34
1 యాకోబుకు లేయా కనిన కూతురు దీనా ఆ ప్రాంతం అమ్మాయిలను చూడడానికి వెళ్ళింది. 2 ఆ ప్రాంతంలోని నాయకుడు హివ్వి జాతివాడైన హమోరు. అతడి కొడుకు షెకెం దీనాను చూచి ఆమెను ఎత్తుకుపోయి చెరిచి అవమానపరిచాడు.
3 యాకోబు కూతురు దీనా మీదే అతడి మనస్సు ఉంది. ఆ అమ్మాయి అంటే అతనికి ప్రేమ, గనుక ఆమెతో ఆదరంగా మాట్లాడాడు. 4 అంతేగాక షెకెం తన తండ్రి హమోరుతో మాట్లాడి “ఈ అమ్మాయిని నాకు పెళ్ళి చెయ్యి” అన్నాడు.
5 షెకెం తన కూతురును అశుద్ధం చేశాడని యాకోబుకు వినవచ్చింది. తన కొడుకులు తన పశువుల దగ్గర మైదానాల్లో ఉండడం చేత వారు వచ్చేవరకు యాకోబు ఊరుకొన్నాడు. 6 షెకెం తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడదామని అతనిదగ్గరికి వచ్చాడు. 7 ఈ సంగతి విని యాకోబు కొడుకులు మైదానాల నుంచి వచ్చారు. షెకెం యాకోబు కూతురును చెరిచి, ఇస్రాయేల్ ప్రజల మధ్యలో నీచమైన పని చేసినందుకు, చేయరానిది చేసినందుకు వారికి సంతాపమూ, చాలా కోపమూ ముంచుకు వచ్చాయి. 8 హమోరు వారితో ఇలా చెప్పాడు:
“మీ కూతురంటే నా కొడుకు షెకెంకు ప్రాణం. దయచేసి మీరు ఆమెను అతడికిచ్చి పెళ్ళి చెయ్యండి. 9 అంతేగాక, మీ పిల్లల్ని మాకిచ్చి, మా పిల్లల్ని మీరు పుచ్చుకొని వియ్యమందుదాం. 10 మీరు మా దగ్గర కాపురమేర్పరచుకోండి. ఈ ప్రదేశం మీ ఎదుట ఉంది. ఇందులో మీరు నివసించి, వ్యాపారం చేసి, ఆస్తి సంపాదించుకోండి.”
11 పైగా, దీనాయొక్క తండ్రితోనూ, ఆమె అన్నదమ్ములతోనూ షెకెం “మీరు నన్ను దయతో చూస్తే మీరేం అడిగినా అది ఇస్తాను. 12 కట్నమూ కానుకా ఎంతైనా అడగండి. మీరు అడిగేదంతా ఇస్తాను. మీరు ఆ అమ్మాయిని మాత్రం నాకివ్వండి” అన్నాడు.
13 అయితే షెకెం తమ చెల్లెలు దీనాను అశుద్ధం చేసినందుకు యాకోబు కొడుకులు షెకెంకూ అతడి తండ్రికీ కపటంగా ఇలా జవాబిచ్చారు:
14 “ఇలాంటిదాన్ని మేము చెయ్యలేము. సున్నతి సంస్కారం పొందనివాడికి మా చెల్లెల్ని ఇవ్వలేము. అది మాకు అప్రతిష్ఠ. 15 మేము మీ మాటకు ఒప్పుకోవాలంటే ఒక షరతు ఉంది. మాలాగే మీలో ప్రతి మగవాడూ సున్నతి పొందితేనే, 16 మా పిల్లల్ని మీకిస్తాం, మీ పిల్లల్ని చేసుకుంటాం. మీ మధ్యలో కాపురముంటాం. మనమంతా ఒకటి అవుతాం. 17 కానీ, మీరు మా మాట వినకుండా సున్నతి పొందకుండా ఉంటే మా పిల్లను తీసుకువెళ్తాం.”
