37
1 యాకోబు తన తండ్రి పరదేశిగా కాపురమున్న కనానుదేశంలో నివసించాడు. 2 యాకోబు సంతానాన్ని గురించిన విషయాలివి: యోసేపు✽ తన అన్నలతో – తన తండ్రి భార్యలైన బిల్హా, జిల్పా కొడుకులతో – మందలను మేపేవాడు. అప్పుడతడు పదిహేడేళ్ళవాడు. వాళ్ళ చెడుతనాన్ని గురించి✽ వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు యోసేపు. 3 యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యంలో జన్మించిన కొడుకు గనుక తన కొడుకులందరిమీదకంటే యోసేపు మీద ఎక్కువ ప్రేమ ఉంది. అతడు యోసేపు కోసం✽ రంగుచారల నిలువుటంగీ కుట్టించాడు.4 ✽ యోసేపు అన్నలు తమ తండ్రికి తమ అందరి మీద కంటే అతనిమీద ఎక్కువ ప్రేమ ఉండడం చూచి యోసేపును ద్వేషిస్తూ, అతనితో ఎప్పుడూ కసురుకుంటూ మాట్లాడేవారు. 5 తరువాత వారికి యోసేపు మీద ద్వేషం ఎక్కువైంది. ఎందుకంటే అతడు ఒక కల✽ కని అది వారికి ఇలా తెలియజేశాడు✽:
6 “నాకు వచ్చిన ఈ కలను మీరు వినండి. 7 ✽అందులో మనం పొలంలో పనలు కడుతూ ఉంటే నా పన లేచి నిలువుగా నిలబడింది. అప్పుడు మీ పనలు నా పన చుట్టూ చేరి దానికి సాగిలపడ్డాయి.”
8 అతని అన్నలు అతనితో “నువ్వు మమ్మల్ని నిజంగా ఏలుతావా? మామీద అధికారం చేస్తానంటావా!” అన్నారు. అతని కలలనుబట్టీ మాటలను బట్టీ అతని అన్నలు అతణ్ణి మరీ ఎక్కువగా ద్వేషించారు.
9 యోసేపు మరో కల కని అది కూడా తన అన్నలకు వివరిస్తూ “వినండి, మరో కల నాకు వచ్చింది. అందులో సూర్యమండలమూ, చంద్రగోళమూ పదకొండు నక్షత్రాలూ నాకు సాగిలపడడం జరిగింది” అన్నాడు.
10 ✽అతడు దాన్ని తన తండ్రితోనూ అన్నలతోనూ చెప్పాడు. అతని తండ్రి అతణ్ణి చీవాట్లు పెట్టి, “నీవు కన్న ఈ కల ఏమిటీ అంట? నేనూ మీ తల్లీ నీ అన్నలూ వచ్చి నీకు సాగిలపడడం నిజంగా జరుగుతుందంటావా!” అన్నాడు.
11 ✝అతని అన్నలకు అతడంటే అసూయ. అతని తండ్రి అయితే ఆ సంగతి మనసు✽లో ఉంచుకొన్నాడు.
12 యోసేపు అన్నలు తమ తండ్రి మందను షెకెం✽ ప్రాంతంలో మేపడానికి వెళ్ళారు. 13 ఇస్రాయేల్ యోసేపుతో “నీ అన్నలు షెకెం ప్రాంతంలో మందను మేపుతున్నారు గదా! రా, నిన్ను వారిదగ్గరకు పంపుతాను” అన్నాడు. అతడు “సరే” అన్నాడు.
14 అప్పుడు ఇస్రాయేల్ “నీవు వెళ్ళి నీ అన్నల క్షేమమూ మంద క్షేమమూ తెలుసుకొని తిరిగి వచ్చి నాతో చెప్పు” అని అతనితో చెప్పి అతణ్ణి హెబ్రోను✽లోయలో నుంచి పంపాడు.
15 అతడు షెకెం చేరుకొని మైదానంలో ఇటూ అటూ తిరుగుతూ ఉన్నప్పుడు అతణ్ణి ఒక వ్యక్తి చూచి “నువ్వు ఏం వెదుకుతున్నావు?” అని అడిగాడు.
16 అందుకతడు “నా అన్నల్ని వెదుకుతున్నాను. వారెక్కడ మందను మేపుతున్నారో దయచేసి నాకు చెప్పగలరా?” అన్నాడు.
17 “వాళ్ళు ఇక్కడనుంచి వెళ్ళిపోయారు. ‘దోతాను✽కు వెళదాం పదండి’ అని వాళ్ళు చెప్పుకోవడం విన్నాను” అన్నాడా వ్యక్తి.
యోసేపు తన అన్నల కోసం వెళ్ళి దోతానులో వారిని చూశాడు. 18 వారతణ్ణి దూరం నుంచి చూచి అతడు దగ్గరికి వచ్చేలోగా అతణ్ణి చంపుదామని✽ కుట్ర పన్నారు.
