప్పుడు అతడు వాటి భావాలు తెలియజేశాడు. 13 అతడు మాకు తెలిపిన భావాల ప్రకారమే అంతా జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించడమూ, రొట్టెలు చేసే మనిషిని ఉరిదీయడమూ జరిగింది.”
14 అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు. అతణ్ణి చెరసాలలోనుంచి త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకొని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరకు వచ్చాడు. 15 చక్రవర్తి యోసేపుతో, “నేను ఒక కల కన్నాను. దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాకపోయింది. నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని నీ గురించి విన్నాను” అన్నాడు.
16 యోసేపు చక్రవర్తితో “అది నాచేత అయ్యేది కాదు – దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని జవాబిచ్చాడు.
17 అప్పుడు చక్రవర్తి యోసేపుతో ఇలా చెప్పాడు: “నా కలలో నేను నది ఒడ్డున నిలబడ్డాను. 18 హఠాత్తుగా నదిలోనుంచి బలిసిన నున్నని ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. 19 వాటి తరువాత మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అవేమో చిక్కిపోయినవి, నీరసంగా, చాలా వికారంగా ఉన్నాయి. అంత వికారమైనవి ఈజిప్ట్‌దేశమంతట్లో నాకు ఎన్నడూ కనిపించలేదు. 20 చిక్కిపోయిన నీరసమైన ఆవులు బలిసిన ఆ మొదటి ఏడు ఆవుల్ని మ్రింగివేశాయి. 21 అవి కడుపులో పడ్డాక అవి కడుపులో పడ్డట్టు కనిపించలేదు. అంటే, మొదట అవి ఎంత నీరసంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు నేను మేల్కొన్నాను. 22 తరువాత నా కలలో నేను చూస్తుండగా ఏడు పుష్టిగల వెన్నులతో దంటు ఒకటి పైకి వచ్చింది. 23 వాటి తరువాత మరో ఏడు వెన్నులు మొలిచాయి. అవి పీలవి, వాడిపోయినవి, తూర్పుగాలికి ఎండిపోయినవి. 24 ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నుల్ని మ్రింగివేశాయి. ఇదంతా మాంత్రికులకు తెలియజేశాను. గానీ దాని భావం చెప్పడానికి ఎవరిచేతా కాలేదు.”
25 యోసేపు చక్రవర్తితో ఇలా అన్నాడు: “ఫరోకు వచ్చిన కలల భావం ఒకటే. దేవుడు తాను జరిగించనై ఉన్నది ఫరోకు తెలిపాడు. 26 ఆ ఏడు మంచి ఆవులు ఏడేళ్ళు. ఆ ఏడు మంచి వెన్నులూ ఏడేళ్ళు. కల ఒకటే. 27 వాటి తరువాత పైకి వచ్చిన, చిక్కిపోయిన నీరసమైన ఏడు ఆవులూ, తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు పీల వెన్నులూ కూడా ఏడేళ్ళు. అవి ఏడేళ్ళ కరవును సూచిస్తాయి. 28 నేను ఫరోతో చెప్పినట్టే దేవుడు తాను జరిగించనై ఉన్నది ఫరోకు తెలిపాడు. 29 వినండి, ఈజిప్ట్‌దేశం అంతా విస్తారమైన పంటలు పండే ఏడేళ్ళు రాబోతున్నాయి. 30 ఆ తరువాత ఏడేళ్ళ కరవు వస్తుంది. ఆ విస్తారమైన పంటలను అప్పుడు ఈజిప్ట్‌దేశం మరచిపోతుంది. ఆ కరవు దేశాన్ని పాడు చేస్తుంది. 31 తరువాత రాబొయ్యే కరవు కారణంగా దేశంలో ఆ పంటల సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ కరువు చాలా తీవ్రంగా ఉంటుంది. 32 దేవుడు ఇలా జరిగించడానికి నిశ్చయించుకొన్నాడు. ఆయన సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది. ఈ కల ఫరోకు రెండు సార్లు రావడంలో భావం ఇదే.
33 “అందుచేత ఇప్పుడు ఫరో తెలివితేటలు గలవాణ్ణి వెదికి అతణ్ణి ఈజిప్ట్‌దేశంపై నియమిస్తే బాగుంటుంది. 34 ఫరో అలా చేసి పైవిచారణకర్తలను కూడా ఈ దేశంమీద నియమించి, పంటలు సమృద్ధిగా పండే ఏడేళ్ళలో ఈజిప్ట్ అంతటా అయిదో భాగం తీసుకొంటే బాగుంటుంది. 35 వారు రాబొయ్యే ఈ మంచి ఏళ్ళలో పండే ఆహారమంతా సేకరించి ఆ ధాన్యం ఫరో ఆధీనంలో కూడబెట్టి, పట్టణాల్లో ఆ ఆహారం భద్రం చెయ్యాలి. 36 కరవుచేత ఈ దేశం నాశనం కాకుండా ఈజిప్ట్‌లో రాబొయ్యే ఏడు కరవు సంవత్సరాలలో దేశంలో కూడబెట్టిన ఆహారం ఉంటుంది.”
37 ఆ మాట ఫరోకు అతడి పరివారంలో అందరికీ నచ్చింది. 38 అప్పుడు ఫరో తన పరివారంతో “ఇతడిలాగా దైవాత్మ గలవాడు మరొకడు మనకు దొరుకుతాడా?” అన్నాడు.
