38
1 ఆ కాలంలో యూదా తన అన్నదమ్ములను విడిచి అదుల్లాం వాడొకడి దగ్గర ఉండడానికి కొండసీమనుంచి దిగి వెళ్ళాడు. ఆ మనిషి పేరు హీరా. 2 అక్కడ షూయ అనే పేరుగల కనానువాడొకడి పిల్లను యూదా చూచి, తీసుకొని ఆమెతో పోయాడు. 3 ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. వాడికి ఏర్ అనే పేరు పెట్టాడు యూదా. 4 ఆమె మళ్ళీ గర్భవతి అయి మరో కొడుకును కన్నది. వాడికి ఓనాను అనే పేరు పెట్టిందామె. 5 ఆమె మరో కొడుకును కని వాడికి షేలా అనే పేరు పెట్టింది. వాణ్ణి కన్నప్పుడు యూదా కజీబ్‌లో ఉన్నాడు.
6 యూదా తన పెద్ద కొడుకు ఏర్‌కు తామారు అనే ఆమెను పెళ్ళి చేశాడు. 7 యూదా పెద్ద కొడుకు ఏర్ చెడ్డవాడని యెహోవాకు తెలుసు, గనుక అతణ్ణి మరణానికి గురి చేశాడు.
8 అప్పుడు యూదా ఓనానుతో “నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్న వంశం నిలబెట్టు” అన్నాడు.
9 ఓనానుకు ఆ సంతానం తనది కాబోదని తెలుసు. గనుక ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగకుండేలా తన వీర్యాన్ని నేలమీద విడిచాడు. 10 అతడు చేసినది యెహోవా దృష్టిలో చెడ్డది గనుక ఆయన అతణ్ణి కూడా చంపాడు. 11 అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “మా అబ్బాయి షేలా పెరిగి పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అన్నాడు. “ఇతడూ ఇతడి అన్నల్లాగే చనిపోతాడేమో” అని అతడు అనుకొన్నాడు. కనుక తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో ఉండిపోయింది.
12 చాలా రోజులయ్యాక యూదా భార్య (షూయ కూతురు) చనిపోయింది. దుఃఖించే రోజుల తరువాత యూదా అదుల్లాంవాడు హీరా అనే స్నేహితుడితో తిమ్నాకు, తన గొర్రెల బొచ్చు కత్తిరించేవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
13 “ఇదిగో, నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్ళిపోతున్నాడ”ని ఎవరో తామారుకు తెలియజేశారు. 14 అప్పటికి షేలా పెరిగి పెద్దవాడయినా తనను భార్యగా అతనికి ఇవ్వడం జరగలేదని తామారు తెలుసుకొని, తన వైధవ్య వస్త్రాలను తీసివేసింది. ముసుకు వేసుకొని, ఒళ్ళంతా బాగా కప్పుకొని, తిమ్నాకు పోయే త్రోవలో ఏనాయిం ద్వారం దగ్గర కూర్చుంది. 15 యూదా ఆమెను చూడడంతోనే వేశ్య అనుకొన్నాడు. ఎందుకంటే ఆమె తన ముఖం కప్పుకొన్నది. 16 అతడు ఆ త్రోవలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తన కోడలని తెలియక, “నేను నీతో పోవాలి, రా” అన్నాడామెతో. అందుకామె “అలాగే, అయితే మీరు నాకేమిస్తారు?” అని అడిగింది.
17 “మందలోనుంచి మేకపిల్లను పంపిస్తాన”ని అతడు జవాబియ్యగా “దాన్ని పంపించే వరకు ఏదైనా కుదువ పెడతారా?” అని ఆమె ప్రశ్న వేసింది.
18 “నీ దగ్గర ఏం కుదువ పెట్టాలి?” అని అతడు అడిగితే “మీ ముద్ర, దాని తాడు, మీ చేతికర్ర ఇవ్వండి” అంది.
అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పొయ్యాడు. ఆమె అతడివల్ల గర్భవతి అయింది.
19 ఆమె అక్కడనుంచి తరలివెళ్ళి, తన ముసుకు తీసివేసి, తన వైధవ్య వస్త్రాలను మళ్ళీ కట్టుకొన్నది. 20 యూదా ఆ స్త్రీ దగ్గరనుంచి ఆ కుదువ విడిపించుకోవడానికి తన స్నేహితుడు ఆ అదుల్లాంవాడిచేత మేక పిల్లను పంపించాడు. గానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. 21 అతడా ప్రాంతంవాళ్ళను చూచి “ఏనాయిం దగ్గర త్రోవ పక్కన మునుపు ఉన్న వేశ్య ఎక్కడ ఉంది?” అని అడిగాడు. “ఇక్కడ ఏ వేశ్యా లేదే” అని వాళ్ళు బదులు చెప్పారు.
22 అతడు యూదా దగ్గరికి తిరిగి వచ్చి, “ఆమె నాకు కనిపించలేదు. అంతేగాక, ఆ ప్రాంతంవాళ్ళు ‘ఇక్కడ ఏ వేశ్యా లేద’ని చెప్పారు” అన్నాడు.
23 యూదా “మనం అవమానానికి గురి కాకుండా ఆమెను వాటిని ఉంచుకోనియ్యి. నేనీ మేక పిల్లను పంపించాను గాని, ఆమె నీకు కనిపించలేదు” అన్నాడు.
24 దాదాపు మూడు నెలల తరువాత యూదాకు ఎవరో ఇలా చెప్పారు: “మీ కోడలు తామారు వేశ్యగా ప్రవర్తించింది. వ్యభిచారం వల్ల ఆమె గర్భంతో ఉంది.”
యూదా అన్నాడు, “ఆమెను బయటికి తీసుకువచ్చి కాల్చెయ్యాలి.” 25 ఆమెను బయటికి తీసుకువచ్చాక ఆమె తన మామ దగ్గరకు ఆ వస్తువులు పంపిస్తూ ఈ కబురు పెట్టింది:
“ఇవి ఎవరివో ఆ మనిషి వల్ల నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ తాడు, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టండి.”
26 యూదా వాటిని గుర్తు పట్టి, “ఆమెను నా కొడుకు షేలాకు ఇవ్వలేదు, గనుక నా కంటే ఆమె న్యాయంగా ప్రవర్తించింది” అన్నాడు.
27 ఆమె ప్రసవకాలంలో కవలలు ఆమె గర్భంలో ఉన్నారు. 28 ఆమె ప్రసవిస్తూ ఉండగా ఒక శిశువు తన చెయ్యి బయటికి చాపడం జరిగింది. మంత్రసాని “మొదట బయటికి వచ్చింది ఈ శిశువు” అని చెప్పి, వాడి చేతికి ఎర్రని దారం కట్టింది. 29 అతడు తన చెయ్యి లోపలికి తీయగా అతడి తమ్ముడు బయటికి వచ్చాడు. మంత్రసాని “ఇలా సందు చేసుకు వచ్చావేమిటి?” అంది. అందుచేత అతడికి “పెరెస్” అనే పేరు వచ్చింది. 30 తరువాత తన చేతికి ఎర్రని దారం ఉన్న వాడి అన్న బయటికి వచ్చాడు. అతడికి “జెరహు” అనే పేరు వచ్చింది.