19 “ఇడుగో, కలలు కనేవాడు✽ వచ్చేస్తున్నాడు! 20 వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం పట్టండి. తరువాత వాణ్ణి దుష్టమృగం మింగేసిందని చెపుదాం. అప్పుడు వాడి కలలు ఏమవుతాయో చూద్దాం” అని ఒకడితో ఒకడు మాట్లాడుకొన్నారు.
21 ✽ అయితే రూబేను ఆ సంగతి విని, “మనం వాణ్ణి చంపకూడదు” అని చెప్పి వాళ్ళవల్ల యోసేపుకు ప్రాణాపాయం కలగకుండా చేశాడు. 22 అతడింకా వారితో “హత్య వద్దు. వాడికి హాని ఏమీ చేయకుండా ఈ అరణ్యంలో, ఈ గుంటలో అతణ్ణి పడద్రోయండి” అన్నాడు.
వాళ్ళవల్ల ప్రాణాపాయం కలగకుండా యోసేపును విడిపించి తండ్రి దగ్గరికి తీసుకు పోవచ్చనుకొన్నాడు. 23 యోసేపు తన అన్నల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతణ్ణి పట్టుకొని, అతని అంగీ, అంటే అతడు తొడుగుకొన్న ఆ రంగు చారల నిలువుటంగీ ఊడదీసి, 24 అతణ్ణి ఆ గుంటలో పడద్రోశారు. అది ఖాళీ గుంట. అందులో నీళ్ళేమీ లేవు. 25 అప్పుడు వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. తలెత్తి చూశారు. గిలాదునుంచి వస్తూ ఉన్న వర్తకులైన బాటసారుల గుంపు కనిపించింది. వాళ్ళు సుగంధ ద్రవ్యం, సువాసన తైలం, బోళం ఒంటెలమీద వేసుకొని ఈజిప్ట్‌కు వెళ్తున్న ఇష్మాయేల్ జాతివాళ్ళు✽.
26 యూదా తన అన్నదమ్ములతో “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి హత్యను కప్పిపుచ్చడం వల్ల ఏమి లాభం? 27 ఈ ఇష్మాయేలువాళ్ళకు వాణ్ణి అమ్మేద్దాం పదండి. వాడు మన తమ్ముడు, మన రక్తసంబంధి✽ గదా! వాడికేమీ హాని చేయకూడదు” అన్నాడు. అందుకు అతడి అన్నదమ్ములు ఒప్పుకొన్నారు.
28 ✽ఇంతలో మిద్యాను దేశ వర్తకులు అటు వైపు వచ్చారు. అతడి అన్నలు యోసేపును ఆ గుంటలో నుంచి తీసి ఆ ఇష్మాయేలువాళ్ళకు ఇరవై తులాల వెండి✽కి అమ్మివేశారు. వాళ్ళు యోసేపును ఈజిప్ట్‌కు తీసుకువెళ్ళారు. 29 తరువాత రూబేను ఆ గుంటదగ్గరికి తిరిగి వచ్చి చూస్తే అందులో యోసేపు లేడు. కనుక అతడు తన బట్టలు✽ చింపుకొని, 30 తన తమ్ముళ్ళ దగ్గరికి తిరిగి వచ్చి, “చిన్నవాడు లేడే! అయ్యో! నాకేమిటి దారి!” అన్నాడు. 31 ✽అప్పుడు వాళ్ళు ఒక మేకపోతును చంపి దాని నెత్తురులో యోసేపు అంగీని ముంచి, 32 ఆ చారల నిలువుటంగీ తమ తండ్రి దగ్గరికి పంపారు. దాన్ని తెచ్చినవాళ్ళు “ఇది మాకు దొరికింది. ఇది మీ కొడుకుదో కాదో చూడండి” అన్నారు.
33 యాకోబు దాన్ని గుర్తుపట్టి “ఈ అంగీ నా కొడుకుదే! దుష్టమృగం వాణ్ణి మింగేసిందే! యోసేపు చీల్చబడ్డాడు. సందేహం లేదు” అన్నాడు.
34 అతడు తన బట్టలు చింపుకొని నడుముకు గోనెపట్ట కట్టుకొని చాలా రోజులు తన కొడుకు విషయం శోకించాడు. 35 అతని సంతానమంతా అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించారు. గానీ అతడు ఓదార్పును నిరాకరించి, “నేను శోకిస్తూనే మృత్యులోకానికి✽ నా కొడుకు దగ్గరికి వెళ్తాను” అన్నాడు. యోసేపు తండ్రి అతడికోసం అలా ఏడ్చాడు.
36 మిద్యానువాళ్ళు యోసేపును ఈజిప్ట్‌కు తీసుకువెళ్ళి పోతీఫరు అనే వ్యక్తికి అతణ్ణి అమ్మివేశారు. ఈ పోతీఫరు ఫరో దగ్గర ఉద్యోగస్తుడు, ఫరో సంరక్షక సేనాధిపతి.