39
1 ఇష్మాయేల్ జాతివాళ్ళు, యోసేపును ఈజిప్ట్‌కు తీసుకువెళ్ళారు. ఈజిప్ట్ దేశస్థుడు పోతీఫరు అతణ్ణి అక్కడికి తీసుకువచ్చినవాళ్ళ దగ్గర కొనుక్కొన్నాడు. ఫరోదగ్గర ఈ పోతీఫరు ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి. 2 యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు, గనుక అతడు పనులన్నీ సఫలంగా చేస్తూ తన యజమాని అయిన ఆ ఈజిప్ట్‌వాడి ఇంట్లో ఉన్నాడు. 3 యెహోవా అతనికి తోడుగా ఉన్న సంగతినీ, అతడు చేసే పనులన్నీ అతని చేతిలో యెహోవా సఫలం చేయడమూ అతని యజమాని చూశాడు. 4 కనుక అతడు యోసేపు పట్ల దయ చూపాడు. ఇలా యోసేపు అతడికి సన్నిహిత పరిచారకుడయ్యాడు. ఆ మనిషి తన ఇంటిమీద యోసేపును నిర్వాహకుడిగా నియమించి, తనకు కలిగినదంతా అతని చేతికి అప్పచెప్పాడు. 5 తన ఇంటిమీదా తనకు కలిగినదానంతటిమీదా నిర్వాహకుడుగా యోసేపును నియమించిన నాటినుంచి యోసేపు కారణంగా యెహోవా ఆ ఈజిప్ట్ వాడి ఇంటికి ఆశీస్సులు అనుగ్రహిస్తూ వచ్చాడు. యెహోవా ఆశీస్సులు అతని ఇంట్లో, పొలాల్లో అతడికి కలిగినదానంతటిమీదా ఉండేవి. 6 ఈ విధంగా తన ఆస్తినంతా యోసేపు చేతికి అప్పచెప్పి “యోసేపు ఉన్నాడు గదా” అనుకొని తాను తినే ఆహారం తప్ప మిగతా విషయాలు ఏమీ చూచుకొనేవాడు కాదు. 7 యోసేపు రూపవంతుడు, సుందరుడు. కనుక కొంతకాలం గడిచాక అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి “నన్ను పొందు” అంది.
8 అతడు ఒప్పుకోలేదు. “నేను ఈ పాపిష్ఠి కార్యం జరిగించి దేవునికి విరోధంగా పాపం చేయడం ఎట్లా? నా యజమాని తన ఆస్తినంతా నా చేతిలో పెట్టి, నేను ఇక్కడ ఉండడంచేత ఇంట్లో ఏ విషయాన్ని చూచుకోవడం లేదు. ఈ ఇంట్లో నాకంటే పైవాడెవడూ లేడు. 9 ఆయన మిమ్ములను తప్ప సమస్తాన్నీ నాకప్పగించాడు – మీరు ఆయన భార్య గదా?” అన్నాడు 10 రోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నా అతడు ఆమెను పొందడానికీ, ఆమెతో ఉండడానికీ ఆమెకు లొంగలేదు. 11 ఒక రోజు అతడు తన పనిమీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో పనివాళ్ళెవరూ లేరు. 12 ఆమె అతని పై వస్త్రం పట్టుకొని “నన్ను పొందు” అంది. అతడు తన వస్త్రం అలాగే ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపొయ్యాడు. 13 అతడు వస్త్రం తన చేతిలో విడిచి తప్పించుకు వెళ్ళడం ఆమె చూచి, తన ఇంటి మనుషులను పిలిచి, వాళ్ళతో ఇలా అంది:
14  “చూడు, నా భర్త మనల్ని అవమానపరచడానికి ఒక హీబ్రూవాణ్ణి మనదగ్గరికి తెచ్చాడు. నన్ను పొందడానికి వాడు వచ్చాడు. అంచేత నేను పెద్ద కేకలు వేశాను. 15 నేను గట్టిగా కేకలు పెట్టడం వాడు విని నా దగ్గర తన వస్త్రాన్ని వదిలేసి తప్పుకొని బయటికి పారిపొయ్యాడు.”
16 యోసేపు యజమాని ఇంటికి వచ్చేదాకా ఆమె అతని వస్త్రం తన దగ్గర ఉంచుకొంది. 17 అప్పుడామె తన భర్తతో ఆ కథంతా చెప్పింది – “మీరు మనదగ్గరికి తెచ్చిన ఆ హీబ్రూవాడు నన్ను అవమానపరచడానికి నాదగ్గరికి వచ్చాడు. 18 నేను గట్టిగా కేకలు వేస్తూంటే వాడు తన వస్త్రం నాదగ్గర వదిలేసి తప్పుకొని బయటికి పారిపొయ్యాడు.”
19 “మీ దాసుడు నన్ను ఇలా చేశాడ”ని భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు యోసేపుమీద అతని యజమాని కోపాగ్ని రగులుకొంది. 20  అతడు యోసేపును పట్టుకొని రాజుగారి ఖైదీలు ఉంచబడే చెరసాలలో పెట్టాడు. ఆ చెరసాలలోనే యోసేపు ఉండిపొయ్యాడు.
21 అయితే యెహోవా యోసేపుకు తోడుగా ఉండి అతనిపై కటాక్షం చూపి ఆ చెరసాల అధిపతి అతణ్ణి దయ చూచేలా చేశాడు. 22 చెరసాల అధిపతి ఆ ఖైదులో ఉన్న బందీలందిరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వాళ్ళక్కడ చేసేదంతా యోసేపే చేయించేవాడు. 23 యెహోవా అతనికి తోడుగా ఉండడంచేత అతని చేతిలో ఉన్న దేనినీ చెరసాల అధిపతి చూచుకొనేవాడు కాదు. యోసేపు చేసే పనులన్నీ యెహోవా సఫలం చేశాడు.