40
1 ఆ తరువాత ఈజిప్ట్ చక్రవర్తికి పానపాత్ర అందించేవాడు, వేరు వేరు రొట్టెలు, భక్ష్యాలు చేసేవాడు తమ యజమానియైన ఈజిప్ట్ చక్రవర్తిపట్ల తప్పు చేశారు. 2 ఫరో ఆ ఇద్దరు ఉద్యోగస్థులమీద – పానపాత్ర అందించేవారిలో ముఖ్యుడిమీదా, రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడిమీదా – కోప్పడ్డాడు. 3 వారిని బందీలుగా రాజు సంరక్షక సేనాధిపతి ఇంట్లో ఉండాలని అతడికి అప్పగించాడు. యోసేపు ఖైదీగా ఉన్న స్థలం అదే. 4 సేనాధిపతి వాళ్ళకు యోసేపును పరిచారకుడుగా నియమించాడు. గనుక అతడు వాళ్ళకు సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కొంత కాలం అలా కావలిలో ఉన్నారు.
5 ఒకరాత్రి ఆ ఇద్దరూ, అంటే, ఫరోకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ కావలిలో బందీలుగా ఉండగానే, కలలు కన్నారు. ఒకే రాత్రిలో ఒక్కొక్కడు వేరు వేరు భావాల కలలు కన్నారు. 6 ప్రొద్దున యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విచారంగా ఉన్నట్టు గమనించాడు. 7 కనుక అతడు తన యజమాని ఇంట తనతో బందీలుగా కావలిలో ఉన్న ఆ రాజ ఉద్యోగులను చూచి “ఈ వేళ మీరెందుకు ఏడుపు ముఖాలతో ఉన్నారు?” అని అడిగాడు.
8 అందుకు వాళ్ళు “మాకు కలలు వచ్చాయి. వాటి భావం చెప్పగలవాడెవ్వడూ లేడు” అన్నారు. యోసేపు వాళ్ళతో “కలల భావాలు తెలియజేయడం అనేది దేవుని వశంలోనే ఉంది గదా. అయితే మీరు ఆ కలలు నాకు చెప్పండి” అన్నాడు.
9 అప్పుడు పానపాత్ర అందించేవాడు తన కల యోసేపుకు వివరించాడు – “నా కలలో ఒక ద్రాక్షచెట్టు నా ఎదుట ఉంది. 10 ఆ ద్రాక్ష చెట్టుకు మూడు తీగెలున్నాయి. అది అంకురించగానే దాని పువ్వులు వికసించాయి, దాని గెలలు పండి ద్రాక్షపళ్ళయ్యాయి. 11 ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేనా ద్రాక్షపళ్ళు తీసుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి, ఆ గిన్నె ఫరో చేతికందించాను.” 12 యోసేపు అతడితో “దాని భావం ఇదే: ఆ మూడు తీగెలు మూడు రోజులు. 13 ఇంకా మూడు రోజుల లోపల చక్రవర్తి మిమ్మల్ని ఇక్కడనుంచి విడిపించి మీ ఉద్యోగం మీకు మళ్ళీ ఇప్పిస్తాడు. మీరు ఆయనకు పానపాత్ర అందించేవాడుగా ఉన్నప్పుడు చేసినట్టే ఫరో గిన్నె ఆయన చేతికందిస్తారు. 14 అయితే నీకు క్షేమం కలిగేటప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొని, నామీద దయచూపి, నా విషయం ఫరోతో మాట్లాడి, నన్ను ఈ ఇంటిలోనుంచి విడిపించండి. 15 ఎందుకంటే, నన్ను హీబ్రూవారి దేశంలోనుంచి దొంగిలించడం జరిగింది. అంతేగాక, ఈ చెరసాలలో నన్ను వేయడానికి ఇక్కడ కూడా నేనేమీ నేరం చేయలేదు” అన్నాడు.
16 రొట్టెలు చేసేవారిలో ముఖ్యుడు ఆ కల భావం బాగుందని గ్రహించి యోసేపుతో ఇలా చెప్పాడు: “నేను కూడా కల కన్నాను. అందులో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా నెత్తిమీద ఉన్నాయి. 17 పై గంపలో ఫరో కోసం అన్ని రకాల పిండివంటలు ఉన్నాయి గాని, పక్షులు నా నెత్తిమీద ఉన్న గంపలోనుంచి వాటిని తింటూ ఉన్నాయి.”
18 యోసేపు ఇలా జవాబిచ్చాడు: “దాని భావమిదే – ఆ మూడు గంపలు మూడు రోజులు. 19 మూడు రోజుల లోపల చక్రవర్తి నీ తలను నరికించివేసి మ్రానుమీద మిమ్మల్ని వ్రేలాడదీయిస్తాడు. పక్షులు నీ మాంసం తింటాయి.”
20 మూడో రోజున అలాగే జరిగింది. ఆ రోజు ఫరో పుట్టిన రోజు కావడంచేత అతడు తన పరివారంలోని వాళ్ళందరికీ విందు చేయించి, వాళ్ళ సమక్షంలో పానపాత్ర అందించేవాణ్ణీ రొట్టెలు చేసేవాణ్ణీ ఖైదులోనుంచి రప్పించాడు. 21 పానపాత్ర అందించేవారిలో ఆ ముఖ్యమైనవాడికి అతని ఉద్యోగం మళ్ళీ ఇప్పించాడు. అతడు ఫరో చేతికి గిన్నె అందించడం జరిగింది. 22 అయితే యోసేపు వాళ్ళకు కల భావం తెలిపినట్టే, రొట్టెలు చేసేవాణ్ణి ఫరో ఉరి తీయించాడు. 23 అయితే పానపాత్ర అందించేవాడు యోసేపును మనసులో పెట్టుకోకుండా మరిచిపొయ్యాడు.