39 యోసేపుతో ఫరో అన్నాడు, “దేవుడు ఇదంతా నీకు తెలిపాడు, గనుక నీకున్నంత తెలివితేటలు ఇంకెవరికీ లేవు. 40 నీవు నా భవనంలో పై అధికారివై ఉంటావు. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాణ్ణిగా ఉంటాను.”
41 ఫరో ఇంకా యోసేపుతో “విను, ఈజిప్ట్ దేశ మంతటి మీదా ఇప్పుడు నీకు అధికారమిస్తున్నాను” అని చెప్పి, 42 తన చేతికి ఉన్న రాజ ముద్రగల ఉంగరం తీసి, యోసేపు చేతికి పెట్టి, శ్రేష్ఠమైన దుస్తులు అతనికి తొడిగించి, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. 43 అప్పుడు చక్రవర్తి తన రెండో రథంలో అతణ్ణి కూర్చోబెట్టాడు. రథం సాగుతూ ఉంటే అతని ముందర జనం “తోవ ఇవ్వండి” అని కేకలువేస్తూ ఉన్నారు. ఇలా చక్రవర్తి యోసేపుకు ఈజిప్ట్ దేశంమంతటిమీదా అధికారం ఇచ్చాడు.
44 చక్రవర్తి యోసేపుతో “నేను ఫరోను. నీ సెలవు లేకుండా ఈజిప్ట్ అంతటా ఎవ్వరూ ఏమీ చేయకూడదు” అన్నాడు.
45 చక్రవర్తి యోసేపుకు “జప్‌నత్‌పనేహు” అనే మారుపేరు పెట్టాడు. అంతేగాక ఓను అనే పట్టణం యాజియైన పోతీఫెర కూతురిని యోసేపుకు ఇప్పించి పెళ్ళి చేశాడు. ఆమె పేరు ఆసెనతు. తరువాత యోసేపు ఈజిప్ట్‌దేశ సంచారం చేశాడు. 46 ఫరో ఎదుట నిలబడ్డప్పుడు యోసేపు ముప్ఫయి ఏళ్ళవాడు. యోసేపు ఫరో సముఖంనుంచి వెళ్ళి ఈజిప్ట్ దేశంలో నలుదిక్కుల ప్రయాణాలు చేశాడు. 47 సమృద్ధిగా పండిన ఆ ఏడేళ్ళలో భూమి చాలా ఫలవంతంగా ఉంది. 48 ఈజిప్ట్‌దేశంలో ఉన్న ఏడేళ్ళ ఆహారమంతా యోసేపు సేకరించి దానిని పట్టణాలలో నిలువ చేశాడు. ఏ పట్టణం చుట్టు ఉన్న పొలాల పంట ఆ పట్టణంలో నిలువ చేశాడు. 49 యోసేపు చాలా ధాన్యం పోగు చేశాడు. అసలు అది సముద్రం ఇసుకంత సమృద్ధిగా ఉంది. కొలవడానికి వీలులేనంతగా ఉండడంచేత వాళ్ళు కొలవడం మానివేశారు.
50 కరవు ఆరంభించిన సంవత్సరానికి ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు జన్మించారు. అతనికి వారిని ఓను అనే పట్టణం యాజి పోతీఫెర కూతురు ఆసెనతు కన్నది. 51 యోసేపు మొదట పుట్టినవాడికి “మనష్షే” అనే పేరు పెట్టాడు. ఎందుకంటే “దేవుడు నా కష్టాన్నంతా, నా తండ్రి ఇంటినీ, నేను మరచిపోయేలా చేశాడు” అనుకొన్నాడు. 52 రెండో కొడుకుకు “ఎఫ్రాయిం” అనే పేరు పెట్టాడు. ఎందుకంటే “నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అనుకొన్నాడు.
53 తరువాత ఈజిప్ట్‌దేశంలో సమృద్ధిగా పండిన ఏడు ఏళ్ళు గడిచిపొయ్యాయి. 54 యోసేపు చెప్పినట్టే, ఏడు కరువు ఏళ్ళు ఆరంభమయ్యాయి. అన్ని దేశాల్లో కరవు వచ్చింది. అయితే ఈజిప్ట్‌దేశం అంతటా ఆహారం ఉంది.
55 ఈజిప్ట్‌లో అన్ని చోట్లకు కరువు వ్యాపించాక ప్రజలు ఆహారంకోసం చక్రవర్తితో మొరపెట్టుకొన్నారు. ఫరో ఈజిప్ట్ వాళ్ళందరికీ “మీరు యోసేపు దగ్గరకి వెళ్ళి, అతడు మీతో చెప్పేదేదో అది చెయ్యాలి” అని చెప్పాడు. 56 ఆ కరవు లోకమంతటికీ వచ్చింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఈజిప్ట్‌వాళ్ళకు ధాన్యం అమ్మాడు. ఈజిప్ట్‌దేశంలో కరువు తీవ్రంగా ఉంది. 57 అంతేగాక, ఆ కరువు లోకంలో అంతటా తీవ్రంగా ఉండడంచేత యోసేపు దగ్గర ధాన్యాన్ని కొనడానికి లోకమంతా ఈజిప్ట్‌కు వచ్చింది.