35
1 దేవుడు యాకోబుతో “నీవు సిద్ధపడి, బేతేలుకు వెళ్ళి, అక్కడ కాపురముండు. నీవు నీ అన్న ఏశావు దగ్గరనుంచి పారిపోయినప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలివేదిక కట్టు” అన్నాడు.
2  అప్పుడు యాకోబు తన ఇంటివారితోనూ తనదగ్గర ఉన్నవారందరితోనూ ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని, మీ దుస్తులు మార్చుకోండి. 3 మనం సిద్ధపడి బేతేలుకు వెళ్ళిపోదాం. నా కష్ట సమయంలో దేవుడు నా మొర విని నేను వెళ్ళిన త్రోవలో నాకు తోడుగా ఉన్నాడు. ఆ దేవునికి బేతేలులో బలివేదిక నిర్మిస్తాను.”
4 వారు తమకున్న ఇతర దేవుళ్ళ విగ్రహాలన్నిటినీ తమ చెవులకు పెట్టుకొన్న పోగులనూ యాకోబు చేతికిచ్చారు. అతడు షెకెం దగ్గర ఉన్న సిందూర వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు. 5 వారు వెళ్ళిపోతూ ఉంటే వారి చుట్టూ ఉన్న ఊళ్ళకు దేవుడు భయం కలిగించాడు, గనుక ఆ ప్రాంతం వాళ్ళు యాకోబు కొడుకులను తరుమలేదు. 6 యాకోబు అతనితో ఉన్నవారంతా కనానుదేశంలోని లూజుకు చేరారు. లూజు అంటే బేతేల్. 7  అక్కడ అతడొక బలివేదిక కట్టి ఆ చోటికి ‘ఏల్‌బేతేల్’ అనే పేరు పెట్టాడు, ఎందుకంటే తాను తన అన్నదగ్గరనుంచి పారిపోయినప్పుడు అక్కడ తనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 8 అక్కడ రిబ్కా దాది దెబోరా చనిపోయింది. బేతేలుకు దిగువ ఉన్న సిందూర వృక్షం క్రింద ఆమెను పాతిపెట్టడం వల్ల దానికి ‘అల్లోనుబాకూత్’ అనే పేరు పెట్టారు. 9 యాకోబు పద్దన్ అరాం నుంచి వచ్చినప్పుడు అతనికి దేవుడు మరోసారి ప్రత్యక్షమై అతణ్ణి దీవించాడు. అప్పుడు దేవుడు అతనితో, 10 “నీ పేరు యాకోబు, అయితే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు; నీకు ఇస్రాయేల్ అనే పేరు ఉంటుంది” అని చెప్పి అతనికి “ఇస్రాయేల్” అనే పేరు పెట్టాడు.
11  దేవుడు అతనితో ఇంకా అన్నాడు, “నేను అమిత శక్తిగల దేవుణ్ణి. నీవు ఫలించి సంఖ్యలో అధికం కావాలి. నీ మూలంగా ఒక జనమూ, అనేక జనాలూ కలుగుతాయి. నీ సంతానంలో రాజులు ఉంటారు. 12 నేను అబ్రాహాముకూ ఇస్సాకుకూ ఇచ్చిన ఈ దేశాన్ని నీకూ నీ తరువాత నీ సంతానానికీ ఇస్తాను.”
13 దేవుడు తాను అతనితో మాట్లాడిన స్థలం నుంచి పైకి వెళ్ళిపోయాడు. 14 యాకోబు తనతో దేవుడు మాట్లాడిన స్థలంలో జ్ఞాపకార్థమైన రాతిస్తంభాన్ని స్మృతిచిహ్నంగా నిలిపి, దానిమీద పానార్పణం చేసి, నూనె పోశాడు. 15 తనతో దేవుడు మాట్లాడిన స్థలానికి ‘బేతేల్’ అనే పేరు పెట్టాడు యాకోబు.
16 తరువాత వారు బేతేల్ నుంచి ప్రయాణమై ఎఫ్రాతా మార్గాన వెళ్ళిపోతున్నారు. ఆ స్థలం ఇంకా కొంత దూరాన ఉన్నప్పుడు, రాహేలుకు ప్రసవవేదన వచ్చింది. దానివల్ల ఆమెకు చాలా కష్టం కలిగింది. 17 ఆమె చాలా కష్టంతో ప్రసవించగా మంత్రసాని ఆమెతో “భయపడకు, నీకు మరో కొడుకు పుట్టాడు” అంది. 18 అప్పుడు రాహేలు చనిపోయింది. ప్రాణం విడిచే క్షణంలో తన కొడుకు పేరు “బెనోని” అన్నది. కాని, అతని తండ్రి అతనికి “బెన్యామీను” అనే పేరు పెట్టాడు. 19 అలా రాహేలు చనిపోయిన తరువాత ఆమెను ఎఫ్రాతా మార్గాన పాతిపెట్టారు. ఎఫ్రాతా అంటే బేత్‌లెహేం. 20 యాకోబు ఆమె సమాధిమీద ఒక జ్ఞాపకార్థ స్తంభం నిలిపాడు. నేటి వరకు రాహేలు సమాధి మీద ఉండే స్తంభం అదే.
21 ఇస్రాయేల్ ప్రయాణమై వెళ్ళి మిగ్దల్ ఎదెరుకు అవతల తన గుడారం వేసుకొన్నాడు. 22  ఇస్రాయేల్ ఆ ప్రదేశంలో కాపురమున్నప్పుడు జరిగినదేమిటంటే, రూబేను తన తండ్రి ఉంచుకున్న బిల్హాతో పోయాడు. ఆ సంగతి ఇస్రాయేల్‌కు వినవచ్చింది కూడా.
23 యాకోబు కొడుకులు పన్నెండుమంది. లేయా కన్నవారు రూబేను (అతడు యాకోబు పెద్ద కొడుకు), షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాకారు, జెబూలూను. 24 రాహేలు కన్నవారు యోసేపు, బెన్యామీను. 25 రాహేలు దాసి బిల్హా కన్నవారు దాను, నఫ్తాలి. 26 లేయా దాసి జిల్పా కన్నవారు గాదు, ఆషేరు. వీరు పద్దన్ ఆరాంలో యాకోబుకు జన్మించిన కొడుకులు.
27 తరువాత యాకోబు మమ్రేకు తన తండ్రి ఇస్సాకు దగ్గరకు వెళ్ళాడు. మమ్రే అంటే హెబ్రోను. అక్కడ అబ్రాహాము, ఇస్సాకు కొంత కాలం కాపురమున్నారు. 28 ఇస్సాకు జీవించిన కాలం నూట ఎనభై ఏళ్ళు. 29 ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి, తన పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.