36
1 ఏశావు సంతతి వాళ్ళ వంశవృక్షం ఇది: ఏశావు అంటే ఎదోం. 2 ఏశావు ఈ కనాను స్త్రీలను పెళ్ళాడాడు: హేతుజాతివాడైన ఏలోను కూతురు ఆదా, హివ్విజాతివాడైన సిబ్యోను మనుమరాలు అహోలీబామా (ఆమె తల్లి అనా). 3 అతడు ఇష్మాయేలు కూతురు బాశెమతును కూడా పెళ్ళాడాడు (ఆమె నెబాయోతు సోదరి). 4 ఏశావుకు ఆదా ఎలీఫజును కన్నది. బాశెమతు రగూయేలును కన్నది. 5 అహోలీబామా యూషునూ యాలాంనూ కోరాహునూ కన్నది. కనానుదేశంలో ఏశావుకు జన్మించిన కొడుకులు వీరే.
6 ఏశావు తన తమ్ముడు యాకోబు దగ్గరనుంచి వేరే దేశానికి వెళ్ళిపొయ్యాడు. తన భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ తన ఇంట్లో ఉండేవాళ్ళందరినీ తన మందలనూ తన పశువులన్నిటినీ కనానుదేశంలో తనకు కలిగినదంతా తీసుకువెళ్ళాడు. 7 ఎందుకంటే ఏశావూ యాకోబు ఇద్దరూ కలిసి ఒకే స్థలంలో నివాసం చేయడానికి వీలులేనంత గొప్ప ఆస్తి వారికి ఉండేది. వారికి చాలా పశువులున్నాయి గనుక, వారు పరదేశులుగా నివసించే భూమి వారికి చాలలేదు. 8 ఏశావు వెళ్ళి శేయీరు కొండసీమలో కాపురమేర్పరచుకొన్నాడు. ఏశావు అంటే ఎదోం. 9 శేయీరు కొండసీమలో ఉన్న ఎదోంవాళ్ళ ఆదిపురుషుడు ఏశావు. ఆ సంతతివాళ్ళ వంశవృక్షం ఇది:
10 ఏశావు కొడుకులెవరంటే, ఎలీఫజు (ఏశావు భార్య ఆదా కన్నవాడు). రగూయేలు (ఏశావు భార్య బాశెమతు కన్నవాడు). 11 ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాం, కనజు. 12 తిమ్నా అనే ఆమె ఏశావు కొడుకు ఎలీఫజుకు ఉంపుడుకత్తె. ఆమె ఎలీఫజుకు అమాలేకును కన్నది. ఏశావు భార్య ఆదా మనుమలు వీరే. 13 రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. ఏశావు భార్య బాశెమతు మనుమలు వీరే. 14 ఏశావు భార్య అహోలీబామా (ఆమె అనా కూతురు, అనా సిబ్యోను కూతురు) ఏశావుకు కన్న కొడుకులెవరంటే యూషు, యాలాం, కోరహు.
15 ఏశావు కొడుకుల్లో నాయకుల జాబితా ఇది: ఏశావు పెద్ద కొడుకైన ఎలీఫజు కొడుకులు – తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, 16 కోరహు నాయకుడు, గాతాం నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోం దేశంలో ఎలీఫజు సంతానం. వీరు ఆదా మనుమలు. 17 ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులెవరంటే, నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జ నాయకుడు. ఈ నాయకులు ఎదోం దేశంలో రగూయేలు సంతానం. 18 వీరు ఏశావు భార్య అహోలీబామా కొడుకులు యూషు నాయకుడు, యాలాం నాయకుడు, కోరహు నాయకుడు. ఈ నాయకులు ఏశావు భార్య అహోలీబామా (అనా కూతురు) సంతానం. 19 ఏశావు కొడుకులు వీరే, ఏదోంవాళ్ళ నాయకులు వీరే. ఏశావు అంటే ఎదోం.
20  హోరీజాతివాడైన శేయీరు కొడుకులు కూడా ఆ దేశంలో కాపురముండేవాళ్ళు. వాళ్ళెవరంటే లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దీషాను. 21 వీరు హోరీవాళ్ళ నాయకులు, ఎదోందేశంలోని శేయీరు సంతానం. 22 లోతాను కొడుకులు హారీ, హేమీం. లోతాను సోదరి తిమ్నా. 23 శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాం. 24 సిబ్యోను గాడిదలను మేపుతూ అరణ్యంలో వేడి ఊటలు కనుక్కొన్నవాడు. 25 అనా కొడుకు దిషోను, కూతురు అహోలీబామా. 26 దిషోను కొడుకులు హెమదాను ఎషబాను, ఇత్రాను, కెరాను. 27 ఏసెరు కొడుకులు బిలహాను, జవాను, ఆకాను, 28 దిషోను కొడుకులు ఊజు, అరాను. 29 హోరీ సంతతివాళ్ళలో నాయకులెవరంటే, లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, 30 దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు, వీరు వాళ్ళ వంశాలప్రకారం శేయీరుదేశంలోని హోరీ వాళ్ళ నాయకులు.
31 ఇస్రాయేల్ ప్రజలమీద ఏ రాజూ పరిపాలించకముందే ఎదోందేశంలో పరిపాలించే రాజులున్నారు. వారెవరంటే, 32 బెయారు కొడుకు బెల ఎదోంలో పరిపాలించాడు. అతడి ఊరి పేరు దిన్‌హాబా. 33 బెల చనిపొయ్యాక బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు అతడి స్థానంలో పరిపాలించాడు. 34 యోబాబు చనిపొయ్యాక తేమవాళ్ళ దేశస్థుడు హుషాం అతడి స్థానంలో పరిపాలించాడు. 35 హుషాం చనిపొయ్యాక బదదు కొడుకు హదదు అతడి స్థానంలో పరిపాలించాడు. అతడు మోయాబు మైదానాల్లో మిద్యాను జాతివాళ్ళను కొట్టినవాడు. అతడి ఊరి పేరు అవీతు. 36 హదదు చనిపొయ్యాక మశ్రేకావాడు శమ్లా అతడి స్థానంలో పరిపాలించాడు. 37 శమ్లా చనిపొయ్యాక యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న రెహబోతువాడు షావూలు అతడి స్థానములో పరిపాలించాడు. 38 షావూలు చనిపొయ్యాక అక్బోరు కొడుకు బయల్‌హానాను అతడి స్థానంలో పరిపాలించాడు. 39 అక్బోరు కొడుకు బయల్‌హానాను చనిపొయ్యాక హదరు అతడి స్థానంలో పరిపాలించాడు. అతడి ఊరిపేరు పాయు. అతడి భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కూతురు; మత్రేదు మేజహాబు కూతురు.
40 ఏశావు సంతతివాళ్ళలోని నాయకులు, వాళ్ళ వంశాలు, స్థలాలు, పేర్ల ప్రకారం ఎవరంటే, తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతీతు నాయకుడు, 41 అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, 42 కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, 43 మగ్దీయెల్ నాయకుడు, ఈరాం నాయకుడు. వీరు తమకు స్వాధీనమైన దేశంలో తమ తమ నివాస స్థలాల ప్రకారం ఎదోం నాయకులు. ఏశావు ఎదోంవాళ్ళకు ఆదిపురుషుడు.