33
1 యాకోబు తలెత్తి చూస్తూ ఉంటే ఏశావూ అతనితోపాటు నాలుగు వందలమంది వస్తూ కనిపించారు. 2 అప్పుడతడు తన పిల్లలను లేయాకూ రాహేలుకూ ఇద్దరు దాసీలకూ అప్పగించాడు. ముందర దాసీలనూ వాళ్ళ పిల్లలనూ, వాళ్ళ వెనుక లేయానూ ఆమె పిల్లలనూ, ఆ వెనుక రాహేలునూ యోసేపునూ ఉంచాడు. 3 తానేమో వారికి ముందుగా వెళ్తూ తన అన్న దగ్గరికి చేరే వరకు ఏడుసార్లు నేలకు వంగాడు.
4 ఏశావు అతణ్ణి కలుసుకోవడానికి పరుగెత్తి ఆలింగనం చేసుకొన్నాడు. కావలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఏడ్చారు. 5 ఏశావు తలెత్తి ఆ స్త్రీలనూ పిల్లలనూ చూచి “నీతో ఉన్న వీళ్ళెవరు?” అని అడిగాడు. “మీ సేవకుడైన నాకు దేవుడు ప్రసాదించిన పిల్లల”ని అతడు జవాబిచ్చాడు.
6 అప్పుడు ఆ దాసీలూ వారి పిల్లలూ దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు. 7 లేయా, ఆమె పిల్లలు కూడా దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు. చిట్టచివర యోసేపూ, రాహేలూ దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు.
8 ఏశావు అన్నాడు “నాకు ఎదురుగా ఆ గుంపంతా ఎందుకు వచ్చినట్టు?” యాకోబు “నా యజమానులు మీరు. మమ్మల్ని దయ చూచేందుకు అది మా కానుక” అన్నాడు.
9 ఏశావు “తమ్ముడా, నాకు చాలినంత ఉంది. నీది నీవే ఉంచుకో” అన్నాడు. 10 “అలా కాదండి, మీకే గనుక నామీద దయ ఉంటే నేనిచ్చే కానుక పుచ్చుకోండి. దేవుని ముఖం చూచినట్టు మీ ముఖం చూశాను. మీరు నన్ను కటాక్షించి స్వీకరించారు కూడా. 11 నేను మీ దగ్గరికి తెచ్చిన కానుకను దయచేసి పుచ్చుకోండి. దేవుడు నా మీద అనుగ్రహం చూపాడు, గనుక నాకు కావలసినంతా ఉంది” అన్నాడు యాకోబు. బలవంతం మీద ఏశావు దాన్ని పుచ్చుకొన్నాడు.
12 అప్పుడు ఏశావు “ప్రయాణం సాగిద్దాం పద. నేను నీకు ముందుగా సాగుతాను” అన్నాడు.
13 అందుకు యాకోబు “ఈ పిల్లలు ఏమంత బలంగా లేరనీ, ఈ మందలు పిల్లలకు పాలిస్తున్నవి గనుక వాటి విషయం నేను శ్రద్ధ తీసుకోవాలనీ నా యజమానులైన మీకు తెలుసు గదా. ఒక్క రోజైనా ఎక్కువగా వాటిని తోలామంటే మందంతా చస్తుంది. 14 దయచేసి నా యజమానులైన మీరు మీ సేవకుడైన నాకు ముందుగా వెళ్ళండి. నేను నా యజమానులైన మీ దగ్గరకు శేయీరు ప్రాంతానికి వచ్చేదాకా మెల్లగా ప్రయాణిస్తాను. నా ముందర ఉన్న ఈ మందలూ, పిల్లలూ నడవగలిగిన కొద్దీ ప్రయాణం సాగిస్తాను” అన్నాడు.
15 ఏశావు “అలాగైతే నా దగ్గర ఉన్నవాళ్ళలో కొంతమందిని నీ దగ్గర ఉండనియ్యి” అన్నాడు. అందుకతడు “అదంతా ఎందుకు? మీరు నన్ను దయ చూస్తే నాకు అదే చాలు” అన్నాడు.
16 ఆ రోజే ఏశావు తన దారి పట్టి శేయీరుకు తిరిగి వెళ్ళాడు. 17 యాకోబైతే సుక్కోతు అనే స్థలానికి ప్రయాణమైపోయి అక్కడ తనకొక ఇల్లు కట్టుకొని తన పశువులకు పాకలు వేశాడు. అందుచేత ఆ చోటికి సుక్కోతు అనే పేరు వచ్చింది.
18 యాకోబు పద్దన్అరాం నుంచి వచ్చాక కనానుదేశంలో ఉన్న షెకెం అనే ఊరి చివరికి సురక్షితంగా చేరి ఆ ఊరి ముందు తన డేరా వేసుకొన్నాడు.
19 అంతేగాక, తన డేరా వేసిన మైదానం హమోరు కొడుకుల దగ్గర నూరు వెండి నాణేలకు కొనుక్కొన్నాడు. హమోరు షెకెం అనే అతడికి తండ్రి. 20 యాకోబు అక్కడ బలివేదిక కట్టి దానికి ‘ఎల్ ఎలోహేయి ఇస్రాయేల్’ అనే పేరు పెట్టాడు.