18 ఈ మాటలు హమోరుకూ, హమోరు కొడుకుకూ నచ్చాయి. 19 యాకోబు కూతురంటే ఆ అబ్బాయికి చాలా ప్రేమ, గనుక వారి మాటల ప్రకారం చేయడానికి ఆలస్యం చెయ్యలేదు. తన తండ్రి ఇంటివారందరిలో అతడే ఘనుడు కూడా. 20 హమోరు, అతడి కొడుకు షెకెం తమ ఊరి ద్వారానికి వెళ్ళి, ఆ ఊరివారితో ఇలా చెప్పారు:
21 “ఆ మనుషులు మనతో స్నేహంగా ఉన్నారు. గనుక వాళ్ళను ఈ ప్రదేశంలో ఉండనిచ్చి వ్యాపారం చెయ్యనియ్యండి. ఈ ప్రదేశం వాళ్ళకు కూడా చాలినంత విశాలంగా ఉంది. వాళ్ళ పిల్లల్ని పెళ్ళాడి, మన పిల్లల్ని వాళ్ళకిద్దాం. 22 అయితే మన మధ్యలో నివసించి మనతోపాటు ఒకే ప్రజ కావడానికి ఆ మనుషులు ఒకే షరతుమీద ఒప్పుకుంటారట. ఆ షరతేమిటంటే, వాళ్ళలాగే మనలో ప్రతి మగవాడూ సున్నతి పొందితీరాలి. 23 వాళ్ళ పశువులూ, ఆస్తీ, మందలన్నీ మనవే అవుతాయి గదా! అంచేత మనం వాళ్ళ మాటకు ఒప్పుకుందాం. అప్పుడు వాళ్ళు మన మధ్యలో కాపురముంటారు.”
24 కనుక అతడి ఊరిద్వారం గుండా వెళ్ళేవారంతా హమోరు, అతడి కొడుకు షెకెం చెప్పిన మాటకు ఒప్పుకొన్నారు. అప్పుడు ఆ ఊరిద్వారం గుండా వెళ్ళేవారిలో మగవాళ్ళంతా సున్నతి పొందారు. 25 మూడో రోజున వాళ్ళు బాధ పడుతూ ఉంటే, యాకోబు కొడుకుల్లో ఇద్దరు, అంటే దీనా సొంత అన్నలు షిమ్యోను, లేవీ తమ ఖడ్గాలు చేతపట్టుకొని దొంగచాటుగా ఆ ఊరిపైబడి మగవాళ్ళందరినీ హతమార్చారు. 26 వారు హమోరునూ అతడి కొడుకు షెకెంనూ కూడా కత్తితో చంపి షెకెం ఇంట్లోనుంచి దీనాను తీసుకుపొయ్యారు. 27 అక్కడివాళ్ళు తమ చెల్లెలును అశుద్ధం చేసినందుచేత యాకోబు మిగతా కొడుకులు హతమైన వాళ్ళదగ్గరికి వెళ్ళి ఆ ఊరు దోచుకొన్నారు. 28 వారి గాడిదలనూ, పశువులనూ, మందలనూ, ఊళ్ళో ఉన్నదీ, పొలాల్లో ఉన్నదీ పట్టుకొన్నారు. 29 వారి ద్రవ్యమంతా పట్టుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలనూ చెరపట్టి వారి ఇండ్లలో ఉన్నదంతా కూడా కొల్లగొట్టారు.
30 యాకోబు షిమ్యోనునూ లేవీనీ చూచి “మీరు నా నెత్తిమీదికి కీడు తెచ్చిపెట్టి, ఈ దేశంలో నివసిస్తున్న కనాను జాతివాళ్ళలో, పెరిజ్జి జాతివాళ్ళలో నా పేరును చెడగొట్టారు. నావారు కొద్దిమందే, గనుక వాళ్ళు గుమికూడి నాపైబడి నన్ను చంపుతారు. నేనూ నా ఇంటివారూ నాశనం అవుతాం” అన్నాడు.
31 అందుకు వారు “మా చెల్లెల్ని అతడు పడుపు స్త్రీగా ఎంచి వ్యవహరించడం న్యాయమా?” అని బదులు చెప్పారు.